ఏపీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏపీ పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. గేట్, జీప్యాట్, పీజీఈసెట్ అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఫీజు, కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీల వివరాలు:
రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: సెప్టెంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబర్ 17 నుంచి 22 వ తేదీ వరకు అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో పరిశీలిస్తారు.
వెబ్ ఆప్షన్లు: సెప్టెంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల సవరణ: ఒకవేళ ఆప్షన్లలో మార్పులు చేసుకోవాలనుకుంటే.. సెప్టెంబర్ 25వ తేదీన అవకాశం కల్పించారు.
సీట్ల కేటాయింపు : సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడిస్తారు.
సెల్ఫ్ జాయినింగ్ & కాలేజీల్లో రిపోర్టింగ్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
తరగతుల ప్రారంభం: సెప్టెంబర్ 30 నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు గమనిక:
పీహెచ్డీ, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ (బెంజ్ సర్కిల్ దగ్గర) హెల్ప్‌లైన్ సెంటర్లో.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు వివరాలు:
ఓసీ,బీసీ అభ్యర్థులు రూ.1,250, అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.650 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ఈ ఫీజును కేవలం అధికారిక వెబ్సైట్ (cap.apcfss.in) ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లించడానికి వీలవుతుంది. అర్హులైన విద్యార్థులు నిర్ణయించిన గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.





