7.56 లక్షల గ్రూప్-సీ పోస్టులు.. 21,255 గ్రూప్–ఏ పోస్టులు
నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పోస్టుల సంఖ్యపై క్లారిటీ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో 2020 మార్చి 1 నాటికి 7,56,146 గ్రూప్-సీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో తెలిపారు. ఫిబ్రవరి 3న రాజ్యసభలో సీపీఎం సభ్యుడు వి.సదాశివన్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఇవి కాకుండా గ్రూప్-ఎ పోస్టులు 21,255 ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 6వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు గ్రూప్-డి పోస్టులన్నింటినీ ‘గ్రూప్-సి’కి అప్‌గ్రేడ్ చేసినందున ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్-డి ఉద్యోగాలనేవి లేవన్నారు. ఖాళీల భర్తీ అన్నది నిరంతర ప్రక్రియ అని, అన్ని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తూనే వస్తోందని చెప్పారు. చివరిసారిగా గతేడాది జూన్ 3న కూడా అలాంటి సూచనలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
రైల్వేలో 2,65,547 పోస్టులు
రైల్వేలో కూడా ఖాళీలు భారీగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 2,65,547 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఫిబ్రవరి 4న రాజ్యసభలో సీపీఎం సభ్యుడు వి.సదాశివన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. గత అయిదేళ్లలో గ్రూప్-సి పోస్టులు 1,13,662, గ్రూస్-సి లెవెల్-1 పోస్టులు 76,128 కలిపి మొత్తం 1,89,790 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు నియామక సంస్థలకు ఇండెంటు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 2,177 గెజిటెడ్ పోస్టులు, 2,63,370 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే దక్షిణమధ్య రైల్వేలో 43 గెజిటెడ్, 16,741 నాన్ గెజిటెడ్ పోస్టులు కలిపి 16,784 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.