సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా.. ఉన్న 4,500 కంటే ఎక్కువ బ్రాంచ్‌లలో ఒక సంవత్సరం శిక్షణ కోసం అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 22 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు మొదట NATS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని.. ఆ తర్వాత BEEP పోర్టల్ ద్వారా తమ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026:
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 586, ఉత్తరప్రదేశ్‌లో 580 పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో 128, తెలంగాణలో 100 ఖాళీలు కేటాయించారు. ఈ అప్రెంటిస్ షిప్‌కు ఎంపికైన.. అభ్యర్థులకు ఏడాది పాటు నెలకు రూ.15 వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇది కేవలం ట్రైనింగ్ మాత్రమే కాబట్టి ఎలాంటి ఇతర అలవెన్సులు లేదా ఉద్యోగ ప్రయోజనాలు వర్తించవు.
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అయితే.. అభ్యర్థులు తమ డిగ్రీని జనవరి 1, 2022 లేదా ఆ తర్వాత పూర్తి చేసి ఉండాలి. జూన్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ రిక్రూట్‌మెంట్ లోని ప్రత్యేకత ఏంటంటే.. దీనికి నిర్వహించే.. ఆన్‌లైన్ రాత పరీక్షను అభ్యర్థులు ఎక్కడికో వెళ్లకుండా తమ సొంత మొబైల్ లేదా లాప్‌టాప్ ద్వారా.. ఇంటి నుంచే రాసుకోవచ్చు. ఈ పరీక్షలో.. జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ & రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, సెంట్రల్ బ్యాంక్ ప్రొడక్ట్స్ పై మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు.
రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. పదో తరగతి లేదా ఇంటర్ లో స్థానిక భాష చదివిన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్లు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పురుషులకు ఫీజు రూ. 944 (GSTతో కలిపి), మహిళలకు రూ.708, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 236 గా నిర్ణయించారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: ఆన్‌లైన్ అప్లికేషన్ జూన్ 12 నుంచి ప్రారంభమయ్యాయి. జూన్ 22 లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.





