చదువు మధ్యలో ఆగిపోయిందా? రెగ్యులర్ స్కూల్ లేదా కాలేజీకి వెళ్లే అవకాశం లేదా? అయినా సరే టెన్త్, ఇంటర్ పూర్తి చేయాలనుకునే వారికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) అద్భుతమైన అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా జులై 30 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు జరుగుతాయి. ఎలాంటి వయో పరిమితి లేకుండా ఇంట్లోనే ఉంటూ చదువుకునే ఈ సువర్ణావకాశానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం వంటి మరిన్ని వివరాలు..
ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు 2026:
వివిధ కారణాల వల్ల చదువు ఆపేసిన వారికి ఏపీ సార్వత్రిక విద్యాపీఠం గుడ్ న్యూస్ అందించింది. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ పద్ధతిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పొందాలనుకునే వారి కోసం 2026-27 అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ అడ్మిషన్ల ద్వారా పొందే సర్టిఫికేట్లు రెగ్యులర్ చదువులతో సమానమైన గుర్తింపును కలిగి ఉంటాయి.
ముఖ్యమైన తేదీల వివరాలు:
ఆన్‌లైన్ అప్లికేషన్: ఎలాంటి లేట్ ఫీజు లేకుండా జులై 30 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు జరుగుతాయి.
అప్లికేషన్ ఫీజు:రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు జులై 31 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
లేట్ ఫీజు: ఒకవేళ జులై నెలాఖరులోపు అప్లై చేయలేకపోతే.. రూ. 200 లేట్ ఫీజుతో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
అర్హతలు:
ఓపెన్ టెన్త్: 14 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కనీసం అక్షరాస్యత లేదా బడి మానేసిన వారు కూడా అర్హులే.
ఓపెన్ ఇంటర్: పదో తరగతి (10th) పాసైన విద్యార్థులు నేరుగా ఓపెన్ ఇంటర్‌లో చేరవచ్చు. మధ్యలో ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ (TOC) ద్వారా మిగిలిన సబ్జెక్టులు రాసుకోవచ్చు.
ఉద్యోగాలకు అర్హత: ఈ సర్టిఫికేట్లు ఉన్నత చదువులకు, ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగాలకు వందకు వంద శాతం చెల్లుబాటు అవుతాయి.
అప్లై చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.అప్లికేషన్ పూర్తయిన తర్వాత మీ దగ్గరలోని ప్రభుత్వ ప్రాంతీయ అధ్యయన కేంద్రాలలో ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించి అడ్మిషన్‌ను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ ఏరియాలోని స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్‌ను సంప్రదించవచ్చు.





