ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో అద్భుతమైన అవకాశాన్ని అందించింది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ శాఖల్లోని 299 ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఎండోమెంట్స్, ఫారెస్ట్, ఇండస్ట్రీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వంటి వివిధ సబార్డినేట్ సర్వీసుల కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు నవంబర్ 5 రాత్రి 11:59 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో డీటైల్డ్ నోటిఫికేషన్ అక్టోబర్ 16 నాటికి లేదా అంతకంటే ముందే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
పోస్టుల వివరాలు, ఖాళీలు:
మొత్తం 299 ప్రొవిజనల్ ఖాళీలను వివిధ కేటగిరీల కింద భర్తీ చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III: 104 పోస్టులు
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్: 78 పోస్టులు
సూపర్వైజర్ గ్రేడ్-I (కేవలం మహిళలకు మాత్రమే): 29 పోస్టులు
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 26 పోస్టులు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 23 పోస్టులు
డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-II (టెక్నికల్ అసిస్టెంట్): 20 పోస్టులు
డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-II: 15 పోస్టులు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 04 పోస్టులు
విద్యార్హతలు:
అభ్యర్థుల విద్యార్హతలు పోస్టును బట్టి మారుతుంటాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మిగిలిన అన్ని ప్రధాన పోస్టులకు డిగ్రీ, సోషల్ వర్క్, సైకాలజీ, హోమ్ సైన్స్, లేదా సంబంధిత ఇంజనీరింగ్/సైన్స్ సబ్జెక్టులలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాలు డీటైల్డ్ నోటిఫికేషన్లో వెల్లడిస్తారు.
పరీక్ష విధానం:
ఈసారి ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించకుండా.. నేరుగా సింగిల్-లెవెల్ కంప్యూటర్-బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా మాత్రమే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్షలు ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. ఒకవేళ పరీక్షను వివిధ సెషన్లలో నిర్వహిస్తే నిబంధనల ప్రకారం నార్మలైజేషన్ పద్ధతిని వర్తింపజేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి జనరల్ స్టడీస్, హిందూ ఫిలాసఫీ & టెంపుల్ సిస్టమ్స్ మీద రాత పరీక్ష ఉంటుంది. తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ కూడా వర్తిస్తుంది.





