దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ సహా పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (సీయూసెట్) నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. ఆ పరీక్ష ర్యాంకుల ఆధారంగానే తెలుగు రాష్ట్రాల్లోని హెచ్‌సీయూ, ఇఫ్లూ, ఉర్దూ, అనంతపురంలోని ఏపీ వర్సిటీ సహా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఆయా సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లోని వర్సిటీలతో పాటు అనంతపురంలోని కేంద్రీయ వర్సిటీ కలిపి మొత్తం 12 విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్కో వర్సిటీ విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నది కేంద్రం భావన. ఈ క్రమంలోనే అన్ని వర్సిటీలకు కలిపి పరీక్ష జరపాలని కొన్నేళ్లుగా ఆలోచిస్తోంది. వాస్తవానికి ప్రస్తుత విద్యా సంవత్సరానికే జరపాలని నిర్ణయించినా కరోనా పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విద్యాశాఖ, జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ఆయా వర్సిటీలతో చర్చించి కోర్సులు తదితర వివరాలను తెప్పించుకుంది. సీయూసెట్‌ను జూన్ లేదా జులైలో నిర్వహించాలని భావిస్తున్న ఎన్‌టీఏ ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) పరీక్షను జరపనున్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యత ఎన్‌టీఏకి అప్పగించారు. ఈసారి ఇంగ్లిష్తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, ఒడియా, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ తదితర మొత్తం 13 భాషల్లో పరీక్ష జరుపుతారు.
కామన్ సిలబస్
సీయూసెట్‌లో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నపత్రాలతోపాటు ఆంగ్లం, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ తదితర వాటిని పరీక్షించేలా కామన్ ఆప్టిట్యూడ్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రశ్నపత్రం ఉంటుంది. 50 ప్రశ్నలు ఉంటాయని, 60 నిమిషాలు సమయం ఉండొచ్చని తెలుస్తోంది. ఇక సబ్జెక్టు ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు…120 నిమిషాల సమయం ఇస్తారని సమాచారం. నెగెటివ్ మార్కులు ఉంటాయి. పరీక్షల్లో కామన్ సిలబస్ ఉండేలా ఎన్‌టీఏ కసరత్తు చేస్తోంది.