కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాస్తున్న అభ్యర్థులకు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక కీలక అప్డేట్ అందించింది. ఇప్పటికే ఈ పరీక్ష కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్లలోని తప్పులను సరిదిద్దుకునేందుకు ‘అప్లికేషన్ కరెక్షన్ విండో’ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించినట్లు బోర్డు స్పష్టం చేసింది. అప్లికేషన్ మార్పులు చేసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అభ్యర్థులు తమ వివరాలను మార్చుకోవడానికి సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్లో అవకాశం కల్పించారు. ఈ గడువు ముగిసిన తర్వాత.. ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్లికేషన్లు మార్పులు చేయడానికి అభ్యర్థులకు అవకాశం ఉండదు.
ఏయే వివరాలు మార్చుకోవచ్చు?
అప్లై చేసుకునే సమయంలో పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం, అడ్రస్ లేదా సబ్జెక్టుల ఎంపిక వంటి అంశాలలో.. ఏవైనా తప్పులు ఉంటే.. ఈ కరెక్షన్ విండో ద్వారా సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ctet.nic.in ని తమ లాగిన్ వివరాల ద్వారా ఎడిట్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఫీజు వివరాలు:
ఈ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్‌కు సంబంధించి సీబీఎస్ఈ ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. కేవలం అభ్యర్థులు తమ వివరాలను తప్పుల్లేకుండా.. సరిగ్గా ఎంటర్ చేసుకోవడం ముఖ్యం.
ఇదిలా ఉంటే.. సీబీఎస్ఈ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ రెండు విడతల్లో విజయవంతంగా పూర్తయింది.
మొదటి విడత మే 11 నుంచి జూన్ 10 వరకు స్వీకరించారు. కాగా అభ్యర్థుల సౌలభ్యం కోసం రెండో విడతలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు అప్లికేషన్లు మరోసారి రీ-ఓపెన్ చేయడం జరిగింది.
అయితే.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ పరీక్షకు సంబంధించిన కొత్త పరీక్ష తేదీలను సీబీఎస్ఈ త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రకటించనుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





