ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ‘టెట్’ నిబంధన ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. టీచర్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యేక బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసింది.
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనల ప్రకారం.. 2011 నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే వారికి టెట్ అర్హతను తప్పనిసరి చేశారు. అయితే.. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. సర్వీసులో ఉన్నవారంతా ఖచ్చితంగా రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన 2011 కంటే ముందు నుంచి విధుల్లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు సవాలుగా మారింది.
2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సర్కారు కోరుతోంది. దశాబ్దాల కాలంగా బోధనా రంగంలో ఉండి, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారు ఇప్పుడు కొత్తగా పరీక్ష రాయడం కష్టతరమని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే లక్షలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్తు, సర్వీసు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఇటీవల ఏపీలో నిర్వహించిన టెట్ పరీక్షలకు అనూహ్య స్పందన లభించింది. కొత్తగా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు, ఇప్పటికే విధుల్లో ఉండి పదోన్నతులు ఆశిస్తున్న వారు, అలాగే కోర్టు నిబంధనల నేపథ్యంలో ఆందోళనలో ఉన్న టీచర్లు కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు.
ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశంపై ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందిస్తే, వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు ఉపశమనం లభించనుంది.





