ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) చక్కటి వేదికగా నిలుస్తోంది.ఇక్కడ డిగ్రీ లేదా పీజీ చేయాలని ఆశపడేవారికి వర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల అడ్మిషన్ల కోసం ఆన్లైన్ అప్లికేషన్ గడువును పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నిజానికి ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది. విద్యార్థుల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని, అప్లికేషన్ గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించారు. ఈ నిర్ణయంతో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదవాలనుకునే వేలాది మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయింది.
కోర్సులు:
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సులు అయిన బీఏ (BA), బీకామ్ (B.Com), బీఎస్సీ (B.Sc)తో పాటు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులైన ఎం.ఏ (MA), ఎం.కామ్ (M.Com), ఎం.ఎస్సీ (M.Sc), ఎంబీఏ (MBA), బీఎల్ఐఎస్సీ (BLISc), ఎమ్ఎల్ఐఎస్సీ (MLISc) కోర్సులకు అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. వీటితో పాటు పలు రకాల ప్రొఫెషనల్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో కూడా అడ్మిషన్ పొందవచ్చు.
అప్లై చేసుకునే విధానం:
ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ www.braouonline.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ముందుగా నోటిఫికేషన్లోని మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదవడం మంచిది. తర్వాత ఆన్లైన్ పేమెంట్ పూర్తి చేసి, అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి.. చివరి తేదీ వరకు చూడకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించవచ్చని తెలిపారు.





