ఏపీ ఇంటర్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను మంత్రి నారా లోకేష్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదైంది. సాంకేతిక ఇబ్బందులు కలగకుండా అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. పరీక్షలకు హాజరైన వారిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,31,275 మంది కాగా, రెండవ సంవత్సరం నుంచి 5,06,264 మంది ఉన్నారు. గత కొన్ని ఏళ్లతో పోలిస్తే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా.. పరీక్షల నిర్వహణలో కూడా విద్యాశాఖ కఠినమైన నిబంధనలు పాటించింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల హాజరు శాతం కూడా గణనీయంగా పెరగడం విశేషం.
రిజల్ట్ ఎలా తెలుసుకోవాలి?
అధికారిక వెబ్‌సైట్: విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు.
వాట్సాప్ ద్వారా (మన మిత్ర):ఈసారి వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్స్ పొందే అవకాశం కల్పించారు. 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేసి, సూచనల ప్రకారం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే సెకన్లలో స్కోర్ కార్డ్ మొబైల్‌కు వస్తుంది.
మార్క్స్ మెమో డౌన్‌లోడ్:
వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా పొందిన ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు, గ్రేడ్లు ఉంటాయి. విద్యార్థులు భవిష్యత్ అవసరాల కోసం ఈ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.





