కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 10వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు గుడ్ న్యూస్. సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 25,08,319 మంది విద్యార్థులు పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో బాలురు 14,08,546 మంది కాగా, బాలికలు 10,99,773 మంది ఉన్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు సంబంధించి 8,075 సెంటర్లలో పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఏడాది ‘టూ-బోర్డ్’ సిస్టమ్ కింద పరీక్షలు జరగడం విశేషం.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
ఫలితాల సమయంలో వెబ్‌సైట్లు మొరాయించకుండా ఉండేందుకు బోర్డు మూడు అధికారిక లింకులను అందుబాటులో ఉంచింది.
డిజీ లాకర్ & ఉమాంగ్ యాప్:
వెబ్‌సైట్లే కాకుండా.. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో DigiLocker లేదా Umang యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని కూడా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీబీఎస్ఈ అధికారులు ముందే సూచించినట్లుగా.. తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్న విద్యార్థులు నేరుగా డిజిటల్ మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేని వారు IVRS సౌకర్యం ద్వారా కూడా మార్కులు తెలుసుకోవచ్చు.
టాపర్ల జాబితాపై బోర్డు కీలక నిర్ణయం:
విద్యార్థుల మధ్య అనవసరమైన పోటీని, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సీబీఎస్‌ఈ 2020 నుంచి టాపర్ల లిస్ట్‌ను ప్రకటించడం ఆపేసింది. మొదటి, రెండో స్థానాలు అంటూ ర్యాంకులు ఇవ్వకుండా, కేవలం మార్కులు, గ్రేడ్‌లను మాత్రమే స్కోర్ కార్డులో పొందుపరుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఆశించిన మార్కులు సాధించలేకపోతే.. నిరాశ చెందకుండా రీ-వెరిఫికేషన్ లేదా కంపార్ట్‌మెంట్ పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.





