BRAOU New Courses 2026: ఉద్యోగస్తులకు, ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రొఫెషనల్, అకాడమిక్ రంగాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఐదు సరికొత్త కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ నెలలో వర్చువల్ తనిఖీలు పూర్తి చేసిన యూజీసీ ఎక్స్పర్ట్ కమిటీ.. యూనివర్సిటీలోని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సామర్థ్యానికి మెచ్చి ఈ కొత్త కోర్సులకు ఆమోదం ముద్ర వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
యూజీసీ అనుమతించిన ఆ 5 కోర్సులు :
M.A.ఎడ్యుకేషన్
M.A.ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్)
మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW)
M.Sc.(జాగ్రఫీ)
B.Ed.(స్పెషల్ ఎడ్యుకేషన్) – దీనికి అనుమతి పునరుద్ధరణ లభించింది.
ఉపాధ్యాయులకు మేలు:
పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచడానికి, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ద్వారా స్పెషల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందించాలనే ఉద్దేశంతో వీటిని డిజైన్ చేశారు.
ఈ కోర్సుల ద్వారా ఇన్-సర్వీస్ టీచర్లు తమ అర్హతలను పెంచుకోవడంతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు త్వరలోనే తెలంగాణ విద్యాశాఖతో విశ్వవిద్యాలయం ఒక కీలక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనుంది.
జాబ్ ఓరియెంటెడ్ పీజీ కోర్సులు:
ప్రస్తుత సమాజంలో సోషల్ వర్క్, జాగ్రఫీ రంగాలకు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఎంఎస్ డబ్ల్యూ (MSW), ఎమ్మెస్సీ జాగ్రఫీ (M.Sc. Geography) కోర్సులను యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రైవేట్, ప్రభుత్వ, ఎన్జీవో (NGO) రంగాల్లో అద్భుతమైన కెరీర్ అవకాశాలు లభిస్తాయి.
నోటిఫికేషన్ వివరాలు:
యూజీసీ అనుమతి లభించిన నేపథ్యంలో.. ఈ ఐదు కోర్సులకు సంబంధించిన కనీస అర్హతలు, ఫీజుల వివరాలు, కోర్సు డ్యూరేషన్, స్టడీ సెంటర్ల వివరాలతో కూడిన పూర్తి అడ్మిషన్ నోటిఫికేషన్ను యూనివర్సిటీ త్వరలోనే విడుదల చేయనుంది.
లేటెస్ట్ అప్డేట్స్, సమాచారం కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లు అయిన www.braou.ac.in లేదా www.braouonline.in ని సందర్శించవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ నంబర్లు 040 – 23680 333/555 ను సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.





