ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీలలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్ (AP PGCET) కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. విశ్వవిద్యాలయాల పరిధిలోని 150కి పైగా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 4 నుంచి 12 వరకు కొనసాగుతుంది. ప్రత్యేక కేటగిరీల (NCC, స్పోర్ట్స్, PWD, CAP) అభ్యర్థులకు సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థులు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అలాగే ఎంచుకున్న ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి సెప్టెంబర్ 16న అవకాశం కల్పిస్తారు. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ 21వ తేదీన జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు అదే రోజు (సెప్టెంబర్ 21) నుంచి సంబంధిత కాలేజీల్లో రిపోర్డ్ చేయాల్సి ఉంటుంది. నాటి నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయి.
ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను కేవలం పీడీఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. ఎస్సెస్సీ/ఇంటర్ మెమోలు, డిగ్రీ ప్రొవిజనల్, డిగ్రీ మార్కుల మెమోలు, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు అవసరం ఉంటుంది. వీటితో.. పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (వర్తించే ఓసీలకు), లేదా రేషన్ కార్డ్ , రెసిడింట్ సర్టిఫికెట్ కౌన్సెలింగ్ పోర్టల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.





