ఈ నెల 28న జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు మరో వారం రోజులే మిగిలింది. ఇప్పటికిప్పుడు హడవుడి పడకుండా అభ్యర్థులు ఇప్పటివరకు చదివిన వాటిలో ముఖ్యమైనవి రివిజన్ చేసుకోవాలి. వేటిపై ఎక్కువ ఫోకస్ చేయాలి.. ఏమేం చదవాలి.. క్విక్ రివిజన్ టిప్స్.. టాపిక్స్..
అభ్యర్థులందరూ ఆగస్టు 7న జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్‌ఐ పరీక్షలో చాలామంది అభ్యర్థులు కొత్త ప్రశ్నలను చూసి అయోమయానికి గురయ్యారు. ఎస్ఐ ప్రిలిమ్స్ టఫ్‌గా వచ్చిందని చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. కానీ పక్కాగా సిలబస్ కు అనుగుణంగా TSLPRB పేపర్ తయారు చేయించిందనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి.
అందుకే కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో సిలబస్ ప్రకారం పేపర్ ఇచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనువుగా పరీక్షకు సిద్ధం కావాలి. ఎగ్జామ్ హాల్లో టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం.
పరీక్షకు 24 గంటల ముందు నుంచి పుస్తకం ముట్టుకోకుండా ఉండడం మంచిది. రివిజన్ చేద్దాం అని, టైమ్‌వేస్ట్ అవుతుందని చివరి నిమిషం వరకు పుస్తకాలతో కుస్తీ పడితే స్ట్రెస్‌కు గురై చదివింది మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే క్విక్ రివిజన్ చేయండి.
ఎస్ఐ పరీక్షలో జనరల్ స్టడీస్ విషయంలో చేసిన పొరపాట్లు కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అభ్యర్థులు కేవలం అర్థమెటిక్, రీజనింగ్ అంశాలపై ఫోకస్ చేసి కరెంట్ ఎఫైర్స్, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు నిర్లక్ష్యం చేస్తే చివరకు క్వాలిఫై మార్కులు సాధించలేకపోవచ్చు. కానిస్టేబుల్, ఎస్ఐ సిలబస్‌లో కొన్ని సబ్జెక్టులలో తేడా ఉంటుంది. దాన్ని గమనించి సిద్ధమవ్వాలి. రెండు యూనిఫామ్ ఉద్యోగాలే అయినా సిలబస్‌లోని తేడాను గమనిస్తూ ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి.