కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)..జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF)లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 899 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, హిందీ టైపిస్ట్ లాంటి ఎన్నో పోస్టులు ఇందులో ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 4 వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో రకరకాల ట్రేడ్‌లకు ఛాన్స్ ఇచ్చారు. స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులు అత్యధికంగా 300 ఉన్నాయి. వీటికి ఇంటర్ అర్హతతో పాటు స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఆపరేటర్ కమ్యూనికేషన్ పోస్టులు 261 ఉన్నాయి. వీటికి టెన్త్ క్లాస్‌తో పాటు ఐటీఐ వైర్‌లెస్ ఆపరేటర్ లేదా రేడియో మెకానిక్ సర్టిఫికేట్ అవసరం. అలాగే 207 ఆపరేటర్ ఎక్స్‌కవేటింగ్ మెషినరీ పోస్టులు, 79 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 42 డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు, 10 హిందీ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ లేదా ఇంటర్ పాసైన వాళ్లు ఇందుకు అర్హులు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది.
జీతం:
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుకు బేసిక్ పే బ్యాండ్-1తో పాటు గ్రేడ్ పే 2800 రూపాయలు ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకు గ్రేడ్ పే 1900 రూపాయలతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, , రిస్క్ ఏరియాల్లో పని చేసినందుకు గానూ హార్డ్ అండ్ రిస్క్ అలవెన్స్ కూడా లభిస్తాయి.
అప్లికేషన్ చివరి తేదీ: సాధారణ రాష్ట్రాల వారికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జులై 4 కాగా, ఈశాన్య రాష్ట్రాల వారికి జూలై 19 వరకు సమయం ఉంది.
సెలెక్షన్ ప్రాసెస్:
అభ్యర్థులను రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగును 10 నిమిషాలలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే రీజియన్ల వారీగా ఎత్తు, బరువు ప్రమాణాలు ఉంటాయి. సౌత్ రీజియన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల) అభ్యర్థులు కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు, 50 కేజీల బరువు ఉండాలి.
అప్లికేషన్ విధానం:
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు. కేవలం ఆఫ్‌లైన్ ద్వారానే అప్లై చేయాలి. అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ bro.gov.in లోంచి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇంగ్లీష్ లేదా హిందీ క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే నింపాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 రూపాయల ఫీజును ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మాత్రమే చెల్లించి, ఆ రశీదును ఫామ్‌కు యాడ్ చేయాలి. తర్వాత పూణేలోని జీఆర్ఈఎఫ్ సెంటర్‌కు పోస్ట్ ద్వారా పంపాలి.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ bro.gov.in సంప్రదించవచ్చు.





