ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు తెలంగాణ గురుకుల పాఠశాలల్లో టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్) పోస్టులకు బీఏ, బీకాం, బీఎస్సీలతో పాటు అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త రూల్స్ ప్రకారం నియామకాలు చేయాలని పాత నిబంధనల ప్రకారం భర్తీ చేయోద్దని తెలిపింది. టీజీటీ పోస్టులకు బీటెక్‌తో పాటు బీఈడీ ఉన్న అభ్యర్థులను అనర్హులుగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ పిటిషన్స్ వేశారు. ఆ పోస్టులకు బీటెక్ విదార్థులు అర్హులేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 2019లో అప్పీల్ చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.
నాలుగు వారాల్లో నియామకాలు
బీటెక్‌తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులూ టీజీటీ పోస్టులకు అర్హులేనని పేర్కొంది. 2010 తరువాత 2014 ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు జారీ చేసిందని… ఆ తరువాత జరిగే నియామకాలన్నీ ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అర్హులైన అభ్యర్థులందరి దరఖాస్తులను పరిశీలించి నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ వారు జోనల్ పరిధిలోకి వస్తే వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చట్టప్రకారం నియామకాలు చేపట్టాలని సూచించింది. బీటెక్ అభ్యర్థులు అర్హులేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదంటూ తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను కొట్టివేసింది.