ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు అలర్ట్. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ ఉద్యోగాల కోసం అప్లికేషన్ గడువు రేపటితో (సెప్టెంబర్ 7) ముగియనుంది. కాబట్టి డిగ్రీ పూర్తి చేసి, కమర్షియల్ బ్యాంకులో ఒక సంవత్సరం ఆఫీసర్ అనుభవం ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు..
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 18 న ప్రారంభమైంది. అప్లికేషన్లకు, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 7గా నిర్ణయించారు. రేపటితో గడువు ముగుస్తుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.
అర్హతలు, వయోపరిమితి:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా కమర్షియల్ బ్యాంకులో ఒక సంవత్సరం ఆఫీసర్ అనుభవం ఉండాలి. అలాగే..అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయోపరిమితిలో తగిన సడలింపు ఉంటుంది. అభ్యర్థులు తాము అప్లై చేసే రాష్ట్రానికి చెందిన స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండటం తప్పనిసరి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి కేటగిరీల వారీగా అప్లికేషన్ ఫీజు నిర్ణయించడం జరిగింది.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.850 (జీఎస్టీతో కలిపి) చెల్లించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.175 (జీఎస్టీతో కలిపి). ఫీజు చెల్లింపు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్, జీతం:
ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జెఎంబీ/ఎస్-ఐ (JMG/S-I) గ్రేడ్ కింద జీతం ఇస్తారు. వీరికి పే స్కేల్ రూ. 48,480 నుంచి ప్రారంభమై నిబంధనల ప్రకారం పెరుగుతుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.bankofbaroda.bank.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.





