ఏపీ టెట్ (AP TET) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ 10 నుంచి 21 వరకు నిర్వహించిన ఈ టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫలితాల్లో మొత్తం 97,560 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ ని సందర్శించాలి. అక్కడ యూజర్ ఐడీ (Candidate ID), పాస్‌వర్డ్ (పుట్టిన తేదీ) వివరాలను ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించి, వాటిని నిపుణులతో విశ్లేషించిన తర్వాతే తుది ఫలితాలను, స్కోర్‌కార్డులను అందుబాటులోకి తెచ్చింది.
డీఎస్సీ (DSC) నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో అభ్యర్థులు ఈ మార్కులపై ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. ఫలితాల డౌన్‌లోడ్‌లో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వెబ్‌సైట్‌లోని హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.





