ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు జులై 15 నుంచి జులై 23 వరకు జరగనున్నాయి. జులై 19న మాత్రం ఎలాంటి పరీక్ష లేదు.
అధికారిక కారణాల వల్ల టీటీడీ ఆధ్వర్యంలోని డిగ్రీ, ఓరియంటల్, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు మిగతా లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో (ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు పరీక్షలు జులై 15 నుంచి జులై 23 వరకు జరగనున్నట్లు కమిషన్ అధికారికంగా ప్రకటించింది.
జులై 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు.. పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, హిస్టరీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 20 నుంచి 23 వరకు.. జనరల్ స్టడీస్ & మెంటల్ అబిలిటీ (GSMA), తెలుగు, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫార్మసీ, మైక్రోబయాలజీ, జువాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ మొదలైన సబ్జెక్టుల పరీక్షలు నిర్వహిస్తారు.






