ఏపీ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘పాలిసెట్-2026’ పరీక్షకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియను ముగించి, తాజాగా అభ్యర్థుల హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ కెరీర్ ప్రారంభించాలనుకునే వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రం, సమయం వంటి కీలక వివరాల కోసం అభ్యర్థులు వెంటనే తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి జి.వి.వి.సత్యనారాయణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. హాల్ టికెట్లను రెండు సులభమైన పద్ధతుల్లో పొందవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్ ద్వారా:
అభ్యర్థులు https://polycetap.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, హోమ్ పేజీలో కనిపించే ‘Print Hall Ticket’ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. అక్కడ టెన్త్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. - వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా:
విద్యార్థుల సౌకర్యం కోసం ఈ ఏడాది సరికొత్తగా వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టారు. 9552300009 అనే నంబర్‌కు అభ్యర్థులు తమ వివరాలతో మెసేజ్ పంపి నేరుగా ఫోన్‌లోనే హాల్ టికెట్‌ను పొందవచ్చు.
పరీక్ష షెడ్యూల్:
పరీక్ష తేదీ: ఏప్రిల్ 25 న వివిధ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు.
సమయం: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది.
ముఖ్యమైన సూచనలు:
1.హాల్ టికెట్‌పై ఉన్న ఫోటో,సంతకం, వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
2. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవడం తప్పనిసరి.
3.హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ వంటివి) వెంట ఉంచుకోవడం మంచిది.
4. పరీక్ష రాసే విద్యార్థులందరూ సమయపాలన పాటిస్తూ.. తగిన జాగ్రత్తలతో పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని అధికారులు సూచించారు.





