బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి అదిరి పోయే గుడ్‌న్యూస్! ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3500 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణలో కూడా పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. మరి నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అప్రెంటిస్ చట్టం-1961 కింద మొత్తం 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతినెలా స్టైఫండ్ కూడా అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు, అర్హతలు:
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు అ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 17.
వయస్సు: అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు లభిస్తుంది.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2023 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్ 1 మధ్య డిగ్రీ పాసైన వారు మాత్రమే దీనికి అర్హులు.
తెలంగాణ,ఏపీలో ఖాళీల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ : ఏపీలో మొత్తం 247 అప్రెంటిస్ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ స్థానిక భాషగా తెలుగు లేదా ఉర్దూ ఉంటుంది.
తెలంగాణ : తెలంగాణలో మొత్తం 134 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇక్కడ కూడా తెలుగు లేదా ఉర్దూ స్థానిక భాషగా కేటాయించారు.
స్థానిక భాషపై పట్టు ఉన్న అభ్యర్థులు ఆయా రాష్ట్రాల్లోని డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుని అప్లై చేసుకోవచ్చు.
స్టైపెండ్:
ఇది రెగ్యులర్ ఉద్యోగం కాకపోయినా.. శిక్షణా సమయంలో అభ్యర్థులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ప్రతి నెలా రూ.16,650 స్టైపెండ్ అందిస్తారు. ఇందులో కెనరా బ్యాంక్ వాటా కింద రూ. 10,500, అలాగే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ. 6,150 నేరుగా అభ్యర్థి బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా జమ చేస్తారు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. అభ్యర్థులు ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల ఆధారంగా స్టేట్-వైజ్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మెరిట్లో నిలిచిన వారికి ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. టెన్త్ లేదా ఇంటర్ పరీక్షల్లో ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్టుగా చదివిన వారికి ప్రత్యేక పరీక్ష ఉండదు.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మిగతా అన్ని వర్గాల అభ్యర్థులు రూ.500 అప్లికేషన్/ఇంటిమేషన్ ఛార్జీగా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ canarabank.bank.in సంప్రదించవచ్చు.





