Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ ఎఫైర్స్​@ ఏప్రిల్​

కరెంట్​ ఎఫైర్స్​@ ఏప్రిల్​

నేషనల్​

66వ ఫిల్మ్​ఫేర్​ అవార్డ్స్​
ఏటా బాలీవుడ్​లో నిర్వహించే ఫిల్మ్​ఫేర్​ అవార్డుల వేడుకను ముంబయిలో నిర్వహించారు. ఉత్తమ చిత్రంగా ‘థప్పడ్​’, ఉత్తమ నటుడితో పాటు జీవిత సాఫల్య పురస్కారం దివంగత ఇర్ఫాన్​ఖాన్​, ఉత్తమ నటిగా తాప్సీ, ఉత్తమ డైరెక్టర్​గా ఓం రౌత్​కు అవార్డులు వచ్చాయి.

భారత్​–బంగ్లా మధ్య ‘మిథాలీ ఎక్స్​ప్రెస్​’
భారత్​–బంగ్లాదేశ్​ మధ్య ప్రయాణికుల కోసం కోసం రైలు ప్రారంభించారు. ఢాకా నుంచి పశ్చిమ బెంగాల్​లోని న్యూ జల్పాయిగుడి వరకు ‘మిథాలీ ఎక్సెప్రెస్​’ పేరుతో ఇది నడుస్తుంది. ఇరు దేశాల ప్రధానులు షేక్​ హసీనా, మోఢీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు.

క్షయ రహిత జిల్లాగా బడ్గాం
దేశంలోని ఏకైక క్షయ రహిత జిల్లాగా జమ్మూ–కశ్మీర్​లోని బడ్గాం నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 65 జిల్లాలు టీబీ రహిత ప్రాంతాలుగా అప్లై చేసుకోగా వాటిలో బడ్గాం మెరుగైన పనితీరుతో అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఐదేళ్లలో చూపిన ప్రతిభకు గోల్డ్​ మెడల్​ అందించారు.

కొత్తగా 4కోట్ల ఇళ్లకు నళ్లా నీళ్లు
దేశవ్యాప్తంగా జల్​ జీవన్​ మిషన్​ కార్యక్రమం కింద కొత్తగా 4 కోట్ల గ్రామీణ ఇండ్లకు కుళాయి నీళ్లు అందించినట్లు కేంద్ర జల్​శక్తి శాఖ తెలిపింది. గ్రామాల్లో 100 శాతం ఇండ్లకు కుళాయి నీరు అందించిన ప్రథమ రాష్ట్రంగా గోవా, ఆ తర్వాతి స్థానాలను తెలంగాణ, అండమాన్​ నికోబార్​ దీవులు దక్కించుకున్నాయన్నారు.

హేమావతి తీరంలో చెన్నకేశవుడి విగ్రహం
కర్నాటకలోని హాసన జిల్లా హళేబేలూరు గ్రామ శివార్లలో హేమావతి నదీతీరంలో వెయ్యేళ్ల నాటి చెన్నకేశవుడి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం ఐదున్నర అడుగుల ఎత్తు ఉంది. హాసన జిల్లాలో ఇటీవలే ఓ జైనమందిరం కూడా బయటపడింది.

భారత్​లో వేలిముద్రల నివేదిక
వేలిముద్రల విశ్లేషణ, పాత నేరగాళ్ల ఫింగర్​ ప్రింట్​తో వాటిని సరిపోల్చడం ద్వారా ‘ఆంధ్రప్రదేశ్​ వేలిముద్రల విభాగం’ అందించిన వివరాలతో పోలీసులు 512 కేసుల్ని ఛేదించారు.దేశంలో అత్యధిక కేసులు ఛేదించిన జాబితాలో ఏపీ టాప్​ ప్లేస్​లో ఉంది. తర్వాత స్థానాల్లో కేరళ(402), కర్నాటక (399), తెలంగాణ (350) ఉన్నాయి.

చీనాబ్​ వంతెన ఆర్చి పూర్తి
జమ్మూ–కశ్మీర్​లోని ఉధంపుర్​–శ్రీనగర్​–బారాముల్లా రైలు లింక్​ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్​ నదిపై అత్యంత ఎత్తులో నిర్మిస్తున్న స్టీల్​ ఆర్చిని భారతీయ రైల్వే శాఖ పూర్తి చేసింది. చీనాబ్​ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నారు. కశ్మీర్​ లోయను మిగతా దేశంతో కలపడానికి రైల్వేశాఖ రూ.27,949 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతుంది. ఈ బ్రిడ్జిలో ప్రధానమైన ఆర్చి 467 మీటర్లు ఉంటుంది.

అంటువ్యాధులకు స్పెషల్​ యాప్​
దేశవ్యాప్తంగా అంటువ్యాధుల నమోదుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్​ ప్రత్యేక యాప్​ ప్రారంభించారు. దీని ద్వారా దేశంలో 33 రకాల అంటువ్యాధులు ఎక్కడ వ్యాపించిన వెంటనే తెలిసిపోతుంది. ఈ యాప్​ను తెలంగాణలో 2018 నుంచి ప్రయోగాత్మకంగా వాడుతున్నామని హెల్త్​ మినిస్టర్​ ఈటెల రాజేందర్​ తెలిపారు.

48వ సీజేఐగా ఎన్​వీ రమణ
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్​వీ రమణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24న రాష్ట్రపతి భవన్​లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న రెండో వ్యక్తిగా రమణ నిలవనున్నారు. గతంలో1966–67 లో జస్టిస్​ కోకా సుబ్బారావు 9వ సీజేఐగా సేవలు అందించారు.

భారత వృద్ధిరేటు 12.5%
ఈ ఏడాది భారత వృద్ధి ఆకర్షణీయంగా 12.5 శాతం నమోదు అవుతుందని ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎమ్​ఎఫ్​) అంచనా వేస్తోంది. గతేడాది కరోనా సమయంలోనూ సానుకూల దేశంగా భారత్​ నిలిచింది. చైనా దేశం కంటే ఎక్కువ వృద్ధి సాధించింది. 2021 లో 12.5%, 2022లో 6.9% మేర వృద్ధి నమోదు చేయవచ్చని ఐఎమ్​ఎఫ్​ అంచనా వేస్తోంది.

ఖేలో ఇండియాలో హ్యాండ్​బాల్​
ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2021లో హ్యాండ్‌బాల్‌ను క్రీడాంశంగా చేర్చినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర క్రీడల మంత్రిగా కిరణ్‌ రిజిజు, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా నరీందర్‌ బాత్ర, భారత హ్యాండ్‌ బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌ రావు ఉన్నారు.

‘చిరంజీవి హెల్త్​కేర్​ మెడిక్లెయిమ్​’
రాజస్థాన్​లో ఏప్రిల్​ 1 నుంచి ‘చిరంజీవి హెల్త్​కేర్​ మెడిక్లెయిమ్​’ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లాట్​ ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం రూ.5 లక్షల వరకు విలువైన క్యాష్​లెస్​ మెడిక్లెయిమ్​ ఉపయోగించుకోవచ్చు. ప్రజలందరికి మెడికల్​ రిలీఫ్​ కల్పించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

నచ్చిన మతం ఎంచుకోవచ్చు
దేశంలో 18 ఏండ్లు నిండిన వ్యక్తులు తమకు నచ్చిన మతం ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. బలవంతపు మత మార్పిడిలను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ నాయకుడు అశ్వినీ కుమార్​ ఉపాధ్యాయ తరఫున లాయర్​ గోపాల్​ శంకర్​ నారాయణ వేసిన పిటిషన్​ కోర్టు తిరస్కరించింది. 18 ఏండ్లు నిండితే తమకు నచ్చిన మతం ఎంచుకుంటే అడ్డుకోవడానికి ఎలాంటి కారణం లేదని జస్టిస్​ నారీమన్​ నేతృత్వంలోని ధర్మాసనం తెలియజేసింది.

వ్యాక్సినేషన్​ అంబాసిడర్​గా సోనుసూద్​
పంజాబ్​లో కొవిడ్​–19 నిరోధక టీకా కార్యక్రమానికి అంబాసిడర్​గా యాక్టర్​ సోనుసూద్​ నియమితులయ్యారు. కొవిడ్​ టీకాల పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభ్యంతరాలను చెరిపివేయడానికి సోనుసూద్​ క్రేజ్, ఆయన అందించిన సేవలు ఉపయోగపడుతాయని పంజాబ్​ సీఎం అమరీందర్​​ సింగ్​ తెలిపారు.

చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​గా సుశీల్​ చంద్ర
భారత చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​గా సుశీల్‌ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా ఏఫ్రిల్‌ 12వ తేదీన వైదొలగడంతో ఆ స్థానంలో సుశీల్‌ చంద్ర బాధ్యతలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 14వ తేదీన సుశీల్‌చంద్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌గా 2022 మే 14వ తేదీ వరకు కొనసాగనున్నారు. ఆయన నేతృత్వంలోనే గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సింగరేణి సంస్థకు నేషనల్​ అవార్డ్​
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిద (ఫ్లైయాష్‌)ను 100 శాతం వినియోగంలోకి తెచ్చినందుకు అత్యుత్తమ ఫ్లైయాష్‌ వినియోగ సంస్థగా ‘సింగరేణి సంస్థ’కి నేషనల్​ అవార్డు లభించింది. 500 మెగావాట్ల పైబడి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న థర్మల్‌ ప్లాంట్ల విభాగంలో సింగరేణికి ఈ పురస్కారం దక్కింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిదను ప్రధానంగా సిమెంటు కంపెనీలకు రవాణా చేస్తున్నారు.

ఆహార్​ క్రాంతి
పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ఆహార్​ క్రాంతి’ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ ప్రారంభించారు. స్థానికంగా లభ్యమయ్యే కూరగాయలు, పండ్లలో పోషకాల సమతౌల్యత ఎలా ఉందనే విషయంపై ‘ఆహార క్రాంతి’ ఫోకస్​ చేస్తోందని, తక్కువ డబ్బుతో పౌష్టికాహారం ఎలా పొందాలో వివరిస్తుందని ఆయన అన్నారు.

స్పుత్నిక్‌ టీకాకు అనుమతి
స్పుత్నిక్‌ టీకాను దిగుమతి చేసుకునేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)నుంచి తమకు అనుమతి లభించిందని ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏప్రిల్‌ 13న తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు తోడు మూడో టీకా స్పుత్నిక్‌ రానుంది.

ఆక్సిజన్​ డెలివరీ సిస్టం
సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్‌ అందించేందుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఎస్‌పీవో–2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం అనే పరికరం కరోనా బాధితులకు వరంగా మారనుంది. బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన ‘ది డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబొరేటరీ’ తయరుచేసిన చేసింది. ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్‌ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంది.

కరోనా యోధులకు బీమా
కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని తీసుకురానుంది. 2020లో కేంద్రం ప్రకటించిన ‘ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ ప్యాకేజీ’ ఏప్రిల్​ 24తో ముగుస్తుంది. కొత్త బీమా పథకం కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్​ కంపెనీతో చర్చిస్తున్నట్లు పేర్కొంది.

స్టార్టప్​ ఇండియా సీడ్​ ఫండ్​
దేశంలోని స్టార్టప్స్‌ను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్​ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్న స్టార్టప్స్‌కు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న వ్యాపార ఆలోచనలకు ఈ స్కీమ్‌ మద్దతుగా నిలుస్తుంది.

దేశంలోనే ఐఎస్​బీ టాప్​
ఆపరేషన్స్ మేనేజ్​మెంట్​ పరిశోధనల విశ్వవిద్యాలయాలు, బిజినెస్​ స్కూళ్లకు సంబంధించిన ర్యాంకింగ్​లో దేశంలో ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ (ఐఎస్​బీ) టాప్​లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ మేనేజ్​మెంట్​ పరిశోధనా వర్సిటీలు, బిజినెస్​ స్కూల్స్​, సంస్థలకు ర్యాంకింగ్​ ఇచ్చే ‘ ది ఎస్​సీఎం జర్నల్​ లిస్ట్​’ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్స్​లో ఐఎస్​బీ ఈ ఘనత సాధించింది. ప్రపంచ స్థాయి 100 సంస్థల్లో 64వ స్థానంలో నిలిచింది.

నెల్సన్​ మండేలా అవార్డ్​
నెల్సన్‌ మండేలా అవార్డు–2021కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్‌ సిటీ పోలీస్​ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఎంపికయ్యారు. నేషనల్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. ప్రతి ఏటా ఢిల్లీలో నవంబర్‌లో జరిగే జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా అవార్డును ప్రదానం చేస్తారు.

Advertisement

ఇంటర్నేషనల్


2036 వరకు పుతినే ప్రెసిడెంట్
రష్యా అధ్యక్షుడిగా పుతిన్​ మరో రెండ సార్లు కొనసాగేందుకు వీలు కల్పించే బిల్లును ఆ దేశ దిగువసభ ఆమోదించింది. దీంతో 2036 వరకు ఆయనే ప్రెసిడెంట్​గా కొనసాగనున్నారు. ఈ బిల్లు రష్యా ఎగువసభ ఆమోదించాక అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారనుంది. ప్రస్తుత పుతిన్​ ఆరేళ్ల పదవీకాలం 2024తో ముగియనుంది.
జంతువు నుంచి కరోనా వైరస్​
కరోనా వైరస్​ గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో)–చైనా నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. ప్రమాదవశాత్తు ల్యాబ్​ నుంచి కరోనా వైరస్​ లీకై ఉండడానికి అవకాశం చాలా తక్కువని వివరించింది.
అమెరికా జిల్లా కోర్టు జడ్జిగా రూపా
డిస్ట్రిక్ట్​ ఆఫ్​ కొలంబియా (డీసీ) జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్​ రూపా రంగా పుట్టగుంటను నామినేట్​ చేస్తున్నట్లు వైట్​హౌస్​ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సెనెట్​ ఆమోదం లభిస్తే డీసీ జిల్లా కోర్టు జడ్జి పదవికి ఎంపికైన తొలి ఆసియా అమెరికన్​ మహిళగా రూపా రంగా నిలుస్తారు.
భారత్​ ర్యాంక్​ 140
స్త్రీ–పురుష సమానత్వ సూచీలో మనదేశ ర్యాంక్​ మరింత పడిపోయింది. ప్రపంచ ఆర్థిక నివేదిక (డబ్ల్యూఈఎఫ్​) రూపొందించిన లింగ సమానత్వ (గ్లోబల్​ జెండర్​ గ్యాప్​) నివేదిక–2021లో మొత్తం 156 దేశాల్లో భారత్​ 140వ స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో పాకిస్థాన్​, అఫ్ఘనిస్థాన్​ మాత్రమే మనకన్నా తక్కువ ర్యాంకులో ఉన్నాయి. మొదటిస్థానంలో ఐస్​లాండ్​ నిలిచింది.
భారత్​లో హక్కుల సమస్యలు
చట్టవిరుద్ధంగా, ఏకపక్ష రీతిలో ప్రాణాలు తీయడం సహా భారత్​లో మానవ హక్కుల సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయని అమెరికా నివేదిక ఒకటి పేర్కొంది. భావ వ్యక్తీకరఱ స్వేచ్ఛపైనా, మీడియాపై ఆంక్షలున్నాయని తెలిపింది. 12 ముఖ్యమైన అంశాలను ఇందులో ప్రస్తావించింది.
రెండో హబ్​గా హైదరాబాద్​
వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన వరల్డ్‌ లాజిస్టిక్స్‌ పాస్‌పోర్ట్‌ (డబ్ల్యూఎల్‌పీ) భారత్‌లో తమ కార్యకలాపాలకు రెండో హబ్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంది. డబ్ల్యూఎల్‌పీ 2021 ఫిబ్రవరిలో తొలిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం10కి పైగా దేశాలు ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి.

ఫోర్బ్స్​ ప్రపంచ బిలియనీర్స్​
ఫోర్బ్స్​ 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. అమెజాన్​ వ్యవస్థపకుడు జెఫ్​ బెజోస్ (177 బిలియన్​ డాలర్లు)​ వరుసగా నాలుగోసారి ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో టెస్లా సీఈవో ఎలాన్​ మస్క్​ (151 బి.డాలర్లు) నిలిచాడు. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్​ అంబానీ 84.5 బిలియన్​ డాలర్లతో పదో స్థానంలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి మురళి దివి (6.8 బిలియన్​ డాలర్లు) 384 వ స్థానంలో ఉన్నాడు.
ఒలింపిక్స్​కు ఉత్తర కొరియా దూరం
ఒలింపిక్స్‌ క్రీడల్లో తమ దేశం పాల్గొనబోవడం లేదని ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ నుంచి తమ దేశ క్రీడాకారులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన ఉత్తర కొరియా ఆ తర్వాత రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొంది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పునరాగమనం చేశాక 2016 రియో ఒలింపిక్స్‌ వరకు ఉత్తర కొరియా బరిలోకి దిగింది.
భారత్‌ అధ్యక్షతన బ్రిక్స్‌
బ్రిక్స్‌ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్ల ఆన్‌లైన్‌ సమావేశానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. విధానపరమైన మద్దతుకుతోడు, అంతర్జాతీయ సమన్వయాన్ని పెంచుకోవడం ద్వారా బ్రిక్స్‌ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. 2021లో బ్రిక్స్‌కు భారత్‌ అధ్యక్షత వహిస్తోంది.
ఢిల్లీలో ఆసియా బాక్సింగ్​ టోర్నీ
ఆసియా మహిళల బాక్సింగ్‌ టోర్నీ మే 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు) ఏడో పతకం లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జట్టులోకి ఎంపికైన ఇతర బాక్సర్లలో… మోనిక (48 కేజీలు), సాక్షి (54 కేజీలు), జాస్మిన్‌ (57 కేజీలు), సిమ్రన్‌జిత్‌ (60 కేజీలు), బసుమతారి (64 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), సవీటి (81 కేజీలు), అనుపమ (ప్లస్‌ 81) ఉన్నారు. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆరు మెడల్స్​ వచ్చాయి.

ఎవర్​ గివెన్​ నౌకకు జరిమానా
సూయజ్​ కాలువలో ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన రవాణా నౌక ‘ఎవర్​ గివెన్​’కు ఈజిప్టు న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల జరిమాన విధించింది. దీన్ని చెల్లించేందుకు మేనేజ్​మెంట్​ నిరాకరించడంతో నౌకను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
అత్యధిక కుబేరులున్న దేశంగా అమెరికా
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా అమెరికా నిలిచింది. అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో, భారత్‌ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 35వ వార్షిక బిలియనీర్ల జాబితా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అమెరికాలో 724 మంది, చైనాలో 698 మంది, భారత్‌లో 140 మంది బిలియనీర్లు ఉన్నారు. జర్మనీ (136), రష్యా (117) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
నార్వే ప్రధానికి ఫైన్​
కరోనా రూల్స్​ పాటించనుందుకు నార్వే ప్రధానమంత్రి ఎర్నాసోల్​బెర్గ్​కు ఆ దేశ పోలీసులు రూ.1,75,690 జరిమానా విధించారు. ఆమె ఫిబ్రవరిలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కరోనా నిబంధనలు అతిక్రమించారని పోలీసులు తెలిపారు.
అమెరికా దళాల ఉపసంహరణ
అఫ్గానిస్థాన్​లో ఉన్న అమెరికా బలగాలను సెప్టెంబర్​ 11 లోగా వెనక్కి తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్​ ప్రకటించారు. బైడెన్​ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్​పై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అఫ్గాన్​ మొత్తం తాలిబాన్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని, దీంతో భారత్​లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ముప్పు ఉందని భావిస్తున్నారు.
మిసెస్​ శ్రీలంకగా పుష్పిక డి సిల్వా
మిసెస్​ శ్రీలంక–2021 ఏప్రిల్​ 7న నిర్వహించిన పోటీల్లో విన్నర్​గా పుష్పిక డి సిల్వా నిలిచినట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు. పెళ్లి చేసుకున్న వారే ఈ పోటీకి అర్హులని, విడాకులు తీసుకున్న వారు కాదని 2019 మిసెస్​ శ్రీలంక విజేత కరోలిన్​ జూరి తెలుపుతూ పుష్పిక కిరిటాన్ని తీసి రన్నర్​ తలపై పెట్టింది. భర్తకు దూరంగా ఉంది కాని విడాకులు తీసుకోలేదని తిరిగి కిరిటాన్ని పుష్పికకు పెట్టారు.

తగ్గనున్న చైనా జనాభా
నాలుగేళ్లలో చైనాలో జనాభా గరిష్ఠ స్థాయికి చేరి, 2025 తర్వాత తగ్గడం మొదలవుతుందని ఆర్థికవేత్త కాయ్​ ఫాంగ్​ తెలిపారు. కుటుంబ నియంత్రణ విధానాలు సరళీకరించకుంటే 2050 నాటికి కార్మికుల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుతుందని ‘పీపుల్స్​ బ్యాంక్​ ఆఫ్​ చైనా’ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. 2010లో చైనా జనాభా 134 కోట్లుగా ఉంది.
క్యూబా కమ్యూనిస్ట్​ పార్టీ నేతగా కానెల్​
క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేతగా మిగ్యూల్​ డయాజ్​ కానెల్​ ఎన్నికయ్యారు. పార్టీ ప్రస్తుత ఫస్ట్​ సెక్రెటరీ రౌల్​ క్యాస్ట్రో నిర్వహిస్తున్న బాధ్యతలు ఇకపై కానెల్​ చేపడతారు. డయాజ్ కానెల్​ 2018లోనే క్యూబా అధ్యక్షుడయ్యారు. క్యాస్ట్రోలు నిర్వహించిన గెరిల్లా పోరాటాల్లో ఎన్నడూ పాల్గొనకున్నా, దేశంలో సాధారణ సైనికుడిగా పనిచేశారు.
ఇంగ్లాండ్​లో కామన్​వెల్త్​గేమ్స్​
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరంలో 22వ కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల టి20 క్రికెట్‌ తొలి రోజే ప్రేక్షకులను అలరించనుంది.
బ్రిటన్​ ప్రధాని పర్యటన రద్దు
బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ భారత్​ పర్యటన రద్దు చేసుకున్నారు. కరోనా సంక్షోభంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇరు దేశాల తరఫున బ్రిటన్​ ప్రధాని కార్యాలయం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో భారత్​ను రెడ్​లిస్ట్​లో పెట్టామని బ్రిటన్​ ఆరోగ్య శాఖ మంత్రి మాట్​ హాన్​కాక్​ తెలిపారు. దీంతో భారత్​ నుంచి అన్ని రకాల ప్రయాణాలు నిషేధిస్తారు.
అసోసియేట్​ అటార్నీ జనరల్​గా వనితా గుప్తా
అమెరికా న్యాయ విభాగంలో మూడో అత్యున్నత పదవి అయిన​ అసోసియేట్​ అటార్నీ జనరల్​గా మానవ హక్కుల న్యాయవాది వనితా గుప్తా నియామకం ఖరారైంది. యూఎస్​ సెనేట్​ 51–49 ఓట్లతో ఆమె నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ పదవి అందుకున్న తొలి భారత సంతతికి చెందిన మహిళగా వనితా గుర్తింపు పొందారు.

ప్రాంతీయం

ఆదిమానవుడి ఆనవాళ్లు
వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గుట్టపై ఇళ్లారగుండు గుహలో ఆదిమానవుడు జీవించి ఉన్నట్లు ఆనవాళ్లను పురావస్తు చరిత్ర పరిశోధకుడు రత్నాకర్​ రెడ్డి బృందం కనుగొంది. ఈ గుట్ట కేంద్రంగా 10వేల ఏండ్ల క్రితం నుంచే శిలాయుగపు నాటి ఆదిమానవులు జీవించారని చెప్పారు. ఈ గుహలో రాతి గొడ్డలి, ధాన్యం నిలువచేసే గాబులు, రాతి పనిముట్లు లభించాయి.
సంగారెడ్డిలో గిరిజన లా కాలేజ్​
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల కోసం రెసిడెన్షియల్​ విధానంలో లా కాలేజ్​ ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ కాలేజ్​లో మొత్తం 60 సీట్లలో గిరిజన విద్యార్థులకు 39, దళితులకు 6, బీసీలకు 7, ఓసీలకు 2, ఎన్​సీసీ, స్పోర్ట్స్​ కోటాలో ఇద్దరికి చొప్పున అడ్మిషన్లు కల్పించనున్నారు.
తెలంగాణకు స్మార్ట్​ సిటీస్​ అవార్డులు
28వ కన్వర్జెన్స్​ ఇండియా–2021 అంతర్జాతీయ ఎగ్జిబిషన్​, 6వ స్మార్ట్​ సిటీస్​ ఇండియా ఎక్స్​పోలో తెలంగాణకు వివిధ కేటగిరిల్లో మూడు అవార్డులు లభించాయి. బేగంపేటలోని రెయిన్​ గార్డెన్​కు, న్యూ మున్సిపల్​ సాలిడ్​ వెస్ట్​ మేనేజ్​మెంట్​కు, వీ హబ్​కు ఈ పురస్కారాలు దక్కాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్​లో టాప్​
స్వచ్ఛ సర్వేక్షణ్​–2021 ర్యాంకులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన పౌర స్పందన ప్రక్రియ ఫలితాల్లో హైదరాబాద్​ వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్​ రెండోస్థానం, సూరత మూడో ప్లేస్​లో నిలిచాయి.
ఈ–గోల్కొండ పోర్టల్​ ప్రారంభం
చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ–గోల్కొండ పోర్టల్​ను మంత్రి కేటీఆర్​ తెలంగాణ భవన్​లో ప్రారంభించారు. తెలంగా హ్యాడీక్రాఫ్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ రూపొందించిన ఈ పోర్టల్​తో సంప్రదాయ కళాకృతులు, చేతిబొమ్మలు కొనవచ్చు. ఏ ప్రాంతానికైన ఈ పోర్టల్​ ద్వారా చేరవేసే వీలుంది.
బేస్​బాల్​ విజేత తెలంగాణ
నేషనల్​ బేస్​బాల్​ చాంపియన్​షిప్​ పురుషుల విభాగంలో తెలంగా విజేతగా నిలిచింది. కర్నూల్​ జిల్లా నంద్యాలలో జరిగిన ఫైనల్లో తెలంగాణ పురుషుల జట్టు 11–6 తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. మహిళల విభాగంలో కేరళ చాంపియన్​గా అవతరించింది. ఫైనల్లో 13–2 తేడాతో మహారాష్ట్రను ఓడించింది.
తెలంగాణలో బుద్ధుడి అరుదైన శిల్పం
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుద్ధుడి అరుదైన శిల్పాన్ని తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. బద్ధుడి సాల్వ వృక్షం కింద మహాపరినిర్వాణం చెందినట్లు తెలిపే శిల్పాన్ని గుర్తించారు. ఇలాంటి శిల్పం తెలంగాణలో వెలుగుచూడడం ఇదే మొదటిసారని బృందం ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్​ వెల్లడించారు.
ఈ–పంచాయతీ పురస్కారం
ఈ–పంచాయతీ విధానం అమల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి దయాకర్ రావు తెలిపారు. ఈ–అప్లికేషన్ల వినియోగంలో 2019–2020 ఏడాదికి ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. మూడు కేటగిరీల్లో పురస్కారాలు ప్రకటించగా రెండో కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
హరితహారానికి రూ.5.300 కోట్లు
గత ఆరేళ్లలో హరితహారం కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5,300 కోట్లు ఖర్చు చేసింది. ఆరు విడతల్లో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 210.83 కోట్ల మొక్కలు నాటారు. వచ్చే వర్షాకాలం ఏడో విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,926 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు.
స్వచ్ఛబడి ప్రారంభం
వ్యర్థాల నుంచి సంపద సృష్టితో పాటు ఆరోగ్య రక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు స్వచ్ఛ బడి కార్యక్రమం చేపట్టారు. ఉపయోగపడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్​రావు అన్నారు. సిద్ధిపేటలో రూ.50 లక్షలతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి బడిని ప్రారంభించారు.
కొత్త జోన్లకు ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్​ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 371డి లోని (1) (2) క్లాజ్​ల కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్​ ఎంప్లాయ్​మెంట్​ ఆర్డర్​–2018 ఆమోదించినట్లు కేంద్ర హోంశాఖ గెజిట్​ నోటిఫికేషన్​లో పేర్కొంది.
ఐఎస్​ఓకు ఎంపికైన ఇర్కోడ్​
సిద్దిపేట జిల్లాకు చెందిన ఇర్కోడ్‌ గ్రామం ఏటా ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతూ ఆదర్శంగా నిలుస్తోంది. పంచాయతీ పరిధిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సేవలందించినందుకు గాను ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌) గ్రామాన్ని ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్‌ఓకు ఎంపికైన మొదటి గ్రామంగా ఇర్కోడ్‌ నిలిచింది.
ఫోర్బ్స్​ జాబితాలో హైదరాబాదీలు
‘ఫోర్బ్స్​ 30 అండర్​ 30’ జాబితాలో ఇద్దరు యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మేకర్స్​ హైవ్​ ఇన్నోవేషన్స్​ సీఈవో ప్రణవ్​ వెంపటి, డిజి–ప్రెక్స్​ ఫౌండర్​ సమర్థ్​ సింధీ ఉన్నారు.

వార్తల్లో వ్యక్తులు

రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు.1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటివరకు తెలుగువారైన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎల్వీ ప్రసాద్‌, నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, బాలచందర్‌, కె. విశ్వనాథ్‌ ఈ పురస్కారం అందుకున్నారు.
ఆశాభోంస్లే
మహారాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్​’ కు ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఎంపికయ్యారు. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోని కమిటీ 2020కి గానూ ఈ పురస్కారాన్ని ఆశాభోంస్లేను సెలెక్ట్​ చేశారు. ఆమె సోదరి గాయని లతా మంగేష్కర్​కు 1996లోనే ఈ అవార్డ్​ అందుకున్నారు.
షాలినీ వారియర్​
సీఐఐ–ఇండియన్​ ఉమెన్​ నెట్​వర్క్​ (ఐడబ్ల్యూఎన్​) దక్షిణ ప్రాంత చైర్​పర్సన్​గా షాలినీ వారియర్​ ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్​పర్సన్​గా శోభా దీక్షిత్​ను ఎన్నుకున్నారు. ఏడాదికాలం పాటు ఇద్దరూ ఈ పదవుల్లో కొనసాగుతారు.
శరద్​ పగారే
హిందీ రచయిత, ప్రొఫెసర్​ శరద్​ పగారేకు వ్యాస్​ సమ్మాన్​ అవార్డ్​–2020 మార్చి 25న లభించింది. ఈయన రచించిన ‘పాలటీపుత్ర్ కీ సామ్రాజ్క్షి’ నవలకు ఈ అవార్డు దక్కింది. ఈ పురస్కారం కింద రూ.4 లక్షల నగదు అందజేస్తారు. 1991లో కేకే బిర్లా ఫౌండేషన్​ ఈ అవార్డును స్థాపించింది.
అతీష్​ చంద్ర
ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ) చైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా అతీష్​ చంద్ర నియమితులయ్యారు. ఆయన 1984 బీహార్​ ఐఏఎస్​ కేడర్​కు చెందినవారు. గతంలో వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ జాయింట్​ డైరెక్టర్​గా పనిచేశారు.
నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల సంఘం కొత్త కమిషనర్​గా నీలం సాహ్ని పేరును గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ ఖరారు చేశారు. ప్రస్తుత ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ మార్చి 31తో రిటైర్​ కానున్నారు. నీలం సాహ్ని సీఎం జగన్​కు ముఖ్య సలహాదారుగా పని చేశారు.
సాహితీ స్నిగ్ధ
తెలంగాణకు చెందిన సాహితీ స్నిగ్ధను స్వచ్ఛ సర్వేక్షణ్​లో ‘ రీసైక్లింగ్​ హీరోయిన్​’గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పురస్కారం అందజేసింది. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తూ సుమారు ఆరువేల మందికి అండగా నిలిచినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది. తెలంగాణ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తిగా స్నిగ్ధ రికార్డ్​ సాధించింది.
ఏప్రిల్​ 10
రాజేశ్వర్​ రావు
నీతిఆయోగ్​ ప్రత్యేక కార్యదర్శిగా నల్గొండ జిల్లాకు చెందిన ఐఏఎస్​ ఆఫీసర్​ కొలనుపాక రాజేశ్వర్​ రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నీతిఆయోగ్​లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 1988లో ఐఏఎస్​కు ఎంపికైన ఆయన కేంద్రం త్రిపుర రాష్ట్రానికి కేటాయించింది. మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ పథకాలకు రూ.24,500 కోట్ల సాయం కోసం సిఫార్సు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు.
కల్వకుంట్ల కవిత
స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ రాష్ట్ర చీఫ్​ కమిషనర్​గా ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్​లోని స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో కవిత విజయం సాధించినట్లు రిటర్నింగ్​ అధికారి వరలక్ష్మి వెల్లడించారు. 2015లో తొలిసారి చీఫ్​ కమిషనర్​గా ఎన్నికయ్యారు.
షబ్బీర్‌ హుస్సేన్‌
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌గా గుజరాత్‌ మాజీ డీజీపీ షబ్బీర్‌ హుస్సేన్‌ షెకాదమ్‌ను నియమించారు. అజిత్‌ సింగ్‌ స్థానంలో షబ్బీర్‌ బాధ్యతలు చేపడతారని బీసీసీఐ తెలిపింది. 2010లో రిటైర్‌ అయిన 70 ఏళ్ల షబ్బీర్‌ హుస్సేన్‌ పదేళ్ల పాటు ఎసార్‌ గ్రూప్‌లో సలహాదారుడిగా పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ లోక్‌పాల్‌ సెర్చ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
కేతు విశ్వనాథరెడ్డి
ప్రసిద్ధ అభ్యుదయ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని విమలాశాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్లు అవార్డు వ్యవస్థాపకుడు డా.శాంతినారాయణ తెలిపారు. రూ.50 వేల నగదుతో పాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు. తన సతీమణి విమల జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది ఒక సీనియర్‌ కథా, నవలా రచయితకు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పాడు. తొలి పురస్కారాన్ని విశ్వనాథరెడ్డికి ఇస్తున్నారు.
జీఆర్​ రాధిక
హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఐస్​లాండ్​ శిఖరాన్ని సీఐడీ ఎస్పీ జీఆర్​ రాధిక అధిరోహించారు. ఈ పర్వతం ఎత్తు 6,189 మీటర్లుగా ఉంది. పగళ్లు, భారీ గాలుల కారణంగా ఆమె 6,080 మీటర్ల వరకు చేరుకొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
బిశ్వభూషణ్​ హరిచందన్​
ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​కు ప్రతిష్టాత్మక కళింగరత్న పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు. ఒడిశాలోని కటక్​ నగరంలో ఆదికవి సరళదాస్​ 600వ జయంత్యుత్సవాన్ని ఏప్రిల్​ 2న నిర్వహించి ఈ సందర్భంగా పురస్కారం అందించారు.
సృష్టి జూపూడి
బ్రిక్స్​ చాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ ఇండస్ట్రీస్​ (సీసీఐ) అంతర్జాతీయ అంబాసిడర్​గా 2021–22కు గాను హైదరాబాద్​కు చెందిన బ్యాడ్మింటన్​ ప్లేయర్​ సృష్టి జూపూడి నియమితులయ్యారు. బ్రిక్స్​ సభ్య దేశాల్లో ఎంఎస్​ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, స్టార్టప్​ ల ఏర్పాటులో ఆమె కీలకపాత్ర పోషించనున్నారు.
రాజయోగిని దాది జానకి
బ్రహ్మకుమారీస్​ చీఫ్​ రాజయోగిని దాదీ జానకి స్మారక తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఆమె తొలి వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి భవన్​ స్మారక తపాలా బిళ్ల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు సమాజంలో సమాన హోదా కల్పించడం, సామాజిక వివక్షలను రూపుమాపడంలో బ్రహ్మకుమారీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. దాదీ జానకి ప్రభావవంతమైన ఆధ్యాత్మిక గురువుగా గౌరవాన్ని పొందారని కొనియాడారు.
సముద్రాల శ్రీధర్​
అమెరికా డెలావర్​ కౌంటిలోని డెల్​హై మేయర్​గా ప్రవాస భారతీయుడు సముద్రాల శ్రీధర్​ ఎన్నికయ్యారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేసి మేయర్​గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన చిత్తూరు జిల్లా బీఎన్​ కండ్రిగ గ్రామానికి చెందినవారు.
ప్రిన్స్ ఫిలిప్
బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌–2 భర్త, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌(99) ఏప్రిల్‌ 9న మరణించాడు. గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్‌.. యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులుకున్నారు. ప్రిన్స్‌ ఫిలిప్‌ గొప్ప సాహసి. బ్రిటన్‌ నేవీ కమాండర్‌గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు.
భరత్‌ పన్నూ
భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ భరత్‌ పన్నూ రెండు కొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను తిరగరాశారు. 2020, అక్టోబర్‌లో అత్యంత వేగంగా ఒంటరిగా సైకిల్‌ తొక్కి కొత్త రికార్డు సృష్టించారని గిన్నిస్‌ అధికారులు ధ్రువీకరించారు. లేహ్‌ నుంచి మనాలి వరకు 472 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్‌ తొక్కి రికార్డును నెలకొల్పారు. ‘స్వర్ణచతుర్భుజి’రహదారిగా పేరొందిన రోడ్డు మార్గాన్ని 14 రోజుల 23 గంటల, 52 సెకన్లలో సైకిల్‌పై పూర్తిచేసి మరో కొత్త గిన్నిస్‌ రికార్డు బద్దలుకొట్టారు.
బీపీ ఆచార్య
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య నియమితులయ్యారు. హైదరాబాద్‌ సమీపం షామీర్‌పేట్‌లో ఉన్న జీనోమ్‌ వ్యాలీలో 100 ఎకరాల్లో బయో మెడికల్‌ రీసెర్చ్‌ కోసం ఏర్పాటు చేయబోతున్న ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ’కి ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు.
రాకేశ్వర్‌ సింగ్‌
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ అడవుల్లో తమ వద్ద బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ (కోబ్రా) జవాను రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాన్‌ను మావోయిస్టులు ఏప్రిల్‌ 8న విడుదల చేశారు. బీజాపూర్‌ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు. ఇదే క్రమంలో కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్‌ సింగ్‌ను తమ బందీగా పట్టుకున్నారు.
ప్రజ్ఞానంద
పోల్గార్‌ చాలెంజ్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద చాంపియన్‌గా నిలిచాడు. 20 మంది క్రీడాకారుల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద మొత్తం 15.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో రూ.2.24 లక్షల ఫ్రైజ్​మనీ సొంతం చేసుకున్నాడు.
మాధురి
ఇటలీలోని మిలాన్​లో జరుగుతున్న రొమాంటికా అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనకు అమెరికాలోని ఎన్​ఆర్​ఐ ఆర్టిస్ట్​ మాధురికి ఆహ్వానం అందింది. ఈ ప్రదర్శనలో పాల్గొననున్న ఏకైక భారతీయ చిత్రకారిణిగా ఆమె గుర్తింపు పొందారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మాధురి ప్రస్తుతం అమెరికాలోని నార్త్​ కరోలినా రాష్ట్రం ‘కేరీటౌన్​లో ట్రూయిస్ట్​ బ్యాంక్​’ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
భూమిధర్‌ బర్మన్‌
అస్సాం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్‌ బర్మన్‌ అనారోగ్యంతో మరణించారు. గువాహటిలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 18న కన్నుమూశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన భూమిధర్‌ బర్మన్‌ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా సేవలందించారు.
చార్లెస్‌ చక్‌ గీస్కీ
పోర్టబుల్‌ డాక్యుమెంట్‌ ఫార్మాట్‌ (పీడీఎఫ్‌) సహరూపకర్త చార్లెస్‌ చక్‌ గీస్కీ చనిపోయారు. ఏప్రిల్‌ 16న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్‌ అట్లాస్‌లో తుదిశ్వాస విడిచారు. జాన్‌ వార్నోక్‌తో కలిసి అడోబ్‌ ఇన్‌కార్పొరేషన్‌ను చార్లెస్‌ స్థాపించారు. అడోబ్‌ ఇన్‌కార్పొరేషన్‌ తెచ్చిన సాఫ్ట్‌వేర్లలో పీడీఎఫ్‌ ముఖ్యమైంది.
మైదవోలు నరసింహం
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ మైదవోలు నరసింహం (94) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 20న తుదిశ్వాస విడిచారు. నరసింహం భారతీయ రిజర్వు బ్యాంకుకు 13వ గవర్నర్‌గా ఏడునెలల పాటు పనిచేశారు. భారతీయ బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలకు పితామహుడిగాఆయన గుర్తింపు పొందారు.
ఇద్రిస్‌ దెబీ ఇత్నో
మధ్య ఆఫ్రికా దేశం చాద్‌ను మూడు దశబ్దాల పాటు పరిపాలించిన అధ్యక్షుడు ఇద్రిస్‌ దెబీ ఇత్నో(68) హత్యకు గురయ్యాడని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. తిరుగుబాటుదారుల పోరులో ఆయన మరణించినట్లు తెలిపింది. 1990లో అధికారంలోకి వచ్చిన ఇద్రిస్​ ఏప్రిల్‌ 11న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురయ్యారు.
సౌమ్యా స్వామినాథన్​
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్​ మరో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. కరోనా మహమ్మారులపై పోరాటానికి బ్రిటన్​ ఏర్పాటు చేసిన 20 మంది నిపుణుల బృందంలో ఆమెకు స్థానం దక్కింది. పాండమిక్​ ప్రిపేర్డ్​నెస్​ పార్ట్​నర్​షిప్​ (పీపీపీ) పేరుతో ఈ బృందం ఏర్పాటు చేశారు.
డాక్టర్​ కృష్ణ ఎల్ల
కొవిడ్​–19 మహమ్మారి ముప్పును ఎదుర్కోవడంలో ప్రముఖపాత్ర పోషిస్తున్న వైద్య, ఆరోగ్య రంగాలకు చెందిన నిపుణులతో ఫోర్బ్స్​ ఇండియా ప్రత్యేకంగా ‘లీడర్స్​ ఇన్​ హెల్త్​కేర్​’ రూపొందించింది. ఈ జాబితాలో భారత్​ బయోటెక్​ ఇంటర్నేషనల్​ సీఎండీ డాక్టర్​ కృష్ణ ఎల్ల స్థానం సంపాదించారు. ఆయనపై కవర్​పేజీ ఆర్టికల్​ ప్రచురించింది.

Advertisement

సైన్స్​ & టెక్నాలజీ

ప్రపంచంలోనే అతిపెద్ద సబ్​మెరైన్​
హులుడావోలోని బోహైడ్​ షిప్​యార్డ్​లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సబ్​మెరైన్​ ప్రారంభించింది. దాదాపు 210 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. దీన్ని టైప్​–100 ‘సున్​ జూ’ శ్రేణి సబ్​మెరైన్​గా చెప్తున్నారు. రష్యా వద్ద ఉన్న అతిపెద్ద పీఆర్​.941 టైపూన్​ శ్రేణి (175 మీటర్లు) కంటే ఇది పెద్దది.
బ్యాక్టీరియాకు అజ్మల్​ఖాన్​ పేరు
అంతరిక్షం నుంచి సేకరించిన నమూనాల్లో మిథైలో బ్యాక్టీరియం ఇండికం రకానికి చెందిన బ్యాక్టీరియాకు ప్రముఖ భారత శాస్త్రవేత్త అజ్మల్​ఖాన్​ పేరుతో మిథైలక్ష బ్యాక్టీరియం అజ్మల్లీగా పేరు పెట్టారు. జన్యుక్రమాలను పరిశీలించిన తర్వాత మొక్కల ఎదుగుదలను ప్రోత్సహించే జన్యువులు కొత్తరకం బ్యాక్టీరియాలో ఉన్నట్లు తేల్చారు.
పాక్​ మిస్సైల్​ ప్రయోగం
అణ్వస్త్ర సామర్థ్యమున్న షాహీన్​–1ఎ మిస్సైల్​ను పాకిస్థాన్​ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 900 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఉపరితలం నుంచి ఉపరితలం పై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది.ఈ ఆయుధంలోని డిజైన్​, సాంకేతిక అంశాలు మదింపు చేయడానికి ఈ పరీక్ష చేసినట్లు పాక్​ సైన్యం తెలిపింది.
ఏప్రిల్​ 10
యుద్ధనౌకలను రక్షించే ‘చాఫ్​’
శత్రు దేశాల మిస్సైల్స్​ దాడుల నుంచి నౌకాదళం ఓడలను రక్షించే అధునాతన చాఫ్​ టెక్నాలజీని డీఆర్​డీవో అభివృద్ధి చేసింది. క్షిపణ/లను దారి మళ్లించడమే కాకుండా భవిష్యత్​లో జరిగే దాడులను పసిగట్టే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు డీఆర్​డీవో తెలిపింది. ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించామని ఒక ప్రకటనలో వెల్లడించింది.
‘లా పెరోస్​’ విన్యాసాలు
హిందూ మహాసముద్రంలో ‘లా పెరోస్‌’ పేరుతో ఫ్రెంచ్‌ నేవీ విన్యాసాలు చేసింది. ఈ ప్రదర్శనలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్‌ నావికాదళాలు పాల్గొన్నాయి. భారత నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌ యుద్ధ నౌకలు, పి81 లాంగ్‌రేంజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ విన్యాసాలు చేశాయి. వాయు, ఉపరితల యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వినియోగం, ఎయిర్‌ డిఫెన్స్, వ్యూహాత్మక విషయాలకు ‘లా పెరోస్‌’ కేంద్రంగా మారింది.
సూపర్​నోవాపై రీసెర్చ్​
విశ్వంలోని అరుదైన సూపర్​నోవా గురించి భారత ఖగోళ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. అది అత్యంత వేడిగా ఉండే ‘వుల్ఫ్​ రేయట్​’ తారకు సంబంధించినదని కనుగొన్నారు. సూపర్​నోవాలు అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాలు. వీటి నుంచి భారీగా శక్తి వెలువడుతుంది.
ఏప్రిల్​ 17
అంతరిక్షంలోకి గల్ఫ్​ మహిళ
అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి గల్ఫ్‌ దేశంగా రికార్డు సృష్టించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు యూఏఈ ప్రధాని షేక్‌ మొహ్మమద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ తెలిపారు. నౌరా అల్‌ మత్రౌషి, మొహమ్మద్‌ అల్‌–ముల్లాను స్పేస్​లోకి పంపేందుకు ఎంపిక చేసినట్లు చెప్పాడు.
ముగ్గురు వ్యోమగాములతో ‘సోయజ్​’
రష్యా వ్యోమనౌక సోయజ్​ ఎంఎస్​–18 ముగ్గురు వ్యోమగాములతో నింగిలోకి పయనమైంది. ఈ వ్యోమనౌక భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్​ఎస్​) చేరుకుంటుంది. కజకిస్థాన్​లోని బైకనూర్​ అంతరిక్ష కేంద్రం నుంచి సోయజ్​ ప్రయోగాన్ని చేపట్టారు.
ఏప్రిల్​ 24
అంగారకుడిపై హెలికాప్టర్​
అంగారకుడిపై తొలిసారిగా ‘ఇన్​జెన్యుటీ’ హెలికాప్టర్​ గగనయానం చేసింది. 1.8 కిలోల బరువు ఉంటే దీన్ని నాసా రూపొందించింది. అంగారకుడిపై జీవం ఆనవాళ్లను పసిగట్టే లక్ష్యంతో పంపిన ‘పర్సెవరెన్స్​’ రోవర్​లో భాగంగా దీన్ని ప్రయోగించింది. తొలి ప్రయత్నంలో ఇన్​జెన్యుటి 39 సెకండ్ల పాటు గాల్లో విహరించి సేఫ్​గా ల్యాండ్​ అయింది.
గగన్​యాన్​కు ఫ్రాన్స్​ సహకారం
ఇస్రో తొలి మానవ సహిత ప్రయోగం (గగన్‌యాన్‌ మిషన్‌) కు ఫ్రాన్స్‌ సహకారం అందించనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఫ్రాన్స్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్‌ఈఎస్‌) అగ్రిమెంట్​చేసుకున్నాయి. ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ మంత్రి జీన్‌ యువేస్‌ లీ డ్రయాన్‌ ఏప్రిల్‌ 15న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ ఒప్పందం చేసుకున్నారు.
రష్యా సొంత స్పేష్​ స్టేషన్​
ర‌ష్యా సొంతంగా స్పేస్ స్టేష‌న్‌ నిర్మించుకోవాలని ప్లాన్​ చేస్తోంది. 2025లో దీనిని లాంచ్ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు ర‌ష్యా స్పేస్ ఏజెన్సీ రాస్‌కాస్మోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ తెలిపారు. కొత్త స్పేస్‌స్టేషన్ తొలి మాడ్యూల్ ప‌ని మొద‌లైన‌ట్లు చెప్పారు. సొంతంగా స్పేస్ స్టేష‌న్ లాంచ్ చేసిన త‌ర్వాత ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ నుంచి ర‌ష్యా వైదొలిగే అవ‌కాశాలు ఉన్నాయి.

స్పోర్ట్స్​

షూటింగ్​లో భారత్​ టాప్
ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​ షూటింగ్​లో 15 గోల్డ్​ మెడల్స్, 9 సిల్వర్​, 6 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 మెడల్స్​తో భారత్​ టాప్​లో నిలిచింది. తర్వాత స్థానాల్లో అమెరికా (8), ఇటలీ (4) నిలిచాయి. చివరిరోజు పోటీల్లో భారత్​ 2 గోల్డ్​ మెడల్స్​ దక్కించుకుంది. ​
హామిల్టన్​దే బహ్రెయిన్​
గత ఫార్ములావన్​ సీజన్లో సత్తా చాటిన ప్రపంచ నంబర్​వన్​ లూయిస్​ హామిల్టన్​ (మెర్సిడెజ్​) ఈ సీజన్​ను ఘనంగా ప్రారంభించాడు. బహ్రెయిన్​ గ్రాండ్​ప్రిలో చాంపియన్​గా నిలిచాడు. ఫైనల్లో 56 ల్యాప్​లలో 25 పాయింట్లు సాధించిన అతడు మాక్స్​ వెర్​స్టాపెన్​ (రెడ్​బుల్​)ను వెనక్కి నెట్టాడు.
పెరీరా 6 బంతుల్లో 6 సిక్సర్లు
శ్రీలంక ఆల్​రౌండర్​ తిసార పెరీరా దేశవాళీ మ్యాచ్​లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి రికార్డ్​ సృష్టించాడు. శ్రీలంక ఆర్మీ జట్టుకు కెప్టెన్​గా ఉన్న పెరీరా బ్లూమ్​ఫీల్డ్​ టీమ్ స్పిన్నర్​ దిల్హాన్​ కూరె బౌలింగ్​లో ఈ ఘనత సాధించాడు. గతంలో 8 మంది ఈ రికార్డ్​ క్రియేట్​ చేశారు.
మయామి చాంపియన్​ హుర్కాజ్​
టెన్నిస్​ మయామి ఓపెన్​ మాస్టర్స్​ సిరీస్​ టోర్నీలో పోలాండ్​ ప్లేయర్​ హుబర్ట్​ హుర్కాజ్​ విజేతగా నిలిచాడు. ఫైనల్లో హుర్కాజ్​ 7–6 (7/4), 6–4 తేడాతో ఇటలీకి చెందిన జానిక్​ సినెర్​ పై గెలిచాడు. హుర్కాజ్​కు ఇదే తొలి మాస్టర్స్​ సిరీస్​ టైటిల్​. ఈ విజయంతో హుర్కాజ్​ 37వ ర్యాంక్​ నుంచి 16వ ర్యాంక్​ కు చేరుకున్నాడు. రూ.2 కోట్ల 22 లక్షలతో పాటు 1000 ర్యాంకింగ్​ పాయింట్లు లభించాయి.
అండర్​–18 టెన్నిస్​ చాంప్​ సంజన
జాతీయ అండర్​–18 టెన్నిస్​ చాంపియన్​షిప్​లో తెలంగాణకు చెందిన సంజన సిరిమల్ల విజేతగా నిలిచి జాతీయ చాంపియన్​గా నిలిచింది. బాలికల సింగిల్స్​ ఫైనల్లో సంజన 6–1, 6–3 తో సుహిత (కర్నాటక)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్​లో 7–5, 6–1తో లక్ష్మి ప్రభ (తమిళనాడు) పై నెగ్గింది.
వరల్డ్​ అథ్లెటిక్స్​కు హిమదాస్​, ద్యుతిచంద్​
పోలెండ్​ వేదికగా మే 1, 2 తేదీల్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్​లో పాల్గొనే భారత మహిళల 4 x100 మీటర్ల రిలే జట్టులో స్టార్​ అథ్లెట్లు హిమదాస్​, ద్యుతిచంద్​కు స్థానం దొరికింది. మార్చిలో జరిగిన ఫెడరేషన్​ కప్​లో 100 మీ. పరుగు ఫైనల్లో ద్యుతీని ఓడించిన ధనలక్ష్మితో పాటు అర్చన సుశీంద్రన్​, హిమశ్రీ రాయ్​, ఏటీ ధనేశ్వరీ ఈ జట్టులో ఉన్నారు.
విజ్డెన్​ దశాబ్దపు క్రికెటర్​గా కోహ్లి
టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లి విజ్డెన్​ దశాబ్దపు (2010–2020) క్రికెటర్​గా ఎంపికయ్యాడు. తొలి అంతర్జాతీయ వన్డేకు 50 ఏండ్లు అయిన నేపథ్యంలో 1971 నుంచి 2021 వరకు ఐదుగురు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఇప్పటివరకు వివ్​ రిచర్డ్స్​, కపిల్​దేవ్​, సచిన్​, మురళీధరన్​కు ఈ అవార్డు దక్కింది.
భువికి ఐసీసీ అవార్డ్​
ఏప్రిల్​ నెల ఐసీసీ ఉత్తమ క్రికెటర్​ అవార్డును భారత పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ దక్కించుకున్నాడు. మార్చిలో ఇంగ్లాడ్​తో జరిగిన టీ20 సిరీస్​లో సత్తా చాటిన భువి ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఈ అవార్డు ప్రవేశపెట్టాక ఈ పురస్కారాన్ని అందుకున్న మూడో ఆటగాడతను. భువికి ముందు పంత్​, అశ్విన్​ ఈ అవార్డులను అందుకున్నారు.
మత్సుయామకు ‘మాస్టర్స్​’ టైటిల్‌
ప్రపంచ గోల్ఫ్‌ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ‘మాస్టర్స్‌’ ఈవెంట్‌లో తొలిసారి ఆసియా ప్లేయర్‌ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఈ టోర్నీలో జపాన్‌ గోల్ఫర్ హిడెకి మత్సుయామ టైటిల్‌ సాధించాడు. నిర్ణీత‌ నాలుగు రౌండ్‌ల తర్వాత మత్సుయామ 278 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
రొమాగ్నా విన్నర్​ వెర్​స్టాపెన్​
రొమాగ్నా గ్రాండ్​ప్రి పోటీలో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ చాంపియన్​గా నిలిచాడు. ఇటలీలోని ఇమోలాలో జరిగిన రేసులో వెర్‌స్టాపెన్ విజేతగా అవతరించాడు. తాజా సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది తొలి విజయం. హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు.
మీరాబాయి వరల్డ్​ రికార్డ్​
ఆసియా సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్‌ సైఖోమ్‌ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు మెడల్స్​ సాధించింది. తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగంలో స్వర్ణం, ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ ఈవెంట్‌లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
68వ గ్రాండ్​ మాస్టర్​గా అర్జున్​
యువ చెస్​ ఆటగాడు అర్జున్​ కల్యాణ్​ భారత 68వ గ్రాండ్​ మాస్టర్​గా రికార్డులకెక్కాడు. సెర్బియాలో జరుగుతున్న రుజ్నా జోరా–3 జీఎం రౌండ్​ రాబిన్​ లీగ్​ అయిదో రౌండ్లో డ్రాగన్​ కోసిక్​పై విజయం సాధించడంతో ఈ టోర్నీలో 2500 ఎలో రేటింగ్​ అధిగమించాడు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!