సీబీఎస్ఈ టెన్త్ విద్యార్థుల కోసం బోర్డు రెండో విడత (Phase 2) పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారి మార్కులను మెరుగు పరుచుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం. మే 15 నుంచి ప్రారంభం కానున్న ఈ కంపార్ట్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు మే 30 వరకు కొనసాగుతాయి. అర్హులైన విద్యార్థులు ఫీజు చెల్లించి ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. దీని ద్వారా విద్యార్థులు 11వ తరగతిలో అడ్మిషన్ పొందేందుకు వీలుంటుంది.
పరీక్షల వివరాలు, అర్హత:
మార్చిలో పూర్తయిన ప్రధాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ మార్కులను పెంచుకోవడానికి (గరిష్టంగా మూడు సబ్జెక్టుల వరకు) ఈ పరీక్షలు రాయవచ్చు. అలాగే.. కంపార్ట్‌మెంట్ కేటగిరీలో ఉన్న విద్యార్థులు కూడా దీనికి అర్హులు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ. 320 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజల్ట్ జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో వెలువడే అవకాశం ఉందని బోర్డు తెలిపింది.
ముఖ్యమైన తేదీలు:
బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రధాన సబ్జెక్టుల పరీక్షా తేదీలు..
మే 15: మ్యాథమెటిక్స్ (స్టాండర్డ్ & బేసిక్)
మే 16: ఇంగ్లీష్ (కమ్యూనికేటివ్ / లాంగ్వేజ్ & లిటరేచర్)
మే 19: సైన్స్
మే 20: సంస్కృతం, AI, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మే 21: సోషల్ సైన్స్
మే 26-30: ఇతర లాంగ్వేజ్ పేపర్స్
విద్యార్థులకు సూచనలు:
ఈ పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థులు తమ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఆలస్యం లేకుండా 11వ తరగతిలోకి అడ్మిషన్ పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు తమ పేపర్ కోడ్‌లను, పరీక్షా సమయాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని బోర్డు సూచించింది. పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకుని, హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపింది.





