అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేందుకు వీలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, మన రాష్ట్రంలో ఆగస్టులో జరిగిన ముఖ్యమైన సంఘటనలు.. పరిణామాలు.. వార్తల్లో వ్యక్తులు..
జాతీయం
అటల్ ర్యాంకింగ్స్
ఆగస్ట్ 18న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్స్ (ఏఆర్‌ఐఐఏ) ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ నుంచి 17, తెలంగాణ నుంచి 30 సంస్థలకు ర్యాంకులు దక్కాయి. టాప్–10లో హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (10ర్యాంక్) నిలిచింది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరస మూడు స్థానాల్లో నిలిచాయి. 11 నుంచి 25 ర్యాంకుల్లో ఐఐటీ హైద్రాబాద్, ఎన్‌ఐటీ వరంగల్ నిలిచాయి.
బెస్ట్ సిటీగా హైదరాబాద్
స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకుల్లో 40 లక్షలకు పైబడిన జనాభా కలిగిన పట్టణాల్లో హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్’ లకేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సిటిజన్ లెడ్ ఇనిషియేటివ్ కేటగిరీ’లో కరీంనగర్ అగ్రస్థానం సాధించింది. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన పట్టణాల్లో దక్షిణాదిలో ‘బెస్ట్ ఫాస్టెస్ట్ మూవర్ సిటీ’గా జహీరాబాద్ నిలిచింది. 25 వేల నుంచి 50వేల జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో క్లీన్ సిటీగా మేడ్చల్ మున్సిపాలిటీకి(సౌత్ఇండియా)ప్రథమ స్థానం దక్కింది. లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో జాతీయ స్థాయిలో కరీంనగర్ 72, నిజామాబాద్ 133వ స్థానంలో నిలిచాయి. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో జోనల్ స్థాయిలో సిరిసిల్ల 16, సిద్దిపేట 27, జహీరాబాద్ 31, గద్వాల 38, బోడుప్పల్ 42, వనపర్తి 51వ స్థానాల్లో నిలిచాయి. 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో హుజూర్ నగర్ 9, షాద్‌నగర్ 15, మెదక్ 24, కల్వకుర్తి 26వ స్థానం సాధించాయి.
ఏపీకి మూడు రాజధానుల బిల్లు ఆమోదం
అమరావతి రాజధానిని వికేంద్రీకరిస్తూ అమరావతి(శాసన), కర్నూలు(న్యాయ), విశాఖపట్నం(సచివాలయ) రాజధానులుగా ఆమోదిస్తూ ప్రభుత్వం రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి’ బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ జూలై 31న ఆమోదించారు. ఈ బిల్లును తొలిసారి ఏపీ ప్రభుత్వం 2020 జనవరి 20న రూపొందించింది. తిరిగి జూన్ 16న రూపొందించగా శాసన మండలి చైర్మన్ దీనిని సమగ్ర పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించారు. కాని కమిటీలు ఏర్పడకపోవడంతో ప్రభుత్వం ఈ బిల్లును రాజ్యాంగంలోని 197(1), (2) ఆర్టికల్స్ ప్రకారం గవర్నర్‌కు పంపగా దానిని ఆమోదించారు. దీనితోపాటు 2014 డిసెంబర్ 22న ఆమోదించిన క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేస్తూ.. రూపొందించిన బిల్లు కూడా జూలై 1న ఆమోదించారు. దీని ప్రకారం రాజ్‌భవన్ విశాఖపట్నంలో ఉంటుంది.
శ్రీశైలం ఘటనపై విచారణ కమిటీ:
ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం విచారణ కోసం నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా రఘుమారెడ్డి, సభ్యులుగా వెంకటరాజం, సచ్చిదానందం, జగత్రెడ్డిలు వ్యవహరిస్తారు. నాగర్ కర్నూల్లోని ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో గల ఈ విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లు ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 900 మెగావాట్లు. రాష్ట్రంలో11 జల విద్యుత్ కేంద్రాలుండగా శ్రీశైలం 900, నాగార్జున సాగర్ 815.60 మెగావాట్ల సామర్థ్యంతో 70.25 శాతం జల విద్యుత్ వాటాను కలిగి ఉన్నాయి.
రాఫెల్ తొలి పైలట్‌గా హిలాల్ అహ్మద్
రాఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్ కామడొర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ నిలిచారు. కశ్మీర్‌కు చెందిన హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుంచి జూలై 27న బయలుదేరిన తొలి బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, మిగ్ 21, కిరణ్ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్ అవర్స్‌ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర ఆయనకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్‌గా ఘనత సాధించారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్‌నాగ్‌లో హిలాల్ జన్మించారు. ఆయన తండ్రి మొహమ్మద్ అబ్దుల్లా రాథోడ్ జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్‌లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్‌ను హిలాల్ సాధించారు.
కార్బెట్ రిజర్వ్‌లో 231 పులులు
జూలై 29న గ్లోబల్ టైగర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని 2019 ఏడాది చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జూలై 28న ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం… దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్‌లో 127 పులులు ఉన్నాయి. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు.
రాజ్యసభలో ప్యానల్ చైర్మన్స్
రాజ్యసభ, వైస్ చైర్మన్‌లు లేని సమయంలో సభా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆరుగురు సభ్యులతో ప్యానల్ ఆఫ్ చైర్మన్స్‌ను నియమించారు. వీరిలో భువనేశ్వర్ కలిటా, సురేంద్రసింగ్ నాగల్(బీజేపీ), ఎల్ .హన్మంతయ్య(కాంగ్రెస్), వందనా చవాన్( నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), సుఖేందు శేకర్ రాయ్( ఆలిండియా తృణముల్ కాంగ్రెస్), సుస్మిత్ పాత్ర(బిజూ జనతాపార్టీ) ఉన్నారు.
తొలి తేనే పరీక్షా కేంద్రం
ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి తొలి తేనే పరీక్షా కేంద్రాన్ని గుజరాత్‌లోని ఆనంద్‌లో జులై 25న ఏర్పాటు చేశారు. సమగ్ర ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమం, జాతీయ తేనేటీగల పెంపక విధానంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రయోగ శాలకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లాబరేటరీస్(ఎన్‌ఏబీఎల్) ఆమోదం తెలిపింది.
ఆయోధ్యలో రామమందిరం:
1992 డిసెంబర్ 6న కూల్చివేతకు గురైన బాబ్రిమసీద్ స్థానంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోడి 40 కిలోల వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. 69 ఎకరాలలో 3 అంతస్తులలో, 161 అడుగుల ఎత్తుతో అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్న ఈ ఆలయానికి 366 స్తంభాలుంటాయి. మూడున్నర సంవత్సరాల్లో రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం(కాంబోడియా), తమిళనాడులోని తిరుచ్చనేపల్లిలో గల శ్రీరంగనాథ ఆలయం తర్వాత ఇది ప్రపంచంలోని మూడో అతిపెద్ద హిందు దేవాలయం.
గ్రీన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్
ప్రపంచంలో ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ధరిత్ర సదస్సు–1992 ఒప్పందంలో భాగంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటి సహకారంతో మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లాంటి అయిదు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జులై 29న దీనిని ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రంగా మిజోరం నిలిచింది. రాష్ట్రంలోని లాంగ్లే, మమిత్ జిల్లాలతోపాటు దంపా టైగర్ రిజర్వ్, థోరాంగ్ట్యాంగ్ వైల్డ్‌లైఫ్ సాంక్చుయురీల పరిధిలో దీనిని ప్రవేశపెడుతున్నారు.వాతావరణ, జీవవైవిధ్య అనుకూల విధానాలను పాటిస్తూ.. గ్రీన్లాండ్ మేనేజ్మెంట్ పద్ధతులను అలవరుచుకొంటూ భారత వ్యవసాయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటం దీని లక్ష్యం.
గ్రామోద్యోగ్ వికాస్ యోజన:
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్ఎంఈ) జూలై 30న ‘గ్రామోద్యోగ్ వికాస్ యోజన’ పథకంలో భాగంగా గ్రామాల్లో అగర్బత్తీల పరిశ్రమ స్థాపనను ఆమోదించింది. ఖాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ దీనికి కావాల్సిన శిక్షణ అందిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ 40 మిక్సింగ్ యంత్రాలు, 200 తయారీ యంత్రాలను అందిస్తుంది. దీని వల్ల 500 ఉద్యోగాల కల్పనతోపాటు విదేశాల నుంచి అగర్బత్తుల దిగుమతి తగ్గనుంది.
ఏక్ మాస్క్– అనేక్ జిందగి
కోవిడ్–19ను అరికట్టడంలో మాస్క్ ఆవశ్యకతను ప్రచారం చేస్తూ.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. ఆగస్టు 1 నుంచి 15 వరకు కొనసాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా మాస్క్ బ్యాంకులను స్థాపించి, ఎన్జీవోల ద్వారా పంపిణీ చేస్తారు.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్
నేషనల్ డిజిటల్ హెల్ మిషన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 15న ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. దీంట్లో ఆరోగ్య సమాచారం, వాడుతున్న మందులు, మెడికల్ రిపోర్ట్స్‌ను ఆప్‌లోడ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో ఎవరైనా.. ఎక్కడైనా ఆస్పత్రికి వెళ్తే ఒక్క క్లిక్‌తోనే రోగి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునే వీలుకలగనుంది.
శౌర్యచక్ర అవార్డులు-2020
శౌర్యచక్ర–2020 అవార్డులను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీ నుంచి ముగ్గురు, వైమానికదళం నుంచి ఒకరు ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న లెఫ్టినెంట్ కల్నల్ క్రిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవాల్దార్ అలోక్ కుమార్ దూబే ఆర్మీ నుంచి, ఎయిర్‌ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ విశాక్ నాయర్ శౌర్యచక్రకు ఎంపికయ్యారు.
జార్ఖండ్ నూతన లోగో
74వ స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రం నూతన ప్రభుత్వ లోగోను ఆవిష్కరించింది. దీనిలో ఐదు వలయాలు ఉన్నాయి. జార్ఖండ్ ప్రభుత్వం పేరు ఇంగ్లిష్, హిందీ భాషల్లో , రాష్ట్ర జంతువు ఏనుగులు, రాష్ట్ర పుష్పం, రాష్ట్ర ఉద్యమ పోరాటానికి గుర్తుగా మోదుగు పువ్వులు, సాంస్కృతిక చిహ్నంగా నృత్య రూపాలు, ఆశోక ధర్మ చక్రం , సత్యమేవ జయతే ఉన్నాయి.
స్మారక స్టాంపులు విడుదల
యూనెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు పొందిన ఐదు భారత ప్రాచీన కట్టడాల పోస్టల్ స్టాంపులను తపాలశాఖ ఆగస్ట్ 15న విడుదల చేసింది. వాటిలో 2017లో గుర్తింపు పొందిన అహ్మదాబాద్‌లోని సర్కేజ్‌రోజా మసీదు, గోవాలోని చర్చిలు, మసీదులు(1986), మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయాలు, జవేరి దేవాలయం(1986), కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లాలోని పట్టడక్కల్ దేవాలయాలు(1987), ఢిల్లీలోని కుతుబ్‌మినార్(1993) ఉన్నాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ధోని గుడ్‌బై
టీమ్ ఇండియా మాజీ కెప్టెన మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఆగస్ట్ 15న గుడ్ బై చెప్పారు జార్ఖండ్ రాజధాని రాంచీలో 1981, జూలై 7న జన్మించిన ధోని 2004 డిసెంబర్ 23న తన తొలి వన్డేతో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. తన చివరి మ్యాచ్‌ను 2019 ఏడాది వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో 2019, జులై 10న ఆడాడు. 2014 డిసెంబర్‌లోనే మిస్టర్ కూల్ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం సైన్యంలో ‘లెఫ్టినెంట్ కల్నల్’ హోధాలో ధోని ఉన్నాడు. 2007 వరల్డ్ కప్ ధోని సారథ్యంలో ఇండియా విజయం సాధించింది.
రాజీవ్‌ఖేల్‌రత్నా–2020
అత్యున్నత క్రీడా అవార్డు…రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు ప్లేయర్లను సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. క్రికెటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రెజ్లర్ వినేశ్ పోగట్, టీటీ ప్లేయర్ మానికా బత్రా, పారాఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత మరియప్పన్ తంగవేలు ఉన్నారు. క్రీడా మంత్రిత్వశాఖకు చెందిన సెలక్షన్ కమిటీ ఈ నలుగురి పేర్లను సూచించింది. అత్యున్నత క్రీడా అవార్డుకు నలుగురు క్రీడాకారులు నామినేట్ కావడం ఇది రెండవసారి. 2016లో కూడా నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. సెలక్షన్ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్, మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లు ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం(ఆగస్టు-18) కమిటీ భేటీ అయ్యింది.
ఐపీఎల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) –2020 టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ ‘డ్రీమ్ 11’ సొంతం చేసుకుంది. ఇందుకోసం డ్రీమ్ 11 రూ. 222 కోట్లు చెల్లించనుంది డ్రీమ్ 11తో పాటు రెండో స్థానంలో బైజూస్ (రూ. 201 కోట్లు), అన్ అకాడమీ (రూ. 170 కోట్లు) నిలిచాయి. గతేడాది స్పాన్సర్ షిప్‌గా వ్యవహరించిన వివో సంస్థ రూ. 440 కోట్లు చెల్లించింది. అప్పటితో పోలిస్తే ఈ ఏడాది 40శాతం కంటే తక్కువకే స్పాన్సర్ షిప్ దక్కించుకుంది డ్రీమ్ 11.
భారత్‌లో అతిపెద్ద రోప్ వే స్టార్ట్:
భారత్‌లో అతిపెద్ద నది ఆధారిత రోప్‌వే ఆగస్టు 24న బ్రహ్మపుత్ర నదిపై గువహటి వద్ద ప్రారంభించారు.2 కిలోమీటర్ల పొడవు గల ఈ రోప్‌వే నిర్మాణం కోసం 56 కోట్ల వ్యయం వెచ్చించారు. 2006లో నిర్మాణం ప్రారంభించారు. ప్రయాణ సమయం 1 గంట నుంచి 7 నిమిషాలకు తగ్గింది. బ్రహ్మపుత్ర నదిపై ప్రమాదకర ఫెర్రి ప్రయోగాలు నివారించి టూరిజంను అభివృద్ధి పరచడం దీని ప్రధాన లక్ష్మం. 2008 అస్సాం టురిజం పాలసి ప్రకారం ఈశాన్య రాష్ట్రాలలో అస్సాంను టూరిజం హబ్‌గా మార్చాల్సి ఉంది.
నిర్మాణ మజ్దూర్ రిజిస్ట్రేషన్ అభియాన్:
నిర్మాణ రంగానికి సంబంధించిన 18 పథకాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ ఆగస్టు 23న ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణ మజ్దూర్ రిజిస్ట్రేషన్ అభియాన్. ఈ కార్యక్రమంలో భాగంగా కూలీ, మేస్త్రీ, ప్లంబర్, ఎలక్ర్టిసిటీ సిట్టింగ్ లాంటి పనులలో నిష్ణాతులైన వారు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18 నుంచి 60 ఏళ్ల వయస్సు వారికి అర్హత ఉంటుంది. రిజస్ర్టేషన్ కోసం ఒక్కో నియోజకవర్గంలో ఒక పాఠశాల చొప్పున 70 నియోజక వర్గాలలో ఏర్పాట్లు చేశారు.
జాతీయ జనాభా కమిషన్ నివేదిక:
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని చేసే జనాభా కమిషన్ ‘పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఫర్ ఇండియా అండ్ స్టేట్స్ 2011–2036’ పేరుతో రూపొందించిన నివేదికలో 2011 జనాభా అంశాలు 2036 నాటికి ఏ విధంగా మారనున్నాయిని అంచనా వేశారు. దీని ప్రకారం 2036 నాటికి స్త్రీ, పురుష లింగ నిష్పత్తి 957(2011లో 940), నవజాత శిశు మరణాలు, ప్రతి వెయ్యికి 30(2011లో 40)కి తగ్గునని పేర్కొంది. యువత(15–24 సంవత్సరాలు) 2011లో 23.3 కోట్లు ఉండగా 2036 నాటికి 22.7 కోట్లకు చేరి మొత్తం జనాభాలో 14.9 శాతం వరకు చేరనుంది. పట్టణ జనాభా 2011లో 31.8 శాతం ఉండగా 2036 నాటికి పురుషులలో 66 నుంచి 69 సంవత్సరాలు కాగా మహిళలలో 71–74 సంవత్సరాలుగా అంచనా వేసింది.
ఎగుమతి సంసిద్ధత సూచీలో గుజరాత్ టాప్
నీతి ఆయోగ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటెటివ్నెస్ భాగస్వామ్యంతో తొలిసారిగా రూపొందించిన ‘ఎగుమతి సంసిద్ధత సూచి–2020’లో గుజరాత్(75.19), మహారాష్ట్ర(75.14), తమిళనాడు(64.93), రాజస్థాన్(62.59), ఒడిశా(58.23లు వరుసగా తొలి అయిదు స్థానాలలో నిలిచాయి. కేటగిరీల వారీగా పరిశీలిస్తే కోస్టల్ ప్రాంత రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు స్థానాలలో నిలవగా, భూ పరివేష్టిత రాష్ట్రాలలో రాజస్థాన్, తెలంగాణ, హర్యానా, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లి, గోవా, చండీఘడ్లు, హిమాలయ రాష్ట్రాలలో ఉత్తరాఖండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఎగుమతి రంగ వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, సమస్యల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
స్పోర్ట్స్
గ్రాండ్‌ప్రి విజేత నెదర్లాండ్స్
ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్) విజేతగా నిలిచాడు. ఇంగ్లండ్ లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో ఆగస్టు 9న జరిగిన ఈ రేసులో నిర్ణీత 52 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్ గంటా 19 నిమిషాల 41.993సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో… వాల్తెరిబొటాస్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్ లో వెర్‌స్టాపెన్ కు ఇది తొలి విజయం కాగా… ఓవరాల్‌గా కెరీర్‌లో ఇది తొమ్మిదో ఎఫ్1 టైటిల్. ఈ సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన బొటాస్ నెగ్గగా… తర్వాతి మూడు రేసుల్లో హామిల్టన్(మెర్సిడెస్ జట్టు) చాంపియన్ గా నిలిచాడు.
పలెర్మో ఓపెన్ విజేతగా ఫియోనా
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) అంతర్జాతీయ అధికారిక టెన్నిస్ టోర్నమెంట్ పలెర్మో ఓపెన్‌లో ఫ్రాన్స్ రైజింగ్ స్టార్ క్రీడాకారిణి ఫియోనాఫెరో చాంపియన్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం ఇటలీలోని పలెర్మోలో ఆగస్టు 10న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 53వ ర్యాంకర్ ఫియోనాఫెరో 6–2, 7–5తో ప్రపంచ 22వ ర్యాంకర్, నాలుగో సీడ్ అనెట్ కొంటెవి (ఎస్తోనియా)పై విజయం సాధించింది.
పాప్‌లర్ క్రికెటర్‌గా కోహ్లీ
ప్రపంచంలోనే పాప్‌లర్ క్రికెటర్‌గా కోహ్లి తన రికార్డ్ నమోదు చేసుకున్నాడు. అనిసెమ్‌రష్ సంస్థ చేసిన అధ్యయనంలో 2020, జనవరి నుంచి జూన్ వరకు నెలకు సగటున 16.2 లక్షల సార్లు కోహ్లి పేరును ఇంటర్నెట్‌లో వెతికారు. ఆ తర్వాతి స్థానాల్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (9.7 లక్షలు), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (9.4 లక్షలు) గురించి ఆరా తీశారు. వీరి తర్వాత జార్జి మకాయ్ (9.1 లక్షలు), జోష్ రిచర్డ్స్ (7.1 లక్షలు), హార్దిక్ పాండ్యా (6.7 లక్షలు), సచిన్ టెండూల్కర్ (5.4 లక్షలు), క్రిస్ మాథ్యూస్ (4.1 లక్షలు), శ్రేయస్ అయ్యర్ (3.4 లక్షలు) ఉన్నారు. మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (12వ స్థానం), ఆసీస్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ (20వ స్థానం) టాప్–20లో నిలిచారు.
ఇంటర్నేషనల్:
గాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు
మహాత్మాగాంధీ వాడినవని భావిస్తున్న బంగారుపూత గల కళ్లద్దాలను బ్రిటన్ వేలం వేయగా రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్‌ఆక్షన్స్ సంస్థ నిర్వహించిన ఈ వేలంలో కళ్లజోడు రూ. 2.55 కోట్ల(2,60,000 పౌండ్ల)కు అమ్ముడైంది. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చే ముందు ఈ కళ్లజోడును తమ బంధువుకు ఇచ్చారని, అది కొన్నేళ్లుగా ఇంట్లోనే ఉంటుందని బ్రిటన్ లోని సౌత్ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే ఓ వ్యక్తి తెలిపాడు. ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా ఆయన కోరగా ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు ఈ వేలం పాటలో పాల్గొన్నారు.
లీడర్షిప్ అవార్డులు–2020:
భారత్– అమెరికాల మధ్య ఆర్థిక, వ్యవస్థాపక, ఉపాధి కల్పన, ఆవిష్కరణల కోసం పరస్పరం సహకరించుకోవడం కోసం ఉద్దేశించిన యూఎస్ఐఎస్పీఎఫ్ సంస్థ ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ అవార్డులను 2020 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు వర్చువల్ పద్ధతిలో జరిగే సదస్సులో అందజేస్తారు. అడోబ్ సంస్థ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్, మహేంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్రాలకు అవార్డు లభించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు:
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 నవంబర్ 3న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత, 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతుండగా, డెమోక్రటిక్ పార్టీ నుంచి బిడెన్ పోటీ పడుతున్నారు. 538 ఎలక్ర్టోరల్ కాలేజ్సీట్లలో 270 మెజారిటి. ఎన్నికైన అధ్యక్షుడి పదవి కాలం 2021 జనవరి 20 నుంచి ప్రారంభమవుతుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా, డెమోక్రటిక్ పార్టి తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ, కాలిఫోర్నియ సెనెటర్ కమలా హారిస్ పోటీ పడుతున్నారు.
ఇజ్రాయిల్–యూఏఈ ఒప్పందం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నేతాన్యాహు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. పాలస్తినా భూభాగాలపై ఇజ్రాయెల్ దురాక్రమణ నివారించడం లక్ష్యంగా ట్రంప్ మధ్య వర్తిత్వంతో ఆగస్ట్ 17న ఒప్పందం జరిగింది. బోర్డాన్ , ఈజిప్ట్‌ల తర్వాత ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్న మూడో అరబ్, తొలి గల్ఫ్ దేశంగా అబుదాబి నిలవనుంది.
సైనిక తిరుగుబాటు
పశ్చిమాఫ్రికా దేశంలో గత నెల రోజులుగా జరుగుతున్న ప్రజా ఆందోళనలు చివరికి రాజధాని జమాకోకు సమీపంలో కతి పట్టణంలో ఆగస్ట్ 17న సైనిక తిరుగుబాటుకు దారి తీసింది. మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బేబాకర్ కిటా గృహ నిర్భందంలో ఉన్నాడు. ఈయన 2013 సెప్టెంబర్ నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
తొలి కరోనా వ్యాక్సిన్ రిలీజ్
ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్–5’ను తయారు చేసిన దేశంగా రష్యా రికార్డ్ సృష్టించింది. ఆగస్ట్ 11న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వ్యాక్సిన్‌ను ప్రకటించారు. గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బిన్నో ఫార్మా కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. కరోనా తొలి టీకాను పుతిన్ కుమార్తెకు ఇచ్చారు.
శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు
ఆగస్ట్ 5న జరిగిన 16వ శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో మహీంద్ర రాజపక్సే నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ అలయన్స్ ఘన విజయం సాధించింది. 225 స్థానాలలో 113 మెజారిటీ కాఆ రాజప్సే కూటమి 145 స్థానాలు దక్కించుకుని అధికారం చేపట్టింది. 54 స్థానాలు పొందిన సమాగ జన బలవ్‌గా పార్టీ ప్రతిపక్ష హోదా సాధించింది. మాజీ ప్రధాని విక్రమ సింగ్ స్థాపించిన యునైటెడ్ నేషనల్ పార్టీ కేవలం ఒక స్థానం మాత్రమే లభించింది.
లెబనాన్ ప్రధాని రాజీనామా
లెబనాన్ దేశంలోని బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆ దేశ ప్రధాని హసన్ దియాబ్ ఆగస్టు 10న పదవికి రాజీనామా చేశారు. ప్రజల్లో మార్పు కోసం పోరాటం చేస్తానని సందర్భంగా ఆయన ప్రకటించారు.
మారిషస్ సుప్రీంకోర్టు భవనం ప్రారంభం
జూలై 30న పోర్టులుయీస్(మారిషస్ రాజధాని) వేదికగా వర్చువల్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడి మారిషస్ అధ్యక్షుడు ప్రవింద్ జుగ్నౌత్ తో కలిసి ప్రారంభించారు. ఈ భవనాన్ని 4700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 10 అంతస్తుల్లో నిర్మించారు. మారిషస్ లో 353 మిలియన్ డాలర్ల భారత గ్రాంటుతో 5 ప్రాజెక్టులు నిర్మించాలని 2016లో ఒక ఒప్పందం జరిగింది. సుప్రీంకోర్టు భవనం నిర్మాణం అందులో ఓ భాగం.
ఏఐఐబీ వర్చువల్ సదస్సు
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) వార్షిక సదస్సు జూలై 28న వర్చువల్ పద్ధతిలో జరిగింది. దీని ఇతివృత్తం ‘కనెక్టింగ్ ఫర్ టుమారో’ ఈ సదస్సులోనే జిన్ లిఖిన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ‘ఏఐఐబీ 2030 – సపోర్టింగ్ ఏషియాస్ డెవలప్మెంట్ఓవర్ ది నెక్స్ట్ డికేడ్’ అన్న అంశాలపై చర్చ జరిగింది. బీజింగ్ ప్రధాన కార్యాలయంగాగల ఈ సంస్థలో 103వ దేశంగా లైబీరియా చేరింది. తదుపరి సమావేశం 2021 అక్టోబర్ 27 నుంచి 28 వరకు దుబాయ్(యూఏఈ)లో జరగనుంది.
ఐవరికోస్ట్ నూతన ప్రధాని
ది రిపబ్లిక్ ఆఫ్ ఐవరికోస్ట్ నూతన ప్రధానిగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ‘హమెద్ బకాయొకొ’ ను ఆ దేశ అధ్యక్షుడు అలస్సానే ఔట్టార నియమించారు. అనారోగ్యంతో విధులకు కూడా హాజరు కాలేని స్థితిలో గత ప్రధాని అమడౌగోన్ కౌలిబలి మరణించగా.. మే నుంచి హమెద్ బకాయొకొ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈయన రోలి ఆఫ్ ది రిపబ్లికన్స్ పార్టీకి చెందిన వ్యక్తి.
పాక్ కొత్త మ్యాప్ ఆవిష్కరణ
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త మ్యాప్ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఆగస్టు 5 నాటికి ఏడాది కాగా.. అంతకంటే ఒక్కరోజు ముందు ఆగస్టు 4న పాక్ నూతన మ్యాప్ ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ కొత్త మ్యాప్‌నకు పాక్ కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్‌లనూఈ మ్యాప్‌లో చేర్చడం గమనార్హం. నియంత్రణ రేఖన కారాకోరం పాస్ దాకా పొడిగించారు. సియాచిన్ ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేశారు. పాకిస్తాన్ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు.
నిఘా నగరాల జాబితాలో హైదరాబాద్
ఇంగ్లాండ్ లోని కంపారిటెక్ సంస్థ ప్రపంచంలోని 150 నగరాలను ఎంపిక చేసి అత్యున్నత నిఘా నగరాల జాబితాను రూపొందించింది. ఇందులో ప్రతి వెయ్యి మందికి 119.7 కెమెరాలతో తైయువన్(చైనా) తొలిస్థానంలో నిలవగా 92.14 కెమెరాలతో వూక్స్(చైనా), 67.47 కెమెరాలతో లండన్(ఇంగ్లాండ్), వరస స్థానాల్లో నిలిచాయి. 29.99 కెమెరాలతో హైదరాబాద్(భారత్) 16 స్థానంలో నిలిచింది.చెన్నై 21వ స్థానం, ఢిల్లీ 33వ స్థానంలో నిలిచాయి. అత్యధిక జనాభాగల నగరాలను పరిశీస్తే టోక్యో, ఢిల్లీ, షాంగై నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
నిషాన్–ఏ–పాకిస్తాన్
1959 నుంచి పాకిస్తాన్ అందిస్తున్న అత్యున్నత పౌరపురస్కారం–2020 ఏడాదికి కశ్మీర్ వేర్పాటు వాది హరితయ్ కాన్ఫరెనస్ నాయకుడు సయ్యద్ అలిఫా గిలినా ఎంపికయ్యాడు. ఈయన పేరుమీదుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. 1990 నుంచి కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగేందుకు ఇతని పరోక్ష విధానాలే కారణం.
చైనా అంగారక యాత్ర
అంగారకగ్రహంపై పరిశోధనలు జరిపేందుకు చైనా చేపట్టిన ‘తియాన్‌విన్–1’ ప్రయోగం విజయవంతమైంది. 200కేజీల బరువుగల ఈ వ్యోమనౌకతో పాటు ల్యాండర్, రోవర్‌ను హైనాన్ ద్వీపంలోని వెంచాంగ్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. , ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత 2021 ఫిబ్రవరిలో అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని సైంటిస్టులు తెలిపారు.
ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డు
ఐఆర్‌సీటీసీ, ఎస్‌బీఐ కార్డు సంయుక్తంగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును జులై 28న విడుదల చేశాయి. దీని ద్వారా రైల్వే, వాణిజ్య, రైల్ టికెట్ బుకింగ్, ఇతర లావాదేవీల విషయంలో సెక్యూరిటీ కోసం ఈ క్రెడిట్ కార్డును రూపొందించారు. దీనిలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సి) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు.
వ్యక్తులు
నిస్సా డైరెక్టర్‌గా సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్(1991 బ్యాచ్) నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నిస్సా, హకీంపేట్) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. దీంతో పాటు సీఐఎస్‌ఎఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్టార్ ఐజీగా అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు. సీవీ ఆనంద్ గతంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, నగర ట్రాఫిక్ చీఫ్‌గా, ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌లో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఈయన ఎయిర్‌పోర్ట్ సెక్టార్ (సౌత్ వెస్ట్) డిపార్ట్‌మెంట్ ఐజీగా ఉన్నారు.
అర్చనా సొరెంగ్
పర్యావరణ మార్పులపై సూచనలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరిస్ ఏర్పాటు చేసిన ఏడుగురు ప్రతినిధులు బృందంలో ఎంపికైన భారత మహిళ అర్చనా సొరెంగ్. 2019 సెప్టెంబర్ 21న న్యూయార్క్‌లో జరిగిన యువ పర్యావరణ సదస్సు సందర్భంగా తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
షాహిల్ సేత్
2011 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన షాహిల్ సేత్ బ్రిక్స్ దేశాల చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(సీసీఐ) సలహాదారుడిగా నియమితులయ్యారు. ఇది ఆర్థికేతర, స్వచ్ఛంద, జీతభత్యాలు లేని నియామకం. 2020–30వరకు సేత్ ఈ పదవిలో కొనసాగనున్నారు.
కళానారాయణ స్వామి
భారత సంతతికి చెందిన నర్సు కళా నారాయణ స్వామి కోవిడ్ –19పై చేసిన పోరాటంలో భాగంగా సింగపూర్ ప్రెసిడెంట్ ట్రోఫీకి ఎంపికైన ఐదుగురిలో నిలిచారు. ట్రోఫీతో పాటు ఒక్కో వ్యక్తికి 10వేల సింగపూర్ డాలర్లు అందజేయనున్నారు.
గిరీశ్ చంద్ర ముర్మూ
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ, కాగ్)గా 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 2024 నవంబరు 20వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. ముర్మూ జమ్మూ కశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్‌గా ఇటీవలే రాజీనామా చేశారు.
మనోజ్ సిన్హా
జమ్ముకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈయన 1996,1999,2014లో ఘాజీపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014–19 వరకు రైల్వేశాఖ, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పనిచేశారు.
అజయ్ త్యాగి
సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలన్నీ కేంద్రం మరో 18 నెలల పాటు పొడిగించింది. సెప్టెంబర్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు పదవిలో కొనసాగనున్నారు. 2020 మార్చి 1 న అజయ్ త్యాగి పదవీకాలన్ని 6 నెలల పాటు పొడిగించిన కేంద్రం మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది.
శివాజీరావు పాటిల్
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ పాటిల్ ఆగస్ట్ 5న మరణించారు. 1931 హైదరాబాద్ సంస్థానం పరిధిలో గల మరాఠా ప్రాంతంలో జన్మించిన ఆయన 195 నుంచి 196 మార్చి 6 వరకు మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 1968లో మహారాష్ట్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌నుస్థాపించి సేవలందించారు.
ఆడపిల్లలకూ ఆస్తిలో వాటా
హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 కు ముందు తండ్రి మరణించినా కూతురికి ఆస్తిలో సమాన వాటా ఉంటుందని సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. 1956లోని సెక్షన్ 6ప్రకారం, చట్ట సవరణలతో సంబంధం లేకుండా కొడుకులతో పాటు కూతుళ్లకు హక్కులు ఉంటాయని జస్టిస్ ఆరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.నజీర్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది.
ప్యూచర్ బ్రాండ్ ఇండెక్స్
కంపెనీల పనితీరు,నిర్వహణ,లాభాలు వంటి అంశాల ఆధారంగా ఏటా టాప్–100 అత్యుత్తమ కంపెనీల జాబితాను ఎంపికచేసే ప్యూచర్ బ్రాండ్ సంస్థ –2020 ఇండెక్స్‌లో ప్రపంచంలో అపిల్ కంపెనీ మొదటిస్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సామ్‌సాంగ్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రిస్ కు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ టాప్–10లో నిలిచిన ఏకైక భారత సంస్థగా నిలవగా. టాటా కంపెనీకి 65వ స్థానం లభించింది.
అండర్ గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ సిస్టం
చెన్నై నుంచి అండమాన్ నికోబార్ దీవుల పోర్ట్‌బ్లెయిర్ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అండమాన్ నికోబార్ దీవుల్లో 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని రూ.1,224 కోట్లతో 2,312కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్‌తో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ , ఇతర ఐలాండ్‌లకు సేవలు అందనున్నాయి.
బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్
‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24 శాతం సాధించి దేశంలోనే బెస్ట్ సీఎంగా ఎంపికయ్యారు. రెండో స్థానంలో కేజ్రీవాల్‌కు 15 శాతం, మూడో స్థానంలో వైఎస్ జగన్‌కు 11 శాతం సాధించారు. 4, 5 స్థానాల్లో పశ్చిమబెంగాల్, బీహార్ సీఎంలు మమతా బెనర్జీ, నితీష్‌కుమార్ ఉండగా… తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్‌రావు మూడు శాతం ఓట్లతో 9వ స్థానంలో నిలిచారు.
తొలి కిసాన్ రైల్
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను వేగవంతంగా రవాణా చేయడానికి కేంద్రం తొలి కిసాన్ రైల్‌ను ఆగస్ట్ 7న ప్రారంభించింది. ఈ రైలు మహారాష్ట్ర లోని దేవ్‌లాలి నుంచి ప్రారంభమై బిహార్‌లోని ధన్‌పూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించింది. త్వరగా పాడైపోయే కూరగాయలు, ఇతర ఉత్పత్తులను త్వరితగతిన గమ్యానికి చేర్చేందుకు, 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 2020–21 బడ్జెట్‌లో తొలిసారిగా ఈ ప్రతిపాదన చేశారు.
రాకేశ్ అస్థానా
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) నూతన డైరెక్టర్ జనరల్ సుర్జిత్ సింగ్ దేస్వాల్ స్థానంలో కేంద్ర కేబినెట్ వ్యవహరాల కమిటీ ఆగస్ట్ 17న రాకేశ్ ఆస్థానా నియామకాన్ని ఆమోదించింది. 1984 బ్యాచ్‌కు చెందిన గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి అయినా రాకేశ్ 2021 జులై 31 వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. బీఎస్‌ఎఫ్ 1965 డిసెంబర్ 1న ఏర్పాటైంది.
పండిట్ జస్‌రాజ్
ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు, పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత పండిట్ జస్ రాజ్ (90 అమెరికా న్యూజెర్సీలో ఆగస్టు 17న మృతి చెందారు. 1930 జనవరి 28న హర్యానాలోని హిసార్ జిల్లా పిలిమండోరిలో సంగీత కుటుంబంలో పుట్టిన ఆయన మేవతి ఘరానా శైలితో 80ఏళ్ల పాటు సంగీతం అందించారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ’(1975), పద్మభూషణ్ (1990), పద్మవిభూషణ్ (2000) అవార్డులతో ఆయనను సత్కరించింది
సత్యపాల్ మాలిక్
గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ మేఘాలయ నూతన గవర్నర్‌గా ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్‌ను నియమించారు. గోవా గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
వి.ఎస్.కె.కౌముది
కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా వి.ఎస్.కె.కౌముది నియమితులయ్యారు. ఈయన నవంబర్ 30, 2022 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఏపీ కేడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన కౌముది ప్రస్తతం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
చేతన్ చౌహన్
భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ చేతన్ చౌహాన్(73) కరోనా వైరస్‌తో గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆగస్టు 16న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన చేతన్ 1969 నుంచి 1981 మధ్య కాలంలో భారత టెస్టు, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 40 టెస్టులు ఆడిన ఆయన 16 ఆఫ్ సెంచరీలు, 2,084 పరుగులు చేశారు. ఏడు వన్డేల్లో బరిలోకి దిగి 153 పరుగులు సాధించారు.
ప్రదీప్ సింగ్
సివిల్‌సర్వీసెస్–2019 ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన హరియాణ అభ్యర్థి. మొత్తం 829 మంది విజయం సాధించగా జతిన్ కిషోర్(ఢిల్లీ), ప్రతిభావర్మ(ఉత్తరప్రదేశ్) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాత్రి రెడ్డి(46), మల్లవరపు సూర్య తేజ(76) మాత్రమే టాప్ 100 ర్యాంకుల్లో నిలిచారు.
వంగపండుకన్నుమూత
ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో ఆగస్టు 4న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. విజయనగరం జిల్లా, పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లిదంపతులకు 1943 జూన్ లో వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతాలనురచించారు.
అవ్నిదోషి
భారత సంతతికి చెందిన యునైటెడ్ కింగ్డం రచయిత్రి 2020కి గాను నవంబర్‌లో ప్రకటించబోయే ‘మ్యాన్ బుకర్ ఫ్రైజ్’ కోసం 13 మందితో ఎంపిక చేసిన లాంగ్‌లిస్ట్‌లో చోటు పొందింది. బ్రర్న్ షుగర్ పుస్తక రచనకు గానూ ఆమెకు ఈ అవకాశం దక్కింది. సెప్టెంబర్ 15న 6 పుస్తకాలతో షార్ట్‌లిస్ట్ చేసి నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. షార్ట్ లిస్ట్‌కి ఎంపికైన ఒక్కో వ్యక్తికి 2500 ఫౌండ్ల ప్రైజ్‌మనీ, ఫైనల్ విజేతకు 50,000 ఫౌండ్ల ప్రైజ్ మనీ లభించనుంది.
శశిధర్ జగదీశన్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నూతన ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్ పేరును ఆర్బీఐ ఆమోదించింది. ప్రస్తుతం రూ. 5.71 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ బ్యాంకు స్థాపించినప్పటి నుంచి ఆదిత్యపురి ఎండీగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో జగదీశన్ అక్టోబర్ 27న బాధ్యతలు చేపట్టనున్నారు.
గిరిజాబాయి తివారి
మధ్య ప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బినా పట్టణానికి చెందిన 117 సంవత్సరాల మహిళ దేశంలో అత్యధిక వయస్సులో పన్ను చెల్లింపుదారుగా నిలిచింది. ఇటీవల మధ్య ప్రదేశ్ ఆదాయపన్ను శాఖ వారు 100 ఏళ్ల వయస్సు దాటి పన్ను చెల్లిస్తున్న వారిలో నలుగురిని గుర్తించి సత్కరించగా వారిలో 1903లో జన్మించిన గిరిజా ఒకరు. మిగిలిన ఇద్దరు ఇండోర్, ఒకరు చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన వ్యక్తి.
రావి కొండల్‌రావు మృతి
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, జర్నలిస్ట్ రావికొండల్‌రావు జులై 28న మరణించారు. ఈయన రాసిన ఆత్మకథ నాగావలి నుంచి మంజీర వరకు’ స్వయంవరం, కుక్కపిల్ల దొరికింది, ప్రొఫెసర్ పరబ్రహ్మం, పట్టాలు తప్పిన బండి రచనలు ప్రసిద్ధి చెందినవి , పెండ్లి పుస్తకం సినిమాకు నంది అవార్డు వచ్చింది.
ఉప్పుటూరి సాంబశివరావు
అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ధీశాలి, సామాజిక పరివర్తకుడు, దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా.(ఉప్పుటూరి సాంబశివరావు) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఉ.సా.(70) జూలై 25న హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో ఆయన జన్మించారు. ప్రజాతంత్ర విద్యార్థి సంఘం(డీఎస్.వో)లో పనిచేసిన అనంతరం యూసీసీఆర్‌ఐ (ఎంఎల్) పార్టీలో చేరి నాయకుడిగా ఎదిగారు. 1982 నుంచి 1986 వరకు నల్లగొండ జిల్లా-కరువు పోరాటంలో చురుైకై నపాత్ర పోషించిన ఆయన గిరిజన హక్కుల కోసం పోరాడారు.
ఆర్నబ్ చౌదరి
లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డు–2020కు ఆర్నబ్ చౌదరి మరణానంతరం ఎంపికయ్యారు. అర్జున్, రివారియర్ ప్రిన్స్ చిత్రాలకు యానిమేషన్స్ అందించిన ఇతను 2019 డిసెంబర్ 25న మరణించారు.
ఏపీ సీఈవోగా రమేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎన్. రమేష్ కుమార్ ను మరోసారి నియమిస్తూ.. జూలై 31న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా తీవ్రత దృష్ట్ర్యా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన విషయంలో సర్కారు ఏప్రిల్ 11న ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్‌ను నూతన ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకు రమేష్ కుమార్ మళ్లీ నియమితులయ్యారు.