ఈ నెల 9న నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్లనురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఈసారి బయో మెట్రిక్ తప్పనిసరి. అందుకే బయో మెట్రిక్ ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి తెలిపారు. బయోమెట్రిక్ నమోదుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే అదనంగా బయోమెట్రిక్ పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. జిల్లా కలెక్టర్లకు కూడా పరీక్షల ఏర్పాట్ల పై తగు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. . గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
రాష్ట్రంలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డనేటర్ను కూడా నియమించారు.