సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన ఈ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా సుమారు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న పద్ధతిని కొనసాగిస్తూ మే 13వ తేదీనే బోర్డు ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్లతో పాటు మొబైల్ యాప్‌ల ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు:
ఈ ఏడాది వెలువడిన ఫలితాల్లో మొత్తం 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే.. గతేడాదితో పోలిస్తే.. ఉత్తీర్ణత శాతం 3 శాతం తగ్గడం గమనార్హం.
అమ్మాయిల జోరు: ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికల్లో 88 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 82 శాతంతో సరిపెట్టుకున్నారు.
టాప్ స్కోరర్లు: సుమారు 17,000 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. మరో 94,000 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా స్కోర్ చేశారు.
ఆన్-స్క్రీన్ మార్కింగ్:
ఈ విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ ఒక వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. సమాధాన పత్రాలను ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) పద్ధతిలో డిజిటల్‌గా మూల్యాంకనం చేశారు. దీని కోసం ఉపాధ్యాయులకు ముందస్తుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫలితాల ప్రక్రియను మరింత పారదర్శకంగా.. వేగంగా నిర్వహించేందుకు ఈ విధానం దోహదపడింది.
రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు తమ రిజల్ట్స్ చూసుకోవడానికి బోర్డు పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.
వెబ్‌సైట్లు: విద్యార్థులు cbse.gov.in లేదా cbseresults.nic.in లోకి వెళ్లి రోల్ నంబర్, స్కూల్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ చూడొచ్చు.
డిజీలాకర్ : మీ మార్క్ షీట్స్ , మైగ్రేషన్ సర్టిఫికేట్లను డిజీలాకర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ (UMANG App): స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫలితాలను తెలుసుకోవడానికి ఈ యాప్ కూడా ఉపయోగపడుతుంది.





