సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్ పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు బోర్డు తీపి కబురు అందించింది. వాస్తవానికి డిసెంబర్ 18తో అప్లికేషన్ గడువు ముగిసినప్పటికీ.. వెబ్‌సైట్ సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు బోర్డు సానుకూలంగా స్పందించింది. అసంపూర్తిగా ఉన్న అప్లికేషన్లను పూర్తి చేయడానికి ‘వన్ టైమ్ ఫెసిలిటీ’ కింద ప్రత్యేక విండోను తెరవాలని అధికారులు నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ ప్రత్యేక అవకాశం డిసెంబర్ 27 ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 30 రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే.. ఇది కేవలం గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి.. వివిధ కారణాల వల్ల సబ్మిట్ చేయలేకపోయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా అప్లై చేసుకునేందుకు ఎలాంటి అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఈ సమయంలో చేసే అప్లికేషన్లకు మరో సారి ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
భారీగా అప్లికేషన్లు:
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 18 వరకు దాదాపు 25 లక్షల మందికి పైగా అభ్యర్థులు సీటెట్ కోసం అప్లై చేసుకున్నారు. ముఖ్యంగా చివరి రోజుల్లో లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నించడం వల్ల సర్వర్లపై ఒత్తిడి పెరిగి కొందరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా ‘వన్ టైమ్ ఫెసిలిటీ’ అనే ఈ కొత్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభ్యర్థులు తమ అప్లికేషన్ ప్రక్రియను ముగించుకోవాలని అధికారులు సూచించారు.





