ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదల అయ్యాయి. మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించిన ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే అధికారులు ఈ ఫలితాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు.
ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్న జనరల్, ఒకేషనల్ విభాగాల సప్లిమెంటరీ ఫలితాలతో పాటు, మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్మెంట్ (బెటర్మెంట్) పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి.
రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ?
ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
1: మొదట అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in ఓపెన్ చేయాలి.
2: హోమ్ పేజీలో కనిపించే “AP Inter Supplementary & Improvement Results” లింక్‌పై క్లిక్ చేయాలి.
3: అక్కడ ఉన్న బాక్సుల్లో మీ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
4: వివరాలు ఎంటర్ చేశాక ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయాలి.
5: వెంటనే మీ ఫలితాలు, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయి.డౌన్ లోడ్ చేసుకోండి.
విద్యార్థుల సౌకర్యార్థం.. వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్ అందుబాటులో.. ఉంచారు. ఇందుకోసం ‘మన మిత్ర’ అధికారిక నంబర్ 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.
ఈ ఏడాది ఇంటర్ బోర్డు రెండో ఏడాది విద్యార్థులకు కూడా మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే ప్రత్యేక అవకాశం కల్పించింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 1.83 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ పాత స్కోర్‌ను మెరుగు పరుచుకోగలిగారు. అలాగే గతంలో ఫెయిల్ అయిన వారిలో దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా పాస్ అయ్యారు.
ఇక ఫలితాలను పరిశీలిస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ , ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన 2,29,034 మంది విద్యార్థులలో 59 శాతం మంది (1,35,435 మంది) మార్కులు పెంచుకున్నారు. అలాగే.. సప్లిమెంటరీ విభాగంలో పరీక్ష రాసిన 1,09,003 మందిలో 39 శాతం మంది (42,379 మంది) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ లలో.. కూడా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షకు హాజరైన 91,303 మందిలో.. 53 శాతం మంది (48,149 మంది) తమ స్కోర్‌ను మెరుగు పరుచుకోగా.. సప్లిమెంటరీ రాసిన 1,02,018 మందిలో 56 శాతం మంది (57,327 మంది) విద్యార్థులు ఘన విజయం సాధించి పాస్ అయ్యారు.





