Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ఎఫైర్స్​@ మే

కరెంట్​ఎఫైర్స్​@ మే

నేషనల్​

ఢిల్లీకి ఎల్​జీనే బాస్​
ఢిల్లీ ప్రభుత్వం (సవరణ) చట్టం–2021 ఏప్రిల్​ 27 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ పరిపాలన అధికారాలు అక్కడి లెప్టినెంట్​ గవర్నర్​ (ఎల్​జీ) కే వర్తిస్తాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఎల్​జీ అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.

టైమ్స్​ మ్యాగజైన్​లో జియో, జైజూస్​
ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ తొలిసారిగా రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాలో… దేశీ దిగ్గజాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియోప్లాట్‌ఫామ్స్, ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ సంస్థ బైజూస్‌ చోటు దక్కించుకున్నాయి. జాబితా రూపకల్పన కోసం హెల్త్‌కేర్, వినోదం, రవాణా, టెక్నాలజీ సహా పలు రంగాల కంపెనీలను టైమ్‌ పరిశీలించింది.

జార్జియాలో తెలుగుకు గుర్తింపు
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉగాది పండుగ తెలుగు సంస్కృతి వారసత్వ దినంగా ఉంటుందని ఆ రాష్ట్ర గవర్నర్​ అధికారికంగా ధ్రువపత్రం విడుదల చేశారు. ఈ విషయం విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి వ్యవస్థాపక సభ అధ్యక్షుడు వల్లూరి రమేష్​ తెలిపారు. దీంతో రాష్ట్రంలోని అన్ని స్కూల్స్​, కాలేజీల్లో తెలుగు నేర్చుకునే వీలుంది.

ఐడీబీఐలో వాటా అమ్మకం
ఎల్‌ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి(డిజిన్వెస్ట్‌మెంట్‌) కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీలకు సంయుక్తంగా 94 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసీ విడిగా 49.21 శాతం వాటాను కలిగి ఉంది.

మరాఠాల రిజర్వేషన్లు చెల్లవు
50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగరీత్య కుదరదని మరాఠాల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకం అంది. 1992లో ‘మండల్​’ తీర్పుకు ఇది వ్యతిరేకం అని చెప్పింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పశ్చిమ బెంగాల్​
రాష్ట్రంలో 292 స్థానాల్లో 8 దశల్లో ఎన్నికలు జరగగా తృణమూల్​ కాంగ్రెస్​ 213 చోట్ల గెలిచింది. బీజేపీ 77 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. నందిగ్రామ్​లో మమతా బెనర్జీ ఓడిపోయినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
తమిళనాడు
మొత్తం 234 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగగా మిత్రపక్షాలతో కలిసి డీఎంకే 159 స్థానాల్లో, అన్నాడీఎంకే కూటమి 75 స్థానాల్లో గెలిచింది. డీఎంకే అధినేత స్టాలిన్​ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కేరళ
కేరళలో రెండోసారి సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ కూటమి వరుసగా రెండోసారి విజయం సాధించింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో ఎల్​డీఎఫ్​ 91 సీట్లు, కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ 40 స్థానాల్లో గెలిచింది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అస్సాం
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి మరోసారి విజయం సాధించింది. 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 75 సీట్లు, కాంగ్రెస్​ కూటమి 50 స్థానాల్లో గెలుపొందాయి. రాష్ట్రంలో బీజేపీ దాని మిత్రపక్షాలు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
పుదుచ్చేరి
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి తొలిసారి ఎన్డీయే విజయం సాధించింది. ఎన్నార్​ కాంగ్రెస్​–బీజేపీ కూటమి 16 స్థానాలు దక్కించుకోగా, యూపీఏ కూటమి 8 స్థానలకు పరిమితం అయింది. 6 సీట్లు ఇండిపెండెంట్​ అభ్యర్థులు గెలుచుకున్నారు. రంగస్వామి నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

డిశ్చార్జ్‌ పిటిషన్‌ నిందితుల హక్కు
క్రిమినల్‌ కేసుల్లో తమపై నమోదైన అభియోగాలను తొలగించాలని కోరడం నిందితులు చట్టబద్ధమైన హక్కని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ డిశ్చార్జ్‌ పిటిషన్ల విచారణను ట్రయల్‌ కోర్టులు సాధారణ పోస్ట్‌ ఆఫీస్‌ తరహాలో ముగించకూడదని వ్యాఖ్యానించింది. నిందితుడిపై విచారణ కొనసాగించేందుకు సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది.

ప్రభుత్వ లావాదేవీల్లో ప్రైవేటు బ్యాంకులు
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణకు ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తూ ఆర్‌బీఐ రూల్స్​ సవరించింది. ఈ మేరకు మే 10వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకు అనుకూలంగా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇప్పుడు దీన్ని అధికారికంగా ఆర్‌బీఐ అమల్లోకి తీసుకొచ్చింది.

భారత వృద్ధి 9.3 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 9.3 శాతానికి కోత వేస్తున్నట్లు మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ ప్రకటించింది. అంతకుముందు 13.7 శాతంగా ఇదే సంస్థ అంచనా వేసింది. కరోనా సెకండ్​ వేవ్​తో ఈ నిర్ణయం తీసుకుంది.

మేఘాలయలో రాకాసిబల్లి శిలాజాలు
మేఘాలయలోని పశ్చిమ ఖాసి హిల్స్​ జిల్లాలో సుమారు 10 కోట్ల ఏళ్ల నాటి రాకాసి బల్లి ఎముక శిలాజాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఇవి సారోపాడ్​ అనే డైనోసార్​కు సంబంధించినవని భారత భూగర్భ సర్వే శాఖలోని పురాతత్వ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు.

పంచాయతీరాజ్​ సంస్థలకు గ్రాంట్స్​
కేంద్రప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 25 రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.8,923 కోట్ల గ్రాంట్​ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్​కు రూ.387.8 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు వచ్చాయి. వీటిని గ్రామ, మండల, జిల్లా పరిషత్​లకు వినియోగించాలి.

ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​ రికార్డ్​
కొవిడ్​ బాధితులకు అవసరమైన ఆక్సిజన్​ అందించడం కోసం ప్రారంభించిన ‘ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​’ అరుదైన రికార్డ్​ సృష్టించింది. ఇప్పటివరకు 10 వేల టన్నుల లిక్విడ్​ మెడికల్​ ఆక్సిజన్​ సరఫరా చేసినట్లు రైల్వే బోర్డ్​ చైర్మన్​ సునీత్​ శర్మ తెలిపారు.

భారత్​లో ‘తౌక్టే’ తుఫాన్​
భారత్​లో ఈ ఏడాది వచ్చిన మొదటి తుఫానుకు ‘తౌక్టే’ అని మయన్నార్​ పేరు పెట్టింది. బర్మీన్​ భాషలో తౌక్టే అంటే పెద్దగా శబ్దం చేసే బల్లి అని అర్థం. బంగ్లాదేశ్​, భారత్​, మాల్దీవులు, మయన్మార్​, ఒమన్​, పాకిస్థాన్​, శ్రీలంక, థాయ్​లాండ్​లు తమ దేశాలను తాకిన తుఫాన్లకు పేరు పెడుతాయి. 2020లో వచ్చిన అంఫన్​ తుఫాన్​న్​కు థాయ్​లాండ్​ పేరు సూచించింది.

మూడో స్థానంలో ఇండియా
ఈవై పునరుత్పాదక ఇంధన దేశాల ఆకర్షణీయత సూచీ (ఈవై ఆర్‌ఈసీఏ)-2021లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 2020 ఏడాది సూచీలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈవై ఆర్‌ఈసీఏఐ సూచీలో అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి.

వ్యాక్సిన్​కు రూ.75 వేల కోట్లు
కోవిడ్‌–19మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా 2021 ఏడాది వ్యాక్సిన్ల కోసం భారతదేశం అక్షరాలా రూ.75 వేల కోట్లు ఖర్చు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు అన్నీ కలిపి 2021లో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నాయి. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్‌–వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఖనిజ ఉత్పత్తిలో 5వ స్థానం
తెలంగాణ నుంచి 2019–2020 ఆర్థిక సంవత్సరంలో రూ.22,069 కోట్ల విలువైన మేజర్​, మైనర్​ ఖనిజ ఉత్పత్తి జరిగినట్లు కేంద్ర గనులశాఖ 2020–21 వార్షిక నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది రాష్ట్రంలో రూ.11,295 కోట్ల విలువైన సున్పపురాయి, మాంగనీస్​ లాంటి ఖనిజాలు, రూ.10,774 కోట్ల మైనర్​ మినరల్స్​ ఉత్పత్తి జరిగినట్లు పేర్కొంది. ఖనిజ ఉత్పత్తిలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.

పేదలకు ఆర్థికసాయం
లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు కర్నాటక ప్రభుత్వం రూ.1,250 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రైతులకు హెక్టారుకు గరిష్టంగా రూ.10వేలు, ఆటో, టాక్సి డ్రైవర్లకు రూ.3 వేలు, అసంఘటిత కార్మికులకు రూ.2వేల చొప్పున్న ఇవ్వనున్నట్లు కర్నాటక సీఎం యడియూరప్ప తెలిపారు.

తెలుగులో ఈ–కోర్ట్స్​ సర్వీస్​
కోర్టుల్లో నడుస్తున్న కేసుల గురించి తెలిపే ‘ఈ–కోర్ట్స్​ సర్వీసెస్​ మొబైల్​ యాప్​’ సేవలను సుప్రీంకోర్టు తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీంతో సాధారణ ప్రజలు, లాయర్లు, పోలీసులు, కేసుల వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు.

భారత్​లో ‘యాస్​’ తుఫాన్​
బంగాళఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్​ ‘యాస్​’ కు ఒమన్​ దేశం పేరు పెట్టింది. యాస్​ అంటే పర్షియన్​ భాషలో జాస్మిన్​ అని అర్థం. 2020 మేలో భారత్​ రెండు తుఫాన్​లను ఎదుర్కొంది. అంఫాన్​ ఒకటి దీనికి అర్థం ఆకాశం పేరు థాయ్​లాండ్​ సూచించింది. నిసర్గా పేరును బంగ్లాదేశ్​ సూచించింది దీనికి అర్థం ప్రకృతి.

ఒడిశాలో అరుదైన జాతి మొసళ్లు
ఒడిశాలోని సతకోషియా అభయారణ్యం పరిధి మహానదిలో అరుదైన ఘరియల్​ జాతికి చెందిన మొసలి పిల్లలను అధికారులు గుర్తించారు. సుమారు 30 ఏండ్ల తర్వాత అరుదైన మొసలి పిల్లలు మహానదిలో కన్పించాయి. పొడవైన ముక్కు కలిగి ఉండడం వీటి ప్రత్యేకత.

జీడీపీపై ఎస్​బీఐ నివేదిక
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘ఎకోర్యాప్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 2020-21 ఆర్థిక ఏడాది భారత జీడీపీ మైనస్ 7.3 శాతం వరకు క్షీణిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది.

ఇంటర్నేషనల్​


అమెరికాలో కొత్త రాష్ట్రం
అమెరికాలో 51వ రాష్ట్రంగా వాషింగ్టన్​ డీసీని ఏర్పాటు చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది. 216 మంది సభ్యులు అనుకూలంగా 208 మంది సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. రిపబ్లికన్లు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించారు.

థాయ్​లాండ్​ ప్రధానికి ఫైన్​
థాయ్​లాండ్​ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్​ చాన్​–వో–చా మాస్క్​ పెట్టుకోలేదని అధికారులు ఆయనకు 6 వేల భాట్​ల (సుమారు రూ.14,270) ఫైన్​ వేశారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో ప్రధాని సలహాదారులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన మాస్క్ పెట్టుకోలేదు.

రాయబారుల బహిష్కరణ
బాల్టిక్​ దేశాలైన లిథువేనియా, ఎస్తోనియా, లాత్వియాతో పాటు స్లోవేకియాకు చెందిన ఏడుగురు రాయబారులను రష్యా బహిష్కరించింది. వారం రోజుల్లో మాస్కో విడిచివెళ్లాలని ఆదేశించింది. అంతకుముందు బాల్టిక్​ దేశాలు కూడా ఏడుగురు రష్యా రాయబారులను బహిష్కరించింది.

ఇజ్రాయెల్​లో రాజకీయ సంక్షోభం
ఇజ్రాయెల్​ దేశాధ్యక్షుడు నెతన్యాహు చెప్పిన సమయంలోగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మళ్లీ విఫలం అయ్యాడు. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది. ఇజ్రాయోల్​ పార్లమెంట్​లో 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల మద్దతు కావాలి. నెతన్యాహు పార్టీ 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉంది.

నేపాల్​ ప్రధానికి షాక్​
నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి షాక్‌ తగిలింది. ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తున్న సీపీఎన్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) పార్టీ తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.దీంతో ఓలి ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోయారు. ఓలికి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనేందుకు మరో 15 మంది సభ్యుల మద్దతు కావాలి.

తాత్కాలిక రాయబారిగా స్మిత్​
అమెరికాకు చెందిన దౌత్యాధికారి డేనియల్​ స్మిత్​ను భారత్​లో తాత్కాలిక రాయబారిగా బైడెన్​ ప్రభుత్వం పంపించనుంది. ఉభయ దేశాల ప్రాధాన్యాలు ముందుకు తీసుకెళ్లడానికి ఆయనను పంపిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

బఫెట్​ వారసుడిగా గ్రెగ్​ అబెల్​
బెర్క్‌షైర్‌ హాత్‌వే కొత్త సీఈఓగా ప్రస్తుతం కంపెనీ వైస్‌ చైర్మన్ గ్రెగ్‌ అబెల్‌ భర్తీ చేస్తారని వారెన్‌ బఫెట్‌ ప్రకటించాడు. ‘ఈ రాత్రికి నాకు ఏమైనా జరగరానిది జరిగితే రేపు ఉదయమే గ్రెగ్‌ అబెల్‌..సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీనిపై మా కంపెనీ డైరెక్టర్ల మధ్య ఒప్పందం ఉంది’ అని ఆయన అన్నారు.

చైనా జనాభా@141 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో జనాభా పెరుగుదల అతితక్కువ స్థాయిలో నమోదైంది. తాజా గణాంకాల ప్రకారం చైనా జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. వచ్చే ఏడాది నుంచి తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని చైనా ప్రభుత్వం ఏడో జాతీయ జనగణన వివరాలను వెల్లడించింది.

భారత్​కు అమెరికా సాయం
కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్​కు అగ్రరాజ్యం అమెరికా దాదాపు రూ.3,667 కోట్ల భారీ సాయం అందించింది. ఆ దేశ ప్రభుత్వం, వివిధ సంస్థలు, కార్పొరేట్​ వర్గాలు అందించిన వివరాలు ఇందులో ఉన్నాయి. మే నెలాఖరుకు భారత్​కు సాయం బిలియన్​ డాలర్లకు చేరే అవకాశం ఉంది.

టాప్​లో భారత్​
2027 సంవత్సరం నాటికి భారత జనాభా చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి అంచనాలను చైనా జనసంఖ్యాశాస్త్ర నిపుణులు సమర్థించారు. ఈ శతాబ్ధం చివరకు అత్యధిక జనాభా గల దేశంగా భారత్​ అవతరిస్తుందని పేర్కొంది.

మిస్​ యూనివర్స్​ ఆండ్రియా మెజా
2020 మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా గెలిచారు. 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా విజేతగా నిలిచిన 26 ఏళ్ల మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని అలంకరించారు. నాలుగో స్థానంలో భారతీయ యువతి, మిస్‌ ఇండియా అడ్‌లైన్‌ కాస్టెలినో(22) నిలిచారు.

నేపాల్‌ ప్రధానిగా కె.పి.శర్మ ఓలి
సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు సెంటర్‌) కూటమి విఫలమయ్యింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని కూడగట్టలేకపోయింది. గడువులోగా ప్రతిపక్ష కూటమి ముందుకు రాకపోవడంతో ఓలిని మళ్లీ ప్రధానిగా నియమిస్తున్నట్లు అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రకటించారు.

కాల్పుల విరమణ ఒప్పందం
గ‌త‌ 11 రోజుల నుంచి దాడుల‌తో ద‌ద్దరిల్లిన ఇజ్రాయెల్‌, పాల‌స్తీనా దేశాల్లో తాత్కాలిక శాంతి నెల‌కొంది. ఇజ్రాయిల్‌తో పాల‌స్తీనా మిలిటెంట్ సంస్థ హ‌మాస్ మ‌ధ్య కుదిరిన కాల్పుల విమ‌ర‌ణ ఒప్పందం అమ‌లులోకి వ‌చ్చింది. దీంతో రాకెట్లు, మోర్టార్ల దాడులు ఆగిపోయాయి.ఈ దాడుల్లో సుమారు 240 మంది మ‌ర‌ణించారు.

ఆసియా నంబర్​ టూ అదానీ
అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద మరింత పెరిగింది. దాంతో ఆయన ఆసియాలో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తొలిస్థానంలో కొనసాగుతున్నారు. బ్లూంబ ర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైం ఇండెక్స్‌ ప్రకారం గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద 6,650 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.86 లక్షల కోట్లు) పెరిగింది.

నేపాల్​ పార్లమెంట్​ రద్దు
ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమవడంతో నేపాల్​ పార్లమెంట్​ను అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. రెండు విడతలుగా నవంబర్​ 12, 19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ సంక్షోభంతో పార్లమెంట్​ రద్దు చేయడం ఇది
రెండోసారి.

కొత్త కుబేరుడు బెర్నార్డ్​
ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ కంపెనీ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కొత్త కుబేరుడిగా అవతరించాడు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్​ను రెండో స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ కుటుంబ నికర ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లు.

మాలి దేశ అధ్యక్షుడు, ప్రధాని తొలగింపు
మాలి దేశ తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధానిని ఆ దేశ మిలటరీ ప్రభుత్వం ఇద్దరిని పదవుల నుంచి తొలగించింది. తమను సంప్రదించకుండా కేబినేట్​ పునర్​వ్యవస్థీకరణ నిర్ణయం తీసుకున్నందుకే తొలగించాల్సివచ్చిందని అస్మీ గొయితా నేతృత్వంలోని మిలటరీ ప్రభుత్వం తెలిపింది.

బ్రహ్మపుత్ర లోయలో చైనా హైవే
అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దులోని బ్రహ్మపుత్ర లోయంలో హైవే నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. దీంతో అరుణాచల్​ సరిహద్దులోని నింగ్చి వరకు చైనా సైన్యం తొందరగా చేరేందుకు ఈ నిర్మాణం చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత లోతైన బ్రహ్మపుత్ర లోయ గుండా హైవే వెళ్తుంది.

ఆసియన్​–అమెరికన్లకు భద్రతలకు చట్టం
కరోనాతో ఆసియా–అమెరికన్లపై పెరిగిన విద్వేశపూరిత నేరాలను అదుపు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. నేరాలను గుర్తించి, చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్​ సంతకం చేశారు.

ప్రాంతీయం


రాష్ట్రంలో రెండు కొత్త మండలాలు
తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. మహబూబ్​నగర్​లోని మహమ్మాదాబాద్​, వికారాబాద్​లోని చౌడాపూర్​లను కొత్త మండలాలుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ నోటిపికేషన్​ జారీ చేసింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 595కు చేరింది.
143 రకాలు మత్స సంపద
తెలంగాణలో 143 జాతులతో కూడిన మత్స్య సంపద ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలోని చేపల జీవవైవిధ్యంపై పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధన పత్రం ప్రముఖ జర్నల్​ ‘థ్రెటెండ్​ టాక్సా’లో ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా గోదావరి, కృష్ణా నదుల పరివాహకం, ఉపనదులలో చేపల రకాలు గుర్తించారు.
ఉచితంగా టీకాలు
రాష్ట్రంలో కరోనా టీకాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. టీకాలకు రూ.2,500 కోట్లకు పైగా ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఉచిత టీకాలపై సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​, వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం వెల్లడించారు.
మే 8
ఆదిమానవుడి ఆనవాళ్లు
జనగామ జిల్లాలోని కొన్నె గ్రామంలో ఆదిమానవుల కాలం నాటి ఆనవాళ్లు దొరికినట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ తెలిపింది. గజగిరిగుట్టలో ఆదిమానవుల కాలం రాతి గొడ్డళ్లు, మట్టిపూసలు, కుండ పెంకులు, రాతి పనిముట్లు లభించాయని బృందం సభ్యులు చెప్పారు.
మే 15
వీరగల్లులో 14వ శతాబ్దం శాసనం
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో వీరగల్లులపై 14వ శతాబ్దం నాటి తెలుగు లిపిలో శాసనం ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. గ్రామ శివారులో ఎనిమిది వీరగల్లులు ఉన్నాయి. ఆయా విగ్రహాల పక్కన తెలుగు భాషలో శాసనం ఉందని పేర్కొంది.
ఆకునూరులో జైన శిల్పం
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో క్రీ.శ 9వ శతాబ్దం నాటి జైన శిల్పం ఒకటి బటయపడింది. ఈ గ్రామ శివారులోని ‘కోటిలింగాల గడ్డ’గా పేరొందిన పాటిగడ్డ మీద 5 అడుగుల ఎత్తైన చౌముఖిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.
ఎన్పీడీసీఎల్​కు గ్రీన్​ పురస్కారం
ఇండియన్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ( ఐసీసీ), ద ఎనర్జీ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ సంయుక్తంగా ప్రకటించే ‘గ్రీన్​ ఊర్జ–2020’ పురస్కారాల్లో భాగంగా ‘గ్రిడ్​ అనుసంధాత పునరుత్పాదక విద్యుత్​’ విభాగంలో టీఎస్​ ఎన్పీడీసీఎల్​ అగ్రస్థానంలో నిలిచి గ్రీన్​ అవార్డు దక్కించుకుంది.
మే 22
టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా జనార్దన్​ రెడ్డి
టీఎస్​పీఎస్సీ రెండో చైర్మన్​గా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బూసిరెడ్డి జనార్ధన్​ రెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటు రమావత్​ ధన్​సింగ్​, కారెం రవీందర్​ రెడ్డి, లింగారెడ్డి, అరుణకుమారి, ఆనంద్​ తనోబా, చంద్రశేఖర్​ రావు, ఆర్​. సత్యనారాయరణలను సభ్యులుగా నియమిస్తూ గవర్నర్​ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఆయుష్మాన్​ భారత్​
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న అయుష్మాన్​ భారత్​ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నారు. కేంద్ర ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అవగాన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో అమలుకు అవసరమైన విధానాలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఖరారు చేసింది.
మే 29
పొడజాతి పశువుకు గుర్తింపు
తెలంగాణకే ప్రత్యేకమైన ఆమ్రాబాద్​ పొడజాతి పశువుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దీన్ని 2020లో రాష్ట్ర పశువుగా గుర్తింపు దక్కింది. జాతీయ జీవవైవిద్య మండలి ఈ జాతికున్న ప్రత్యేక లక్షణాలను గుర్తించడంతో కేంద్ర అటవీశాఖ మంత్రి జాతీయ గుర్తింపు ప్రకటించనున్నారు.
వీరగల్లు శిల్పాలు గుర్తింపు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులోని సోమరాజకుంటలో నాలుగు శిల్పాలను కొత్త తెలంగాణ చారిత్రక బృందం గుర్తించింది. ఇందులో రెండు వీరగల్లులు కాగా ఒకటి నాగలింగం, మరోకటి రాష్ట్రకూటుల కాలం కాలభైరవ శిల్పమని బృంద సభ్యులు తెలిపారు.

వార్తల్లో వ్యక్తులు

రేఖ మీనన్‌
ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా యాక్సెంచర్‌ ఇండియా సీనియర్‌ ఎండీ రేఖ మీనన్‌ నియమితులయ్యారు. ఏడాదిపాటు ఆమె కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తారు. 30 ఏండ్ల చరిత్ర కలిగిన నాస్కామ్​కు ఒక మహిళ చైర్​పర్సన్​గా ఎంపికవడం గమనార్హం.

ఎన్​వీ రమణ
48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్​వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.2022, 26 ఆగస్టు2022 వరకు ఆయన కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ కావడం విశేషం. గతంలో జస్టిస్‌ కోకా సుబ్బారావు పనిచేశారు.

వేణుగోపాల్​
1971లో భారత్‌–పాక్‌ యుద్ధంలో విశేష సేవలందించిన మహా వీరచక్ర, పరమ విశిష్ట సేవా మెడల్‌ గ్రహీత రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌(93)ను కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 27న తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వేణుగోపాల్‌ కోరిక మేరకు ఆయన పార్థివదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు.

ఉత్తమ సైంటిస్టుగా సురజిత్​దారా
ఆసియా ఉత్తమ వంద మంది సైంటిస్టుల జాబితాలో హెచ్​సీయూ ప్రొఫెసర్​ డాక్టర్​ సురజిత్​ దారా చోటు దక్కించుకున్నారు. 2016 నుంచి ఏటా ఆసియా శాస్త్రవేత్తల మ్యాగజైన్​ ఆధ్వర్యంలో ఈ సెలెక్షన్​ చేస్తున్నారు. సురజిత్​దారా ఇటీవల శాంతిస్వరూప్​ భట్నాగర్​ అవార్డు అందుకున్నారు.

సోలీ సొరాబ్జీ
మాజీ అటార్నీ జనరల్​ సోలీ జహంగీర్​ సొరాబ్జీ ముంబయిలో మరణించారు. ఆయన 1989–90, 1998–2004 మధ్య అటార్నీ జనరల్​గా పనిచేశారు. 2002లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

ఝుంపాలాహిరి
పులిట్జర్​ అవార్డ్​ గ్రహీత ఝంపాలాహిరి ఇంగ్లిష్​లో రచించిన ‘వేర్​ అబౌట్స్​’ ఏప్రిల్​ 27న విడుదల చేశారు. 2018లో ఆమె ఇటాలియన్​ భాషలో రాసిన ‘డోవ్​ మి ట్రావో’ నవల అనువాదం చేశారు.

సనా రామ్​చంద్​
పాకిస్థాన్​లోని అత్యున్నత సర్వీస్​ పాకిస్థాన్​ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీసెస్​ (పీఏఎస్​)కు తొలి మహిళా సనా రామ్​చంద్​ ఎంపికైంది. ఆమె సింధ్​ ప్రావిన్స్​లోని షికార్​పుర్​కు చెందినవారు. పీఏఎస్​ సాధించిన వారు ముందు అసిస్టెంట్​ కమిషనర్లుగా, తర్వాత జిల్లా కమిషనర్లుగా ప్రమోషన్​ పొందుతారు.

హిమంత బిశ్వ శర్మ
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ఈడీఏ) కన్వీనర్‌ అయిన హిమంత అస్సాం సీఎంగా ప్రమాణం చేశాక 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ సభ్యులు 10 మంది ఉన్నారు.

రవిశంకర్​
ఆర్​బీఐ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా ఉన్న టి.రవి శంకర్​ను నాలుగో డిప్యూటీ గవర్నర్​గా ప్రభుత్వం నియమించింది. మంత్రివర్గ నియామకాల కమిటీ ఆయన నియామకానికి పర్మిషన్​ ఇచ్చింది. పదవీ విరమణ చేసిన బీపీ కనుంగో స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వరిస్తారు.

అరుణ్​ కుమార్​ సింగ్​
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) కొత్త చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరుగా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం బీపీసీఎల్‌ డైరెక్టరుగా (మార్కెటింగ్‌ విభాగం) ఉన్నారు. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ సెలక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ) .. సింగ్‌ పేరు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది.

మనోజ్​ తివారి
మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారికి కొత్తగా ఏర్పడిన బెంగాల్‌ కేబినెట్‌లో చోటు దక్కింది. మే 10వ తేదీన‌ జరిగిన కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతను ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. తివారి శివ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు.

శకుంతల హరక్​సింగ్​ థిల్​స్టెడ్​
భారత సంతతికి చెందిన ప్రపంచ పోషకాహార శాస్త్రవేత్త శకుంతల హరక్​సింగ్​ థిల్​స్టెడ్​ కు ‘వరల్డ్​ ఫుడ్​ ఫ్రైజ్​–2021’ లభించింది. జలజీవుల పెంపకం, ఆహార వ్యవస్థల్లో.. సంపూర్ణ పోషణ విధానాలు అభివృద్ధి చేసినందుకు వరల్డ్​ ఫుడ్​ ఫ్రైజ్​ ఫౌండేషన్​ ఈ అవార్డ్​ ప్రకటించింది.

సుందర్​లాల్​ బహుగుణ
ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమనేత సుందర్​లాల్​ బహుగుణ కరోనాతో చనిపోయారు. హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేతను వ్యతిరేకిస్తూ ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు. 1970లో చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. భారత ప్రభుత్వం ఆయన చేసిన సేవలకు పద్మశ్రీ, పద్మవిభూషణ్​ పురస్కారంతో సత్కరించింది.

నీరా టాండన్‌
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సీనియర్‌ సలహాదారుగా భారతీయ–అమెరికన్ నీరా టాండన్‌ నియమితులయ్యారు. అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారుగా నీరా… యూఎస్‌ డిజిటల్‌ సర్వీసు, కేర్‌ యాక్ట్‌ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. 50 ఏళ్ల నీరా.. ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌ అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) పనిచేస్తున్నారు.

వేమూరి సుధాకర్‌
వరుసగా మూడు ఒలింపిక్స్‌లతోపాటు పలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో… ఆసియా క్రీడల్లో… కామన్వెల్త్‌ గేమ్స్‌లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌ వేమూరి సుధాకర్‌(70) కన్నుమూశారు. కరోనా వైరస్‌తో పోరాడిన సుధాకర్‌ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

రమేశ్​ పొవార్​
రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న రమేశ్‌ పొవార్‌ మరోసారి ఆ స్థానానికి ఎంపికయ్యాడు. ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే బీసీసీఐ మరో అవకాశం కల్పించింది. అప్పట్లో మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్‌ తన పదవి పోగొట్టుకోగా… టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం.

జస్టిస్ లలిత్​
నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సీనియారిటీపరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ నారీమన్‌ 2021, ఆగస్టు 12న రిటైరవుతున్నారు. దీంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్‌ లలిత్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు.

శంకర్​ బాలసుబ్రహ్మణ్యన్​
భారత సంతతికి చెందిన బ్రిటిష్​ సైంటిస్ట్​ సర్​ శంకర్​ బాలసుబ్రహ్మణ్యన్​కు టెక్​ నోబెల్​ పురస్కారం లభించింది. ‘2020 మిలీనియమ్​ టెక్నాలజీ’ పురస్కారానికి ఆయనతో పాటు డేవిడ్​ క్లెనెర్​మెన్​ ఎంపికయ్యారు. డీఎన్​ఏ జన్యుక్రమాన్ని వేగంగా, కచ్చితంగా తక్కువ ఖర్చుతో విశ్లేషించే టెక్నాలజీ అభివృద్ధి చేశారు.

అన్వీ భుటానీ
ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భార‌త సంత‌తి యువ‌తి ఎన్నిక‌య్యింది. స్టూడెంట్​ యూనియ‌న్‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఇండియ‌న్ ఆరిజ‌న్ అన్వీ భుటానీ ఘ‌న విజ‌యం సాధించింది. ఆమె ప్రస్తుతం వ‌ర్సిటీలోని మ్యాగ్డలెన్ కాలేజీలో హ్యూమ‌న్ సైన్స్‌ చ‌దువుతుంది.

సుబోధ్​ కుమార్​ జైస్వాల్​
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) డైరెక్టర్‌గా ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. సీబీఐ డైర‌క్టర్‌గా ఆయ‌న రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించ‌నున్నారు. మహారాష్ట్ర క్యాడర్‌, 1985 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన జైస్వాల్‌ ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు.

అమర్త్యసేన్​
భారత ఆర్థికవేత్త, నోబెల్​ అవార్డ్​ గ్రహీత అమర్త్యసేన్​కు స్పెయిన్​ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఆయనకు సోషల్​ సైన్సెస్​ విభాగంలో ప్రిన్సెస్​ ఆఫ్​ అస్టురియస్​ అవార్డు దక్కింది. 20 దేశాలకు చెందిన 41 మంది ప్రముఖుల జాబితాలో అమర్త్యసేన్​ను ఎంపిక చేశారు.

నరీందర్​ ద్రువ్​ బాత్రా
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అధ్యక్షుడిగా నరీందర్‌ ద్రువ్ బాత్రా మళ్లీ ఎన్నియ్యాడు. ఎఫ్‌ఐహెచ్‌ చరిత్రలో ఆసియా వ్యక్తి వరుసగా రెండో సారి అధ్యక్షుడు కావడం ఇదే మొదటిసారి. మే 22న 124 సభ్య దేశాలున్న సమాఖ్యలో ఓటింగ్‌ నిర్వహించగా బాత్రాకు 63 ఓట్లు, మార్క్‌ కౌడ్రన్‌ (బెల్జియం)కు 61 ఓట్లు వచ్చాయి.

డాక్టర్​ డి.నాగేశ్వర్​ రెడ్డి
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) వారి అత్యున్నత క్రిస్టల్‌ అవార్డు దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడిగా నాగేశ్వర్‌రెడ్డి అరుదైన ఘనత సాధించారు.

ఆశ్రిత వి.ఓలేటి
భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌గా కర్ణాటకకు చెందిన ఆశ్రిత వి. ఓలేటి రికార్డు నెలకొల్పారు. బెంగళూరులో ఇంజినీరింగ్‌ చేసి… 2014లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో చేరి స్క్వాడ్రన్‌ లీడర్‌ అయ్యింది. తర్వాత ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ టెస్ట్‌ పైలెట్‌ స్కూల్‌’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్‌ టెస్ట్‌ కోర్స్‌’ (43వ బ్యాచ్‌)లో ఉత్తీర్ణత సాధించి, భారత తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ అయింది.

సైన్స్​& టెక్నాలజీ

చైనా అంగారక రోవర్​ ‘ఝరాంగ్​’
చైనా తన తొలి అంగారక రోవర్ కు ‘ఝురాంగ్’ అని పేరు పెట్టింది. తియాన్ వెన్-1 వ్యోమనౌకలో భాగంగా 24 ఫిబ్రవరి 2021లో ఈ రోవర్ అంగారకుడి కక్ష్యలోకి చేరింది. చైనాలో అగ్ని దేవుడిని సంప్రదాయబద్ధంగా ఝురాంగ్ పిలుస్తారు. 1976లో అమెరికాకు చెందిన వైకింగ్-2 ల్యాండర్ దిగిన ఉటోపియా ప్లానిషియా ప్రాంతంలో ఝురాంగ్ దిగే అవకాశం ఉంది.
అపోలో 11 వ్యోమనౌక పైలట్​ మరణం
చంద్రుడిపై మానవుడు తొలిసారి అడుగుపెట్టిన అపూర్వ ఘట్టంలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అపోలో 11 వ్యోమనౌక ఫైలట్​ మైఖేల్​ కొలిన్స్​ క్యాన్సర్​తో మరణించారు. 1969 అమెరికా పంపిన అపోలో 11 వ్యోమనౌకకు కొలిన్స్​ పైలట్​గా ఉన్నారు.
చైనా కోర్​ మాడ్యుల్​
అంతరిక్షంలోని స్పేస్‌ స్టేషన్‌కు సంబంధించిన కోర్‌ మాడ్యూల్‌ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. స్టేషన్‌కు అవసరమైన ‘తియాన్హే మాడ్యూల్‌’ ను లాంగ్‌మార్చ్‌ 5బీవై2 రాకెట్‌ ద్వారా వెన్‌చాంగ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సైట్‌ నుంచి అంతరిక్షంలోకి పంపారు.
సేఫ్​గా ల్యాండైన స్పేస్​ఎక్స్​ క్యాప్సుల్​
స్పేస్​ఎక్స్​కు చెందిన డ్రాగన్​ క్యాప్సుల్​ 167 రోజులుగా ఇంటర్నేషనల్​ స్పేస్​ సెంటర్​లో ఉన్న నలుగురు ఆస్ట్రోనాట్స్​ను సేఫ్​గా భూమి మీదకు తీసుకొచ్చింది. ఆరున్నర గంటల పాటు ప్రయాణించి మెక్సికో గల్ఫ్​లో పనామా సిటీకి సమీపంలోని సముద్రంలో పడింది.
ఫైథాన్​–5
స్వేదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్​’ అమ్ములపొదిలో ఫైథాన్​–5 చేరింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఐదోతరం క్షిపణి ఫైథాన్​–5 దీన్ని గోవాలో విజయవంతంగా ప్రయోగించారు.
చంద్రుడిపైకి ‘చాంగే–6’
చంద్రుడిపైకి ‘చాంగే–6’ వ్యోమనౌకను 2024లో జాబిల్లి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుందని చైనా తెలిపింది. ఆ దేశం ప్రయోగించే ల్యాండర్​లో ఫ్రాన్స్​, స్వీడన్​, రష్యా, ఇటలీకి చెందిన పరిశోధన పరకరాలు ఉంటాయని ప్రకటించింది.
కొవిడ్​కు డీఆర్​డీవో ఔషధం
డీఆర్​డీవో అభివృద్ధి చేసిన 2–డియాక్సీ డి–గ్లూకోజ్​ (2డీజీ) ఔషధం వినియోగానికి డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది బాగా పనిచేస్తోందని, కృత్రిమ ఆక్సిజన్​ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్​డీవో తెలిపింది.
ఐబీఎమ్​ నానోమీటర్​ చిప్​
ప్రపంచంలోనే తొలిసారిగా 2 నానోమీటర్​ (ఎన్​ఎమ్​) నానోషీట్​ టెక్నాలజీతో చిప్​ను ఐబీఎమ్​ డెవలప్​ చేసింది. దీంతో ఇంటర్నెట్​ యాక్సెస్​ స్పీడ్​, బ్యాటరీ లైఫ్​ పెరుగుతుందని, ప్రాసెసింగ్​ సమయం బాగా తగ్గుతుందని ఐబీఎమ్​ తెలిపింది.
భూమిపైకి ‘ఒసైరిస్​ రెక్స్​’
గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించిన నాసా వ్యోమనౌక ‘ఒసైరిస్​ రెక్స్​’ భూమిపైకి తిరుగు ప్రయాణ అయింది. రెండేళ్ల తర్వాత ఇది భూమిని చేరుకోనుంది. ‘బెన్ను’ అనే గ్రహశకలానికి చేరుకోవడానికి నాసా 2‌016లో ఒసైరిస్​ రెక్స్​ ప్రయోగించింది.
ఇన్​జెన్యుటీ హెలికాప్టర్​ శబ్దం
అంగారకుడి వాతావరణంలో గాల్లోకి ఎగిరే సమయంలో ‘ఇన్​జెన్యుటీ’ హెలికాప్టర్​ చేసిన శబ్దాన్ని నాసా విడుదల చేసింది. దీని శబ్దం చిన్న స్థాయి కూని రాగంని తలపించిందని నాసా తెలిపింది.
అంగారకుడిపై చైనా రోవర్​
అంగారక గ్రహంపై చైనా రోవర్‌ ఝురొంగ్‌ విజయవంతంగా ల్యాండ్‌ కావడంతో అగ్రరాజ్యం అమెరికా సరసన చైనా చేరింది. ఇప్పటికే ఛాంగీ–5 శోధక నౌక ద్వారా చంద్రుడి నమూనాలు భూమీ మీదకు తీసుకువచ్చిన డ్రాగన్‌ దేశం.. వచ్చే ఏడాదికల్లా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుంది.
పర్సెవరన్స్​ ల్యాండింగ్​ ప్లేస్​ ‘ఆక్టేవియా ఇ బట్లర్’
నాసా పంపిన పర్సెవరన్స్‌ రోవర్‌ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ల్యాండ్‌ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సెవరన్స్‌ విధి. గతంలో మార్స్‌పై దిగిన క్యూరియాసిటి రోవర్‌ ల్యాండింగ్‌ స్థలానికి ‘రే బ్రాడ్‌బరీ’ రచయిత పేరు పెట్టారు.
అంతరిక్ష విమానప్రయోగం సక్సెస్​
సాధారణ పౌరులు కూడా అంతరిక్ష యాత్ర చేపట్టేలా అమెరికాలోని వర్జిన్​ గెలాక్టిక్​ సంస్థ చేసిన ప్రయోగం సక్సెస్​ అయింది. ‘వీఎస్​ఎస్​ యూనిటీ’ విమానం ద్వారా ఇద్దరు పైలట్లు అంతరిక్షానికి చేరుకున్నారు. టూరిస్టులకు భూ వాతావరణం అంచులకు తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అంగారకుడిపై చైనా రోవర్​ అడుగులు
అంగారకుడిపైకి చైనా పంపిన ‘ఝరాంగ్​’ రోవర్​ ల్యాండింగ్​ వేదిక నుంచి కిందకు దిగి, ఆ గ్రహం ఉపరితలాన్ని తొలిసారి తాకింది. ఆరు చక్రాలతో అంగారకుడిపై అన్వేషణ మొదలుపెట్టింది. ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్​తో కూడిన తియాన్​వెన్​–1 నౌకను చైనా 2021 జులైలో ప్రయోగించింది.
డీఆర్​డీవో డిప్కోవన్​ కిట్​
కొవిడ్​–19 యాంటీబాడీలను మాత్రమే గుర్తించే చౌక కిట్​ను డీఆర్​డీవో అభివృద్ధి చేసింది. కొవిడ్​ వైరస్​ స్పైక్​, న్యూక్లియోకాప్సిడ్​ ప్రోటీన్లను 97 శాతం కచ్చితంగా గుర్తిస్తున్నట్లు పరీక్షలో తేలింది.

స్పోర్ట్స్​

బార్సిలోనా చాంపియన్​ నాదల్​
బార్సిలోనా ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో నాదల్‌ 6–4, 6–7 (6/8), 7–5తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ స్టెఫనో సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై నెగ్గాడు. దాంతో బార్సిలోనా టైటిల్‌ను నాదల్‌ 12వసారి గెలుచుకున్నట్లయింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ (13) తర్వాత అతను ఎక్కువ సార్లు గెలిచిన టోర్నీ ఇదే.
ఆర్చరీలో గోల్డెన్​ కపుల్​
ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌లో మహిళల, పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగాల్లో భారత స్టార్‌ ఆర్చర్లు, భార్యాభర్తలైన దీపిక కుమారి, అతాను దాస్‌ గోల్డ్​ మెడల్స్​తో సత్తా చాటారు. గ్వాటెమాల సిటీలో జరిగిన మహిళల ఫైనల్‌ పోరులో దీపిక కుమారి 6–5తో మెకంజీ బ్రౌన్‌ (అమెరికా)పై నెగ్గింది. పురుషుల ఫైనల్స్​లో అతాను దాస్‌ 6–4తో డానియల్‌ క్యాస్ట్రో (స్పెయిన్‌)పై గెలుపొందాడు.
బాక్సింగ్​లో అమిత్​కు కాంస్యం
గవర్నర్స్​ కప్​ బాక్సింగ్​ టోర్నమెంట్​లో అమిత్​ ఫంగాల్​ కాంస్య పతకం సాధించాడు. రష్యాలోని సెయింట్​ పీటర్స్​బర్గ్​లో జరుగుతున్న టోర్నీలో పురుషుల 52 కేజీల విభాగం సెమీఫైనల్లో ఒలింపిక్​ చాంపియన్​ షాకోబిడిన్​ చేతిలో 0–5తో ఫంగాల్​ ఓడిపోయాడు.
మే 8
ఐఓసీ అంబాసిడర్​గా సింధు
భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధుకు గొప్ప గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ (ఐఓసీ) ‘బిలీవ్​ ఇన్​ స్పోర్ట్స్​’ ప్రచారానికి ఆమెతో పాటు కెనడా షట్లర్​ మిచెల్లె లీ అథ్లెట్​ అంబాసిడర్లుగా ఎంపిక చేసినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య ప్రకటించింది.
వన్డేల్లో మూడో స్థానం
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో టీమ్​ ఇండియా రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డేలో మాత్రం ఒక స్థానం కోల్పోయి మూడో స్థానంలో నిలిచింది. టీ20లో ఇంగ్లాడ్​ టాప్​లో ఉండగా, వన్డేలో న్యూజిలాండ్​ మొదటి స్థానంలో ఉంది.
తిసార పెరీరా రిటైర్​మెంట్​
శ్రీలంక మాజీ కెప్టెన్​ తిసార పెరీరా అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. యువ క్రికెటర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్​కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. లంక తరపున పెరీరా 6 టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20 మ్యాచ్​లు ఆడాడు.
పోర్చుగీస్​ చాంప్​ హామిల్టన్​
ఫార్ములావన్​ చాంపియన్​ లూయిస్​ హామిల్టన్​ (మెర్సిడెజ్​) పోర్చుగీస్​ గ్రాండ్​ప్రిలో విజేతగా నిలిచాడు. కెరియర్​లో 97వ గ్రాండ్​ప్రి టైటిల్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. మాక్స్​ వెర్​స్టాపన్​ (రెడ్​బుల్​) రెండో స్థానంలో నిలిచాడు.
మే 15
మాడ్రిడ్​ ఓపెన్​ విన్నర్​ జ్వెరెవ్​
జర్మనీ స్టార్​ అలెగ్జాండర్​ జ్వెరెవ్​ మాడ్రిడ్​ ఓపెన్​ చాంపియన్​గా నిలిచాడు. పురుషుల సింగిల్స్​ ఫైనల్లో జ్వెరెవ్​ 6–7 (8–10), 6–4, 6–3 తేడాతో మాట్​ బెరిటిని ఓడించాడు. కెరియర్​లో రెండో మాడ్రిడ్​ టైటిల్​ను జ్వెరెవ్​ తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళా సింగిల్స్​ టైటిల్​ను సబలెంక(బెలారస్​​) సాధించింది. ఫైనల్లో 6–0, 3–6, 6–4 తో టాప్​ సీడ్​ బార్టీని ఓడించింది.
హామిల్టన్​ వందో పోల్​ పొజిషన్​
ఫార్ములా వన్​ ట్రాక్​పై రికార్డుల వేటలో దూసుకెళ్తున్న ప్రపంచ చాంపియన్​ హామిల్టన్​ కెరీర్లో వందో పోల్​ పొజిషన్​ సాధించిన తొలి రేసర్​గా నిలిచాడు. ఇటీవల జరిగిన స్పానిష్​ గ్రాండ్​ ప్రి అర్హత రేసును అగ్రస్థానంతో ముగించాడు.
బెస్ట్​ క్రికెటర్​గా బాబర్​
పాకిస్థాన్​ స్టార్​ బాబర్​ ఆజామ్​ ఐసీసీ ఏప్రిల్​ నెల ఉత్తమ క్రికెటర్​గా ఎంపికయ్యాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్​లో రాణించడంతో బాబర్​ ఈ అవార్డు దక్కించుకున్నాడు. మహిళల క్రికెట్​లో అలీసా హీలీ (ఆస్ట్రేలియా) ఉత్తమ క్రికెటర్​గా నిలిచింది.
టోక్యో ఒలింపిక్స్‌కు రెజ్లర్‌ సీమా
భారత మహిళా రెజ్లర్‌ సీమా బిస్లా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ రెజ్లింగ్‌ టోర్నీలో 29 ఏళ్ల సీమా 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని ‘టోక్యో’ బెర్త్‌ ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో హరియాణాకు చెందిన సీమా 2–1తో అనా లుకాసియాక్‌ (పోలాండ్‌)పై గెలిచి బెర్త్​ సాధించింది.
మే 22

రోమ్​ ఓపెన్​ విన్నర్​ నాదల్​
రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్ టోర్నీలో స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ చాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ నాదల్‌ 7–5, 1–6, 6–3తో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై గెలుపొందాడు. దీంతో నాదల్‌ తన కెరీర్‌లో 88వ సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాడు. నాదల్‌కు 2,45,085 యూరోల (రూ. 2 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
టెస్టుల్లో భారత్​ నంబర్​వన్​
ఐసీసీ విడుదల చేసిన వార్షిక టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్‌తో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.120 రేటింగ్‌తో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్‌ (109 రేటింగ్‌) మూడో స్థానంలో నిలిచింది.
రష్యా స్విమ్మర్​ వరల్డ్​ రికార్డ్​
రష్యా స్విమ్మర్‌ క్లిమెంట్‌ కొలెస్నికోవ్‌ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న యూరోపియన్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో 20 ఏళ్ల కొలెస్నికోవ్‌ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో గోల్డ్​ మెడల్​ గెలిచాడు. ఫైనల్‌ రేసును కొలెస్నికోవ్‌ 23.80 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్​ రికార్డ్​ బ్రేక్​ చేశాడు.
హైజంప్​లో గోల్డ్​మెడల్​
బిగ్‌–12 అవుట్‌డోర్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ పురుషుల హైజంప్‌ ఈవెంట్‌లో గోల్డ్​ మెడల్​ సాధించాడు. అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో 22 ఏళ్ల తేజస్విన్‌… కేన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ 2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు.
హనన్​కు మూడో స్థానం
ప్రపంచ అథ్లెటిక్స్​ సమాఖ్య ప్రకటించిన అండర్​–18 అబ్బాయిల 110 మీటర్ల హార్డిల్స్​లో అథ్లెట్​ మహమ్మద్​ హనన్​ (17) మూడో స్థానంలో నిలిచాడు. కాలికట్​లో జరిగిన సౌత్​జోన్​ జూనియర్​ అథ్లెటిక్స్​ చాంపియన్​షిప్​ అండర్​–18 బాలుర 110మీ. హార్డిల్స్​లో 13.80 సెకండ్లతో స్వర్ణ పతకం సాధించాడు.
బెల్​గ్రేడ్​లో ప్రపంచ బాక్సింగ్​
పురుషుల బాక్సింగ్​ ప్రపంచ చాంపియన్​షిప్​ను అక్టోబర్​ నుంచి నవంబర్​ 6 వరకు బెల్​గ్రేడ్​ (సెర్బియా)లో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్​ సంఘం (ఏఐబీఏ) ప్రకటించింది. అనుకున్న షెడ్యూల్​ ప్రకారం భారత్​లో జరగాల్సి ఉండగా అతిథ్యమివ్వడానికి ఫీజుల చెల్లించకపోవడంతో టోర్నీ సెర్బియాకు తరలించింది.
మే 29
మొనాకో చాంపియన్​ వెర్​స్టాపెన్​
మొనాకో గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ డ్రైవర్ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. గంటా 38 నిమిషాల 56.820సెకన్లలో రేస్​ ముగించి చాంపియన్​గా అవతరించాడు. సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం. కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు.
మికెల్​సన్​ వరల్డ్​ రికార్డ్​
50 ఏండ్ల వయసులో ఫిల్​ మికెల్​సన్​ యూఎస్​ పీజీఏ గోల్ఫ్​ చాంపియన్​షిప్​ విజేతగా నిలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డ్​ సృష్టించాడు. జూలియస్​ బోరెస్​ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. జూలియస్​ 48 ఏళ్ల వయసులో ఈ టైటిల్​ నెగ్గాడు.
రెండేళ్లకోసారి ప్రపంచకప్​
ఫుల్​బాల్​ ప్రపంచకప్​ టోర్నీని రెండేళ్లకోసారి నిర్వహించేందుకు చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా మెజారిటీ దేశాలు ఓటేశాయి. 2021 మార్చిలో అర్సెనల్​ మేనేజర్​, ప్రస్తుత ఫిఫా డెవెలప్​మెంట్​ డైరెక్టర్​ వెంగర్​ కూడా ఈ ప్రతిపాదన చేశాడు. 1999లో ఈ చర్చ జరగ్గా ఎక్కువ దేశాలు వ్యతిరేకించాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!