గ్రూప్స్ జాబ్స్‌కు కామన్ ప్రిపరేషన్
టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే గ్రూప్1 తో పాటు గ్రూప్ 2, 3 ఉద్యోగాలకు సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షలో ఉంటే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులోని సిలబస్ గ్రూప్ 2,3 లో కూడా ఉంటుంది. అందుకే కామన్ ప్రిపరేషన్‌తో ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే మూడింటిలో విజయం సాధించవచ్చు.
గ్రూప్ 2, 3 సిలబస్ సేమ్
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2, 3 సిలబస్ దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. దీన్ని ఉద్యోగార్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ..అభ్యసనం సాగిస్తే ఒకే సమయంలో రెండు సర్వీసులకు సన్నద్ధత పొందొచ్చు. గ్రూప్-2ను నాలుగు పేపర్లుగా, గ్రూప్-3ను మూడు పేపర్లుగా నిర్వహించనున్నారు. గ్రూప్-2లో మాత్రం నాలుగో పేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనే అంశాలతో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ అంశాలను గ్రూప్-3లోని పేపర్-2, పేపర్-3 అంశాలతో సమ్మిళితం చేసుకునే అవకాశం ఉంది.
సమన్వయం చేసుకోవాలి
గ్రూప్-2, 3 అభ్యర్థులు రెండు సర్వీసులకు సంబంధించిన సిలబస్‌ను ముందుగా బేరీజు వేసుకోవాలి. రెండు పరీక్షల్లో పేర్కొన్న పేపర్లు, సబ్జెక్ట్‌లు, సిలబస్ అంశాలపై పూర్తి స్పష్టత తెచ్చుకోవాలి. ఒకే తరహాలో ఉన్న అంశాలను ఒకే సమయంలో చదివేలా.. వేర్వేరుగా ఉన్న అంశాలకు నిర్దిష్టంగా ప్రత్యేక సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండింటిలోనూ ఒకే సిలబస్ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది నిపుణుల అభిప్రాయం.
పుస్తకాల ఎంపిక
గ్రూప్-2, 3 అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్‌పై స్పష్టత తెచ్చుకున్న తర్వాత పుస్తకాల ఎంపికపై దృష్టిపెట్టాలి. పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలన్నీ ఉన్న పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించి మార్కెట్లో పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి గందరగోళ పడకుండా ఏవైనా ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. అకాడమీ పుస్తకాలను చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
డిస్క్రిప్టివ్ అప్రోచ్
ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకున్న అభ్యర్థులు వాటిని క్షుణ్నంగా చదివేలా వ్యవహరించాలి. ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాలకు వరకూ సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. గ్రూప్-2,3 రెండు పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో,బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. కాని అభ్యర్థులు ప్రిపరేషన్‌లో మాత్రం డిస్క్రిప్టివ్ విధానం అనుసరించాలి. చదువుతూ ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకునేలా నోట్స్ రాసుకోవాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా సమయ పాలన పాటించాలి.
కామన్
గ్రూప్-2, 3 ప్రిపరేషన్‌లో అభ్యర్థులు అనుసంధాన దృక్పథం అనుసరించాలి. అంటే..రెండు పరీక్షల్లోని సిలబస్‌లో కామన్‌గా ఉన్న అంశాలను సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; భారత రాజ్యాంగం విధానం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ..ఇలా కామన్ అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది.
జాతీయం నుంచి స్థానికం వరకు
గ్రూప్-2, 3 అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో జాతీయ అంశాలు మొదలు స్థానిక అంశాల వరకూ అన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాలను ఔపోసన పట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి దశ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.
సొంత నోట్స్
చదువుతున్నప్పుడే ముఖ్యమైన అంశాలను పాయింట్ల వారీగా సొంతంగా నోట్స్‌లో రాసుకోవాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనం, ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
ప్రభుత్వ విధానాలు
జాతీయ, రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు; వాటి పరిష్కారానికి ప్రభుత్వాల విధానాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. మహిళా సాధికారత కోసం జాతీయస్థాయిలో పలు పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు రూపొందిస్తున్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు నూతన పాలసీలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు నూతన విద్యా విధానం ముఖ్యంశాలతోపాటు ఇప్పటి వరకు తీసుకొచ్చిన విద్యా విధానాలు, ప్రస్తుత విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసం, ఉద్దేశం, ప్రధానాంశాలు, లక్ష్యాలు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.