తెలంగాణలో గ్రూప్-3 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. నవంబర్ 18న పేపర్-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు.
అప్లికేషన్స్ 5.36 లక్షల పైనే..
తెలంగాణలో దాదాపు 1380కి పైగా గ్రూప్-3 పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-3 పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల లోపే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ కాపీని భద్రంగా పెట్టుకోవాలని, తొలిరోజు పేపర్-1 పరీక్షకు హాజరైన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే.. పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23542185, 040-23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: గ్రూప్-3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అంశాలు, పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
ఎగ్జామ్ టైమ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు: హాల్‌టికెట్లను ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ప్రింట్ కాకుంటే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి. బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్, హాల్‌టికెట్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ప్రశ్నపత్రం ఓపెన్ చేయగానే అందులో అన్ని ప్రశ్నలు ముద్రించారా? లేదా? చూసుకోవాలి. తప్పుడు గుర్తింపు పత్రాలతో హాజరైనా, ఒకరి పేరిట మరొక అభ్యర్థి వచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.