నేషనల్
డిజిటల్ బడ్జెట్
ఆత్మనిర్భర్ పేరుతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.34,83,236 కోట్లతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో డిజిటల్ పద్ధతిలో ప్రవేశపెట్టారు. ఆరోగ్యం, యోగక్షేమాలకు రూ.2.23 లక్షల కోట్లు కేటాయించింది. కరోనా వ్యాక్సిన్‌కు రూ.35,000 కోట్లు ఖర్చు చేయనుంది. రైల్వేకు రూ. 1,10,055 కోట్లు కేటాయించారు.
తల్లిపాల బ్యాంక్
కేరళలో తొలి తల్లి పాల బ్యాంక్‌ను కోచి గ్లోబల్ రోటరీ క్లబ్ సహకారంతో రూ.35 లక్షల వ్యయంతో ఎర్నాకుళం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ దీన్ని ఫిబ్రవరి 5న ప్రారంభించారు. తల్లుల వద్ద తగినన్ని పాలు లేకపోవడం, వారికి అనారోగ్యం లేదా మరణించడం లాంటి కారణాల వల్ల పాలు అందని నవజాత శిశువుల ఆకలి తీర్చేందుకు దీన్ని నెలకొల్పారు.
సిజేరియన్లలో టాప్
దేశంలో జరుగుతున్న కాన్పుల్లో అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో 82.7 శాతం, జమ్ముకశ్మీర్‌లో 82.1 శాతం, తెలంగాణలో 81.5 శాతం అత్యధిక సిజేరియన్ కాన్పులు నమోదైనట్లు పేర్కొన్నారు.
విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ
విశాఖపట్నం స్టీలు ప్లాంటును 100 శాతం ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ (డీఐపీఏఎం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. ఈ సంస్థపై యాజమాన్య హక్కులను వదులుకొని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020 పేరిట ఆవిష్కరణల్లో రాష్ట్రాల ర్యాంకులను నీతి అయోగ్ విడుదల చేసింది. మానవ వనరులకు సంబంధించి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలు వెనకబడ్డాయి. దేశంలో 17 పెద్ద రాష్ట్రాలుండగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ల్యాబులున్న బడుల్లో బిహార్ చివరి ర్యాంకులో నిలవగా, 14.05 స్కోర్‌తో తెలంగాణ 16వ స్థానంలో, ఏపీ15వ స్థానంలో నిలిచాయి.
చౌరీచౌరా శతాబ్ది ఉత్సవాలు
స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా 1922లో జరిగిన ‘చౌరీ చౌరా’ సంఘటన శతాబ్ది ఉత్సవాలను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల చేశారు. నిరసనకారులు పోలీస్ స్టేషన్ తగలబెట్టడంతో అనేక మంది పోలీసులు మరణించారు. ఈ ఘటన తర్వాతే మహాత్మ గాంధీ సహాయనిరాకరణ ఉద్యమం నిలిపివేశారు.
మిస్ ఇండియా వరల్డ్‌గా మానస
ఫిబ్రవరి 10న ముంబయిలో జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస విజేతగా నిలిచింది. హర్యాణ యువతి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు.
ఉత్తరాఖండ్‌లో వరదలు
ఉత్తరాఖండ్‌లో ఆకస్మికంగా జలవిలయం సంభవించింది. ఈ ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమఠ్ సమీపంలో నందాదేవి హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయి. అలకనంద, ధౌలీగంగ, రుషి గంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ విపత్తు జరిగింది.
వృద్ధులకు మధ్యాహ్న భోజనం
దేశంలో నిరుపేద వృద్ధులకు రోజూ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం ‘వృద్ధులకు పోషణ్ అభియాన్’ పేరుతో పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకంలో కన్నబిడ్డల ఆదరణకు నోచుకోని, అనాథ వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వృద్ధాశ్రమాలు అందుబాటులో లేని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దాన్ని అమలు చేయనున్నారు.
క్రిప్టో కరెన్సీపై నిషేధం
ప్రభుత్వం జారీ చేసిన వర్చువల్ కరెన్సీలు మినహా అన్ని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని ఉన్నతస్ధాయి మంత్రుల కమిటీ సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలను నేరుగా ఆర్‌బీఐ, సెబీలు నియంత్రించలేని పరిస్థితి నెలకొందని, ప్రస్తుత చట్టాలు ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు.
బయటపడ్డ జైన మందిరం
హొయసళ రాజధాని నగరమైన కర్ణాటకలోని హళేబీడు- బేగూరు చారిత్రక కేంద్రాలకు సమీపంలో చేపట్టిన తవ్వకాల్లో ఓ జైన మందిరం బయటపడింది. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన హొయసళ రాజుల కాలం నాటిదిగా భావిస్తున్నారు. హళేబీడు ప్రాంతంలో ఒకప్పుడు జైన మతం బలంగా ఉందనేందుకు అనేక ఆనవాళ్లున్నాయి. హాసన జిల్లాలోని శాంతినాథ బసది సమీపంలో ఈ తవ్వకాల్ని చేపట్టారు.
రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఖర్గే
రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌నాయకుడు మల్లికార్జున ఖర్గే నియమితులయ్యారు. ప్రస్తుత రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్‌పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగిసింది. ఈ క్రమంలో ఖర్గేను విపక్ష నేతగా ఆమోదించాలంటూ రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడికి కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిపాదన పంపారు. ఇందుకు ఆయన ఆమోదం తెలిపారు.
రోడ్డు ప్రమాదాలపై నివేదిక
ప్రపంచంలో ఒక శాతం వాటా వాహనాలు కలిగినా, రోడ్డు ప్రమాద బాధితుల్లో మాత్రం పది శాతం వాటా ఉందని ‘రహదారి ప్రమాద గాయాలు, వైకల్యాలు- భారత సమాజంపై భారం’ పేరుతో ప్రపంచ బ్యాంక్‌విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ద సేవ్‌లైఫ్‌ఫౌండేషన్‌భాగస్వామ్యంతో రూపొందించిన నివేదికను ప్రపంచ బ్యాంక్‌దక్షిణాసియా విభాగం ఉపాధ్యక్షుడు హాట్వింగ్‌స్కాఫర్‌వెల్లడించారు.
లోక్‌సభలో కశ్మీర్ బిల్లు
జమ్ము-కశ్మీర్‌పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370వ అధికరణాన్ని 2019 ఆగస్టులో రద్దు చేశారు. వైకాపా, జేడీ(యు) సభ్యులు ఈ బిల్లును సమర్థించారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు వ్యతిరేకించారు.
జువెనైల్‌చట్టానికి సవరణలు
జువెనైల్‌జస్టిస్‌యాక్ట్‌కి కేంద్ర కేబినెట్‌పలు సవరణలు ప్రతిపాదించింది. చిన్నారుల సంరక్షణకు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ చట్టం అమలు బాధ్యతలు నిర్వర్తించే సంస్థల పనితీరు, పర్యవేక్షణాధికారాలను ఇకపై జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్)/ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
భారత్–మాల్దీవుల మధ్య అగ్రిమెంట్
ప్రసార సమాచార, మత్స్య పరిశ్రమ, అర్బన్ డెవలప్మెంట్, రోడ్లు, మౌలిక వసతులు, గృహ నిర్మాణం తదితర అంశాలపై కలిసి పనిచేసేందుకు భారత్–మాల్దీవులు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ద్వైపాక్షకి సంబంధాలపై మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌తో చర్చించి, ఆ దేశంలో క్రీడా వసతుల అభివృద్ధకి 40 మిలియన్ డాలర్ల రుణ సాయం అందించారు.
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామా చేయడంతో పుదుచ్చేరిలో ఏడోసారి రాష్ట్రపతి పాలన విధించారు. నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి విశ్వాస పరీక్షలో విఫలమవడంతో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పాలనకు సిఫార్స్ చేయడంతో కేంద్ర కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
గుజరాత్లో అతిపెద్ద జూ
గ్రీన్స్ జులాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ పేరుతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. దీన్ని 250 ఎకరాల్లో నిర్మించనుండగా, ఇందులో కొమొడో డ్రాగన్లు, చిరుతలు, ఆఫ్రికన్ ఏనుగులు, జిరాఫీలు కనువిందు చేయనున్నాయి. 2023 వరకు సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమళ్ నత్వాని అన్నారు.
సైన్యానికి సొంత మెసేజింగ్ యాప్
భారత సైన్యం ఏప్రిల్ 1 నుంచి వాట్సప్ తరహా సొంత యాప్ ఉపయోగిస్తుందని సైన్యాధిపతి జనరల్ ముకుంద్ నరవణే తెలిపారు. సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ (సాయి) పేరుతో సురక్షితమైన ‘ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’ తో ఈ యాప్ రూపొందించారు. వాయిస్, టెక్ట్స్, వీడీయో కాలింగ్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
మతమార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం
అక్రమ మతమార్పిడిలు అడ్డుకోవడమే లక్ష్యంగా రూపొందించిన బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చట్టవ్యతిరేక మతమార్పిడి నిషేధ బిల్లు–2021ను మూజువాణి ఓటుతో ఆమోదించారు. రూల్స్ అతిక్రమిస్తే జైలు శిక్ష, గరిష్టంగా రూ.50వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇంటర్నేషనల్
పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇరాన్ సైన్యంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్స్ దళం (ఐఆర్‌జీసీ) ఈ దాడి చేపట్టింది. రెండున్నరేళ్లుగా బలూచిస్థాన్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ సైనికులిద్దరిని విడిపించుకెళ్లింది. నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది.
మయన్మార్‌లో ఎమర్జెన్సీ
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మయన్మార్‌లో ఆ దేశ సైన్యం ఏడాది పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ) కీలక నేత ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మింట్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరినీ సైన్యం నిర్బంధించింది. సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్ ఇక నుంచి సర్వాధికారాలు చెలాయిస్తారు.
ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ‘ఆత్మనిర్భరత’
2020లో ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన లాంగ్వేజెస్ విభాగం ‘ఆత్మనిర్భరత’ను సెలెక్ట్ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని భారతీయులు సాధించిన విజయాలను ‘ఆత్మనిర్భరత’ ( స్వావలంబన) పదం ప్రతిబింబిస్తుందని, ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది.
ప్రూట్స్ అండ్ వెజిటెబుల్ ఇయర్
ఐక్యరాజ్యసమితి 2021 ఏడాదిని ‘అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం’గా ప్రకటిస్తూ తీర్మానం చేసింది. తాజా పండ్లు, కూరగాయలు తింటే కలిగే ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైన, వైవిధ్యమైన ఆహారానికి మూలస్తంభాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు.
మెర్సీ కిల్లింగ్ బిల్లుకు ఆమోదం
మెర్సీ కిల్లింగ్( చనిపోయేందుకు అనుమతి) కు చట్టపరమైన గుర్తింపు ఇచ్చే బిల్లును పోర్చుగల్ పార్లమెంట్ ఆమోదించింది. మెర్సీ కిల్లింగ్ కోరుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఏదైనా ప్రాణాంతక వ్యాధి ఉండి నయం చేయలేని పరిస్థితుల్లో ఉండాలి. పూర్తిగా స్పృహలో ఉన్నవారికే వైద్యుల సలహా మేరకు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇస్తారు.
‘కశ్మీర్’ తీర్మానం
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలంటూ తీర్మానం చేయగా.. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ మరో 12 మంది కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
లష్కరే ముస్తఫా అధినేత అరెస్టు
అనంత్‌నాగ్, జమ్మూ పోలీసులు సంయుక్తంగా నిర్వహించి ఆపరేషన్‌లో శోపియా జిల్లాకు చెందిన ‘ఎ’ కేటగిరీ ఉగ్రవాది హిదయతుల్లా మాలిక్ అలియాస్ హస్నెయిన్‌ను అరెస్టు చేశారు. గతేడాది శక్తిమంతమైన కారు బాంబు పేలుడుకు ప్రణాళిక రచించిన పది మంది నిందితుల్లో మాలిక్ ఒకరు.
భారత్-యూఏఈ మధ్య టన్నెల్
ముంబయి – ఫూజైరాహ్ మధ్య ఆల్ట్రా ఫ్యూచరిస్టిక్ అండర్ వాటర్ రైల్ టన్నెల్ నిర్మాణానికి గల అవకాశాలను యూఏఈ జాతీయ సలహా బ్యూరో (ఎన్‌ఏబీ) అన్వేషిస్తుంది. ముంబయి-ఫూజైరాహ్ మధ్య ఉన్న 2,000 కిలోమీటర్ల దూరాన్ని అండర్ వాటర్ రైల్ టన్నెల్ నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందని అబుదాబిలో జరిగిన యూఏఈ-భారత్ సదస్సులో ఎన్‌ఏబీ డైరెక్టర్ అబ్దుల్లా అల్షేహి చెప్పారు.
ఫ్యూయల్ యూసేజ్ ఇండియాలో అధికం
భారత్‌లో ఇంధన వినియోగం భారీగా పెరుగుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. ఫిబ్రవరి 9న ‘‘ఐఈఏ ఇండియా ఎనర్జీ అవుట్‌లుక్-2021’’ నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్న యూరోపియన్ యూనియన్ (ఈయూ)ను అధిగమిస్తుందని, రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుతుందని విశ్లేషించింది.
బీబీసీపై చైనా నిషేధం
బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారాలను నిషేధించినట్లు చైనా ప్రభుత్వం ఫిబ్రవరి 11న ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ దేశం గురించి బీబీసీ ప్రసారం చేస్తున్న వార్తలు మీడియా నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని ఇందులో పేర్కొంది. వీగర్ ముస్లింలు, కరోనా వైరస్ విషయంలో బీబీసీ ప్రసారం చేస్తున్న వార్తలను చైనా ప్రభుత్వం తప్పుబట్టింది. ఈ క్రమంలోనే చైనా స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ బీబీసీపై నిషేధం విధించింది.
డబ్ల్యూటీవో సారథిగా ఐవియాలా
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నూతన డైరెక్టర్‌జనరల్‌గా నైజీరియాకు చెందిన గొజి ఒకాంజో ఐవియాలా (66) నియమితులయ్యారు. ఒక మహిళ, ఆఫ్రికా వాసి ఈ పదవిని పొందడం ఇదే తొలిసారి. కూటమిలోని 164 దేశాల ప్రతినిధులు ఆమె నియామకాన్ని ఖరారు చేశారు. నైజీరియా ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా ఐవియాలా సేవలందించారు.
జీ-7 దేశాధినేతల సదస్సు
ఫిబ్రవరి 19న జీ-7 దేశాధినేతల వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించాడు. ప్రస్తుతం బ్రిటన్ జీ-7 అధ్యక్ష హోదాలో ఉంది. కరోనా వైరస్ టీకాను ప్రపంచ దేశాల మధ్య సమానంగా పంపిణీ చేయడం, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనే విషయమై తీసుకోవాల్సిన చర్యలపై నేతల మధ్య చర్చ జరిగింది.
వీగిన అభిశంసన తీర్మానం
కేపిటల్బిల్డింగ్పై దాడి చేసేలా తన మద్దతుదారులను ప్రోత్సహించినందుకుగాను ట్రంప్ మీద ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఓటింగ్‌లో ట్రంప్‌నకు అనుకూలంగా 57, ప్రతికూలంగా 43 ఓట్లు వచ్చాయి. దీంతో 10 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది. ప్రతినిధుల సభలో రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్‌నిలిచాడు.
పారిస్ ఒప్పందంలోకి అమెరికా
పారిస్ వాతావరణ ఒప్పందంలోకి అమెరికా మళ్లీ చేరింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైదొలగగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన రోజే పారిస్ ఒప్పందంలో మళ్లీ అమెరికా చేరుతుందని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశాడు. 2015 లో భూతాపాన్ని తగ్గించే లక్ష్యంతో ఒకేతాటిపైకి వచ్చిన ప్రపంచ దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘తల్లి భాష–తెలుగు మన శ్వాస’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ఏ రాష్ట్రంలో అయినా స్థానిక భాషలోనే ప్రాథమిక విద్య ఉండాలని అన్నారు. 2021 సంవత్సరాన్ని ‘ విద్య మరియు సమాజంలో బహుభాషావాదాన్ని పెంపొందించడం’ ఇతివృత్తంగా యునెస్కో ప్రకటించింది.
బ్రిక్స్ సదస్సుకు చైనా మద్దతు
బ్రిక్స్–2021 సదస్సు భారత్‌లో నిర్వహించేందుకు చైనా మద్దతు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఐదు సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని చైనా తెలిపింది.
మారిషస్‌కు రూ.700 కోట్ల రుణం
మారిషస్‌కు రూ.700 కోట్ల సులభతర రుణాన్ని భారత్ అందించింది. ఎప్పుడైనా వాడుకునేందుకు వీలుగా లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో మంజూరు చేసింది. ఈ నిధులతో భారత్‌లో తయారైన రక్షణ రంగ సామగ్రిని కొనుగోలు చేయాలి. మారిషస్ ప్రధాని జగన్నాథ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మధ్య చర్చల అనంతరం సంతకాలు చేశారు.
ప్రాంతీయం
‘కొవిడ్ ఉమెన్ వారియర్’గా మారుతమ్మ
సూర్యాపేట మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలు మెరుగు మారుతమ్మను పారిశుద్ధ్య విభాగంలో ‘కొవిడ్ ఉమెన్ వారియర్స్- ద రియల్ హీరోస్’ అవార్డుకు జాతీయ మహిళా కమిషన్ ఎంపిక చేసింది. కొవిడ్ సమయంలో అందించిన ఉత్తమ సేవలకుగాను తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికైనట్లు మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ సమాచారం ఇచ్చారు.
తెలంగాణకు ఐదో ర్యాంకు
సమీకృత అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనలో తెలంగాణ పనితీరు బాగుందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2019లో ఎస్‌డీజీ ర్యాంకుల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందని పేర్కొంది. రాష్ట్రంలో వెనుకబడిన 20 శాతం మండలాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. 2015-19 మధ్యకాలంలో తెలంగాణ మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగిందని వివరించింది.
జొన్నలగడ్డకు పురస్కారం
గుంటూరు జిల్లాకు చెందిన జొన్నలగడ్డ సుధాకర్‌కు ప్రవాసీ భారత్ సమ్మాన్ పురస్కారం లభించింది. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు అందుకున్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్)కు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనశాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకున్న 50 శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.
రవీంద్రభారతికి అంతర్జాతీయ గుర్తింపు
అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నందుకుగాను రవీంద్ర భారతికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో సాంస్కృతిక వికాసానికి సేవలు అందిస్తోన్న ఈ కళావేదికకు ‘ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) 2001-2015’ గుర్తింపు లభించింది. మే 11న రవీంద్రభారతికి 60 వసంతాలు పూర్తవుతాయి.
ఐడీపీఎల్ మూసివేత
ఔషధ విభాగంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్), రాజస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌ను మూసివేయాలని, వాటిల్లోని సిబ్బంది అందరికీ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ లోక్‌సభకు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ మేయర్, ఉపమేయర్ల ఎన్నిక
జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఉప మేయర్‌గా తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. మేయర్ పదవి కోసం భాజపా తరఫున ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించగా.. ఎంఐఎం మద్దతుతో మేయర్, ఉప మేయర్ పదవులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
వాయు కాలుష్యంలో టాప్‌లో మహబూబ్‌నగర్
రాష్ట్రంలో వాయు కాలుష్యం ఎక్కువగా మహబూబ్‌నగర్‌జిల్లాలో నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) 2020 గణాంకాలు వెల్లడించాయి. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 102 ఎంజీలు, ఆ తర్వాత కరీంనగర్‌లో 100 ఎంజీలుగా వాయుకాలుష్యం నమోదైంది. నల్గొండలో మాత్రమే నిర్దేశిత పరిమితుల కంటే 7 ఎంజీలు తక్కువగా నమోదైంది.
కాకతీయుల కాలం రాతి క్వారీ
కాకతీయులు13వ శతాబ్దంలో నిర్మించడానికి వాడిన రాతి క్వారీని పరిశోధకులు గుర్తించారు. రామప్ప దేవాలయం, ఘనపురం కోటగుళ్లు, రామానుజపురం పంచకూటాలయాల నిర్మాణానికి ఈ రాతినే ఉపయోగించారని ఓ ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లా రామానుజవరం, వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి గ్రామాల మధ్యలో చెంచుకాలనీ సమీపంలోని ఈ క్వారీని (గుట్ట) గుర్తించారు.
వండర్‌బుక్‌ఆఫ్‌రికార్డులో మురళీకార్తీక్
మహబూబ్‌నగర్‌కు చెందిన మురళీకార్తీక్‌రెడ్డి వండర్‌బుక్‌ఆఫ్‌వరల్డ్‌రికార్డు సాధించాడు. రసాయన శాస్త్రంలోని పీరియాడిక్ టేబుల్‌ను 81 సెకన్లలో బోర్డుపై రాసి, గతంలో 117 సెకన్లలో ఉన్న రికార్డును అధిగమించాడు. వండర్‌బుక్‌ఆఫ్‌రికార్డు రాష్ట్ర కోఆర్డినేటర్‌డాక్టర్‌స్వర్ణశ్రీ విద్యార్థికి రికార్డుకు సంబంధించి సర్టిఫికెట్, మెడల్‌ను అందజేశారు.
టీ-పోల్‌కు అవార్డ్
రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన టీ-పోల్‌యాప్‘కంప్యూటర్‌సొసైటీ ఆఫ్‌ఇండియా(సీఎస్‌ఐ), స్పెషల్‌ఇంట్రెస్ట్‌గ్రూప్(ఎస్‌ఐసీ) ఆన్‌ఈ-గవర్నెన్స్‌అవార్డు-2020’కు ఎంపికైంది. లఖ్‌నవూలో రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్‌డైరెక్టర్(జేడీ) విష్ణుప్రసాద్‌ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గత మున్సిపాలిటీల ఎన్నికల సమయంలో ఈ యాప్‌తీసుకొచ్చింది.
జాతీయ ఉత్తమ రైతుగా మల్లికార్జున్
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి జాతీయ ఉత్తమ రైతు అవార్డు లభించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ దేశవ్యాప్తంగా 2021 సంవత్సరానికి 35 మంది ఉత్తమ రైతులను ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్లికార్జున్‌కు చోటు దక్కింది. తనకున్న 17 ఎకరాల్లో సమీకృత విధానంలో ఈ దంపతులు వ్యవసాయం చేస్తున్నారు.
భారత్ బయోటెక్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డ్
భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు జినోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారం ( ఎక్స్‌లెన్స్ అవార్డ్)ను మంత్రి కేటీఆర్ అందజేశారు. జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించిన వారికి బయో ఆసియా సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఈ అవార్డ్ అందించింది. కరోనా కొవాగ్జిన్ టీకాతో పాటు రేబిస్, పోలియో, టైపాయిడ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సరఫరా చేసింది.
వరిసాగులో తెలంగాణ టాప్
ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్ వరి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం సంపాదించింది. సుమారు అరకోటి ఎకరాల్లో నాట్లు వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. తెలంగాణ తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రైతులు సాగు చేస్తున్నారు.
టార్గెట్ 19.91 కోట్ల మొక్కలు
హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం 19.91 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన మొక్కలు పెంచే నర్సరీల సంఖ్య 14,924కు చేరింది. వచ్చే సీజన్లో నిర్వహించే ఏడో విడత హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు.
వార్తల్లో వ్యక్తులు
భవ్యాలాల్
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఇండో అమెరికన్ భవ్యా లాల్ నియమితులయ్యారు. ఇంజినీరింగ్, స్పేస్ టెక్నాలజీలో అనుభవం కలిగిన భవ్య 2005 నుంచి 2020 వరకూ శాస్త్ర సాంకేతిక రంగాల విధాన సంస్థ (ఎస్‌టీపీఐ)లో సభ్యురాలిగా సేవలందించారని నాసా పేర్కొంది.
ప్రవీణ్ తైలం
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై)’ గ్లోబల్ ఛైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ తైలం ఎన్నికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ గౌరవం దక్కించుకున్న మొదటి తెలుగు వ్యక్తిగా ప్రవీణ్ రికార్డు సృష్టించారు. 15వేలకు పైగా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ఆండీ జాస్సీ
అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి జెఫ్ బెజోస్ (57) తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన అనంతరం క్లౌడ్ కంప్యూటింగ్ చీఫ్ ఆండీ జాస్సీని సీఈవోగా ప్రకటించారు. బెజోస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో కొనసాగుతారు. జాస్సీ ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.
ప్రవీణ్ సిన్హా
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్‌గా 1988 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీబీఐలోనే అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ప్రస్తుత డైరెక్టర్ రుషి కుమార్ శుక్లా రెండేళ్ల సర్వీసును పూర్తిచేసుకుని పదవీ విరమణ చేశారు.
అజయ్ సింగ్
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా అజయ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) నిర్వహించిన ఎన్నికల్లో ప్రత్యర్థి అశిష్ షెలార్‌పై అజయ్‌సింగ్ 37-27 తేడాతో గెలుపొందారు. హేమంత్ కుమార్ కొత్త కార్యదర్శిగా ఎంపికయ్యాడు.
విశ్వనాథ్
కంబళ పరుగులో బైందూరు విశ్వనాథ్ (30) పాత రికార్డులు తిరగరాశారు. కర్ణాటకలోని మంగళూరు సమీపం ముల్కి వద్ద నిర్వహించిన ఐకళ కాంతాబారె బూదాబారె కంబళలో ఆయన దున్నపోతుల వెంట వంద మీటర్ల దూరాన్ని 9.15 సెకెన్లలో చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంతకుముందు శ్రీనివాసగౌడ 9.55 సెకన్ల పేరుతో రికార్డుగా ఉండేది.
సాస్మితా లెంకా
ఒడిశాకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ సాస్మితా లెంకాకు ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా అందజేసే ‘ఆసియా ఎన్విరాన్మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్’ అవార్డు దక్కింది. భారత్ నుంచి ఎంపికైన తొలి అధికారిగా ఆమె ఘనత సాధించింది. పంగోలిన్ జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేసిన కృషికి గాను ‘జెండర్ లీడర్‌షిప్ అండ్ ఇంపాక్ట్’ కేటగిరీలో ఆమె ఎంపికయ్యారు.
రవిశంకర్
భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌కు అమెరికాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం నుంచి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ మత సామరస్య సారథిగా రవిశంకర్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ‘ది నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పిరిచ్యువాలిటీ, డైలాగ్ అండ్ సర్వీస్’ సంస్థ ఆయనకు ప్రపంచ పౌరసత్వ రాయబారి (గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్) హోదా అందించింది.
అక్తర్ అలీ
భారత టెన్నిస్ దిగ్గజం అక్తర్(81) మరణించారు. అక్తర్ అలీ 1958 నుంచి 1964 వరకు ఎనిమిది డేవిస్ కప్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1996 నుంచి 1993 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు. మలేసియా, బెల్జియం జట్లకు కూడా ఆయన కోచింగ్ ఇచ్చారు.
ఎంఎన్‌ఎం అధ్యక్షుడిగా కమల్‌హాసన్
మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా కమల్‌హాసన్ వ్యవహరిస్తారని ఆ పార్టీ సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 11న తీర్మానించింది. నటుడు కమల్‌హాసన్ ప్రారంభించిన ఎంఎన్‌ఎం పార్టీ తొలి సర్వసభ్య సమావేశం చెన్నైలో జరిగింది. పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కమల్‌హాసన్‌కు అప్పగిస్తూ మరో తీర్మానం కూడా చేసింది.
రష్మీ సమంత్
ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్‌యూనియన్‌అధ్యక్షురాలిగా గెలుపొందింది. భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో మొత్తం 3,708 ఓట్లు పోలవ్వగా, రష్మీకే 1,966 ఓట్లు వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్‌వర్సిటీకి అనుబంధంగా ఉన్న లినకా కాలేజ్‌లో ప్రస్తుతం ఆమె ఎనర్జీ సిస్టమ్స్‌లో పీజీ చదువుతోంది.
చింతల వెంకట్‌రెడ్డి
డి – విటమిన్‌లభ్యమయ్యే వరి, గోధుమ పంటలు పండించినందుకు తెలంగాణ రైతు చింతల వెంకట్‌రెడ్డికి మేధోపరమైన హక్కు(పేటెంట్) లభించింది. ఆయన పండించిన 100 గ్రాముల బియ్యంలో 102 నుంచి 141 అంతర్జాతీయ యూనిట్ల(ఐయూ) డి-విటమిన్‌ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అదే విధానంలో సాగుచేసిన 100 గ్రాముల గోధుమల్లో 1832 ఐయూ ఉన్నట్లు ప్రయోగంలో తేలింది.
విజయ్‌సాంప్లా
జాతీయ ఎస్సీ కమిషన్‌ఛైర్మన్‌గా పంజాబ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి విజయ్‌సాంప్లా నియమితులయ్యారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న కమిషన్‌పోస్టును భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
బానోత్ రాందాస్
భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ చెప్తున్న గిరిజన ఉపాధ్యాయుడు డాక్టర్‌బానోత్‌రాందాస్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. లేటెస్ట్‌ఇన్నోవేషన్‌ఫర్‌ఫ్యూచర్‌ఎడ్యుకేషన్(లైఫ్) పేరిట రాందాస్‌రచించిన ఈ పుస్తకాన్ని చెన్నైలోని ఈఎస్‌ఎన్‌పబ్లికేషన్‌సహకారంతో ప్రచురించారు. ప్రపంచంలోనే అత్యంత లావైన పుస్తకంగా దీన్ని గుర్తించారు.
ప్రొణీత గుప్తా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు దక్కింది. కార్మిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో విశేష కృషి చేసిన ప్రొణీత గుప్తా దేశీయ విధాన మండలిలో కార్మిక సంక్షేమ వ్యవహారాలకు సంబంధించి బైడెన్‌కు ప్రత్యేక సహాయకురాలిగా నియమితులయ్యారు. ఒబామా హయాంలో కార్మిక శాఖలో మహిళా విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందించారు.
డాక్టర్‌సంజయ్‌రెడ్డి
కొవిడ్‌పై పోరులో సేవలందించిన తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌మెంబర్, సీనియర్‌ఫార్మకాలజిస్ట్‌డాక్టర్‌ఆకుల సంజయ్‌రెడ్డికి కరోనా వారియర్‌ఇంటర్నేషనల్‌అవార్డు లభించింది. కరోనా వ్యాప్తి సమయంలో మందులు, వాటి ప్రభావం, వ్యాక్సిన్‌ట్రయల్స్, వ్యాక్సినేషన్‌తదితర అంశాలపై వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ఎమర్జెన్సీ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు.
అంజలీ భరద్వాజ్
అమెరికా తొలిసారిగా ప్రకటించిన ‘అంతర్జాతీయ అవినీతి నిరోదక చాంపియన్స్ అవార్డ్’ విజేతల జాబితాలో భారత్‌కు చెందిన ప్రముఖ ఆర్టీఐ, సామాజిక కార్యకర్త అంజలీ భరద్వాజ్ చోటు దక్కించుకున్నారు. బైడెన్ ప్రభుత్వం వివిధ దేశాలకు చెందిన 12 మందికి ఈ పురస్కారాలను ప్రకటించింది.
మాతం వెంకటరావు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా తెలుగు రాష్ట్రానికి చెందిన మాతం వెంకటరావు నియమితులయ్యారు. మార్చి 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన కెనరా బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తిరుపతి అగ్రికల్చర్ కాలేజ్‌లో 1982 నుంచి 86 మధ్య ఏజీ బీఎస్సీ పూర్తి చేశారు.
మైలవరపు కృష్ణతేజ
కేరళ టూరిజం డైరెక్టర్‌గా తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ నియమితులయ్యారు. ప్రస్తుతం పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్‌గా ఉండగా డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కిందట కేరళలో వరద బీభత్సం సృష్టించిన నేపథ్యంలో సహాయక చర్యల్లో కృష్ణతేజ చూపించిన చొరవకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
బిదిష భట్టాచార్య
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యంత్రాంగంలో మరో భారతీయ అమెరికన్ మహిళకు కీలక పదవి దక్కింది. పర్యావరణ, ఇంధనరంగ నిపుణురాలు బిదిష భట్టాచార్య వ్యవసాయ శాఖ ‘ఫార్మ్ సర్వీస్ ఏజెన్సీ’ లో సీనియర్ పాలసీ సలహాదారుగా నియమితులయ్యారు.
ఆర్జా శ్రీకాంత్
తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంతో సమన్వయం చేసే అధికారిగా డాక్టర్ ఆర్జా శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శ హోదాలో ఆయన పనిచేస్తారు.
సైన్స్ & టెక్నాలజీ
తేజస్ కోసం రూ.48 వేల కోట్లు
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో కేంద్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో జరిగిన ఒప్పందంలో భాగంగా 83 తేజస్ ఎంకే1ఏ-ఎల్‌సీఏ యుద్ధ విమానాలను భారతీయ వైమానిక రంగానికి హెచ్‌ఏఎల్ అందిస్తుంది.
బీడీఎల్ నుంచి కొత్త ఆయుధాలు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) గరుడాస్త్ర, దిషాని అనే రెండు కొత్త ఆయుధాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ఆయుధాలు నీటి అడుగులో దూసుకెళ్లేవే. బెంగళూరులో ప్రారంభమైన ఏరో ఇండియా-2021 ప్రదర్శనలో బీడీఎల్ గతానికంటే భిన్నంగా చాలా ఆయుధ వ్యవస్థల్ని ప్రదర్శించింది.
ఇస్రోతో స్కైరూట్ ఏరోస్పేస్
హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనల సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అంతరిక్ష వాహక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇస్రోకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, అనుభవం, సదుపాయాలను వినియోగించుకునే అవకాశం స్కైరూట్‌కు లభిస్తుంది. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి వీలైన మూడు రకాల లాంచ్ వెహికల్స్‌ను ఇప్పటికే ఈ సంస్థ ఆవిష్కరించింది.
12 సంస్థలతో బీడీఎల్ ఒప్పందాలు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) దేశ, విదేశాల్లోని 12 సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. బెంగళూరులో ఇటీవల జరిగిన ఏరో ఇండియా-21 సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. యూకే, ఫ్రాన్స్, ఉక్రెయిన్, బల్గేరియా దేశాలకు చెందిన సంస్థలతో పాటూ భారతీయ కంపెనీలతో బీడీఎల్ ఒప్పందం చేసుకుంది.
అంగారక కక్ష్యలోకి ‘అమల్’
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ‘అమల్’ అనే అంతరిక్ష నౌక ఫిబ్రవరి 9న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది అరబ్ దేశాల తొలి గ్రహాంతర ప్రయోగం. దాదాపు ఏడు నెలల పాటు 30 కోట్ల మైళ్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యను చేరుకుంది. కక్ష్యలో పరిభ్రమిస్తూ అంగారక గ్రహ వాతావరణం గురించి సమాచారం సేకరించనుంది.
మార్చిలో రష్యా 40 శాటిలైట్లు
రష్యన్ స్పేస్ ఇండస్ట్రీ మార్చి 2021లో మరో ప్రయోగం చేయబోతోంది. 18 వేర్వేరు దేశాలకు చెందిన 40 శాటిలైట్లను సోయూజ్–2 రాకెట్ ద్వారా ఆర్బిట్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించింది. సోయూజ్–2 క్యారియర్ రష్యన్ సోయూజ్ అడ్వాన్స్డ్ వెర్షన్.
సైన్యానికి మార్క్‌ఏ యుద్ధ ట్యాంక్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమిళనాడులో రూపొందించిన ‘అర్జున్‌యుద్ధ ట్యాంకు మార్క్‌ఏ’ను ప్రధాని మోడీ సైన్యానికి అప్పగించారు. తేజస్‌తర్వాత ఆత్మనిర్భర్‌భారత్‌కింద భారత దళాలకు అందిన అతిపెద్ద ఆయుధం అర్జున్‌యుద్ధ ట్యాంకు. ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడేలా దీన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.
క్రయోజెనిక్ మైక్రోస్కోప్ ఆవిష్కరణ
సరికొత్త క్రయోజెనిక్‌మైక్రోస్కోప్‌ను టాటా ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ఫండమెంటల్‌రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేశారు. తక్కువ నిర్వహణ వ్యయంతో పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ క్రయోజెనిక్‌ఎస్‌టీఎం ద్వారా 1/10000 వంతు మైక్రాన్ల వరకు (అణువంత) స్పష్టంగా చూడవచ్చు. ఇది ద్రవ నత్రజని, హీలియం అవసరం లేకుండానే పనిచేస్తుంది. దీంతో నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.
నౌకాదళానికి లేటెస్ట్ మిస్సైల్స్
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతల క్షిపణి (లాంగ్‌రేంజ్‌సర్ఫేస్‌టు ఎయిర్‌మిస్సైల్‌ఎల్‌ఆర్‌సామ్) తుది బ్యాచ్‌ఉత్పత్తి రవాణాను ప్రారంభించారు. బీడీఎల్‌తో పాటు వేర్వేరు పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ క్షిపణులను ఉత్పత్తి చేశారు. భారత నౌకాదళం తాజా అవసరాలకు తగ్గట్టుగా ఇజ్రాయెల్‌తో కలిసి డీఆర్‌డీవో ఎల్‌ఆర్‌సామ్‌ను అభివృద్ధి చేసింది.
ఇస్రో, ఆస్ట్రేలియన్‌స్పేస్ ఏజెన్సీ అగ్రిమెంట్
అంతరిక్ష కార్యకలాపాల్లో సమన్వయం పెంచే దిశగా ఇస్రో, ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీల మధ్య ఒప్పందం కుదిరింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఒప్పంద కార్యక్రమంలో ఇస్రో అధ్యక్షుడు డాక్టర్‌కె.శివన్‌స్పేస్‌ఆస్ట్రేలియా హెడ్‌ఎన్రికో పాలెర్మో ఒప్పంద పత్రాలను ప్రదర్శించారు. రెండు దేశాల అంతరిక్ష రంగాలను అభివృద్ధిపరుస్తూ, పౌరుల భాగస్వామ్యం పెంచడం ఒప్పందం ప్రధాన లక్ష్యం.
అంగారకుడిపైకి పర్సెవరెన్స్
అంగారక గ్రహం మీదకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పర్సెవరెన్స్ రోవర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. మార్స్ మీద గతంలో జీవం ఉందా అనే విషయాలను కనుక్కోడానికి నాసా దీన్ని ప్రయోగించింది. అంగారకుడిపైకి నాసా ప్రయోగాల్లో పర్సెవరెన్స్ తొమ్మిదవది. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్త స్వాతి మోహన్ గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ వ్యవహారాలకు నాయకత్వం వహించారు.
నింగిలోకి కేథరిన్
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన గణిత శాస్త్రవేత్త కేథరిన్ జాన్సన్ పేరుతో రూపొందించిన వ్యోమనౌకను నింగిలోకి పంపించింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) తో అనుసంధానం అవుతుంది. ఈ కేంద్రంలోని వ్యోమగాములకు సరకులు మోసుకెళ్లడానికి దీనిని ఉపయోగించారు.
వీఎల్–ఎస్ఆర్శామ్ సక్సెస్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి నిట్టనిలువు ప్రయోగ వెర్షన్ (వీఎల్–ఆర్శామ్)ను భారత్ ఫిబ్రవరి 22న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ లోని ఐటీఐఆర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. నౌకాదళ అవసరాల కోసం డీఆర్‌డీవో స్వదేశీ టెక్నాలజీతో దీన్ని రూపొందించింది. తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఇది ఉపయోగపడుతుంది.
అల్జీమర్స్‌కు ఔషధం
అల్జీమర్స్ వ్యాధిని నయం చేసే ఔషధాన్ని బెంగుళూరులోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్’ కి చెందిన ప్రొఫెసర్ టి.గోవిందరాజు ఆధ్వర్యంలోని బృందం దీన్ని రూపొందించినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ తెలిపింది.
స్పోర్ట్స్
అశోక్ దిండా రిటైర్మెంట్
సీనియర్ బెంగాల్ పేసర్, టీమ్‌ఇండియా ఆటగాడు అశోక్ దిండా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల దిండా భారత్ తరఫున 13 వన్డేలు 12 వికెట్లు, 9 టీ20లాడి 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పుణె వారియర్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడిన అతను 78 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు తీశాడు.
టాప్-20లో సాత్విక్ జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప కెరీర్లో అత్యుత్తమంగా19వ స్థానంలో నిలిచారు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 7వ, సైనా 19వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 13వ, సాయిప్రణీత్ 17వ, కశ్యప్ 26వ, సమీర్‌వర్మ 27వ ర్యాంకులు సాధించారు.
ముస్తాక్ అలీ ట్రోఫీ
ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని తమిళనాడు కైవసం చేసుకుంది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో బరోడా జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి దేశవాళీ టీ20 ట్రోఫీ గెలిచింది. గతంలో 2006-07 మధ్య జరిగిన టోర్నీలో తమిళనాడు టైటిల్ సాధించింది.
ఏసీసీ అధ్యక్షుడిగా జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏసీసీ సభ్య దేశాల ప్రతినిధులు షాను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ నజ్ముల్ హసన్ స్థానాన్ని షా భర్తీ చేయనున్నారు. ఆసియా కప్‌ను ఏసీసీనే నిర్వహిస్తుంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా పంత్
ఐసీసీ తొలి ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును టీమ్‌ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సొంతం చేసుకున్నాడు. జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న పంత్ ఐసీసీ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ అవార్డును అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికైంది.
ఐసీసీ స్పాన్సర్‌గా బైజుస్
2021 నుంచి 2023 వరకు ఐసీసీ ఈవెంట్లకు భారతీయ ఎడ్యు-టెక్ కంపెనీ బైజుస్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని ప్రకటించింది. మూడేళ్ల ఒప్పందంలో భారత్‌లో టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్‌లో మహిళల ప్రపంచకప్ సహా ఐసీసీ మెగా టోర్నీలన్నింటిలో బైజుస్ భాగస్వామిగా ఉంటుంది. ఈ ఒప్పందంలో భాగంగా స్టేడియాల్లో, క్రికెట్ ప్రసారాల్లో బైజుస్‌కు మరింత ప్రాధాన్యం దక్కుతుంది.
అథ్లెటిక్స్‌లో ప్రణయ్, నందినికి గోల్డ్
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్‌లో తెలంగాణకు చెందిన కొత్తూరి ప్రణయ్ బాలుర అండర్-16 హైజంప్‌లో 1.89 మీటర్ల దూరం దూకి స్వర్ణం గెలుచుకున్నాడు. తొలిరోజు అండర్-18 బాలికల లాంగ్‌జంప్‌లో తెలంగాణ అథ్లెట్ నందిని 5.80 మీటర్ల దూరం దూకిన ఆమె గోల్డ్ మెడల్ సాధించింది.
క్రిస్ మోరిస్ @ 16.25 కోట్లు
ఐపీఎల్ 2021 వేలంపాటలో సౌతాఫ్రిక క్రికెటర్ క్రిస్ మోరిస్ జాక్‌పాట్ కొట్టేశాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ రికార్డు ధరకు ( రూ.16.25కోట్లు) మోరిస్‌ను దక్కించుకుంది. కైల్ జేమిసన్ (15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (14.25కోట్లు)ను బెంగళూర్ టీమ్ సొంతం చేసుకుంది. టీం ఇండియాకు ఆడకుండానే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా క్రిష్ణప్ప గౌతమ్ (9.25 కోట్లు) నిలిచాడు. ఈ కర్ణాటక ప్లేయర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
టెస్టులకు డుప్లెసిస్గుడ్బై
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ఫాఫ్‌డుప్లెసిస్(36) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ప్రాధాన్యతనిస్తానని తెలిపాడు. ఆయన దక్షిణాఫ్రికా తరఫున 69 టెస్టుల్లో 40.02 సగటుతో 4163 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి. ఇప్పటివరకు 143 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
క్రికెట్‌కు నమన్‌ఓజా వీడ్కోలు
వికెట్‌కీపర్‌నమన్‌ఓజా (37) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌అవుతున్నట్లు ప్రకటించాడు. మధ్యప్రదేశ్‌రాష్ట్రానికి చెందిన ఓజా భారత్‌తరఫున ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో శ్రీలంకతో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసి జింబాబ్వేపై తొలి టీ20 ఆడాడు. 146 ఫస్ట్‌క్లాస్‌మ్యాచ్‌లు ఆడి 9753 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్
మెల్బోర్న్లో జరిగిన ఆస్ర్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ 7–5, 6–2, 6–2 తేడాతో మెద్వెదెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. దీంతో జకోవిచ్ గ్రాండ్‌స్లామ్స్ సంఖ్యను 18 కి పెంచుకున్నాడు. మహిళల ఫైనల్స్‌లో నవోమి ఒసాకా(జపాన్) అమెరికన్ ప్లేయర్ బ్రాడీని 6–1, 6–4తో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీని బార్బారా క్రెజికోవా, ఆండి రామ్ దక్కించుకున్నారు.
జాతీయ టీటీ చాంపియన్ సత్యన్
భారత టీటీ స్టార్ సత్యన్ తొలిసారి జాతీయ టీటీ చాంపియన్ షిప్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో తొమ్మది సార్లు చాంపియన్ శరత్ కమల్‌ను ఓడించి టైటిల్ నెగ్గాడు. తెలంగాణ కుర్రాడు స్నేహిత్ సెమీ ఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
మొతేరా స్టేడియానికి మోడీ పేరు
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్‌కు ‘ నరేంద్ర మోడీ స్టేడియం’గా పేరు పెట్టారు. మొతేరా మైదానానికి గతంలో సర్దార్ వలబ్భాయ్ పటేల్ పేరు ఉండేది. ఫిబ్రవరి 24న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీన్ని ప్రారంభించారు. ఈ స్టేడియంలో 1.32 లక్షల మంది ప్రేక్షకులు కూర్చొని చూసే వీలుంది.