ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP)మే నెలలో నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు లేదా మార్కులు పెంచుకోవాలని భావించే విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పెంచారు.
మొదట ప్రకటించిన గడువు ఏప్రిల్ 27తో ముగియగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు దీనిని ఈ నెల చివరి వరకు పొడిగిస్తూ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ముఖ్యమైన వివరాలు:
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 27 చివరి తేదీగా ఉంది. అయితే.. గడువు ముగిసినప్పటికీ చాలా మంది విద్యార్థులు ఇంకా అప్లై చేసుకోకపోవడం, మరికొందరు గడువు పెంచాలని కోరడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే ప్రసక్తే లేదని, కాబట్టి విద్యార్థులు తమ కాలేజీ ప్రిన్సిపాల్స్ ద్వారా సకాలంలో ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇంప్రూవ్‌మెంట్ :
ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఉన్న ఇంప్రూవ్‌మెంట్ సౌకర్యాన్ని.. ఇప్పుడు రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా కల్పించారు. పాసైన విద్యార్థులు సైతం తమ మార్కులను మెరుగు పరుచుకోవడానికి ఈ పరీక్షలకు హాజరు కావచ్చు. ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్‌లో తక్కువ మార్కులు వస్తే, పాత మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు.
పరీక్షల షెడ్యూల్:
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి జూన్ మొదటి వారం వరకు కొనసాగుతాయి. పరీక్షా ఫీజు వివరాల కోసం విద్యార్థులు సంబంధిత జూనియర్ కాలేజీల్లో సంప్రదించవచ్చు. ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన వారు, సబ్జెక్టుల వారీగా ఫీజు చెల్లించి హాల్ టికెట్లను పొందవచ్చు.





