దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. All India Sainik Schools Entrance Examination (AISSEE–2027)కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబర్ 3న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 33 సైనిక్ స్కూళ్లతో పాటు అనుమతి పొందిన కొత్త సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 2 రాత్రి 11:50 గంటల వరకు స్వీకరిస్తారు.
అర్హతలు.. పుట్టిన తేదీల పరిమితి
ఆరో తరగతి ప్రవేశాలకు 2027 మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల వయసు ఉండాలి. 2015 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులు. తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల వయసు ఉండాలి. 2012 ఏప్రిల్ 1 నుంచి 2014 మార్చి 31 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదో తరగతిలో చేరే సమయానికి గుర్తింపు పొందిన పాఠశాలలో ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బాలికల ప్రవేశాలు సంబంధిత పాఠశాలలో సీట్ల లభ్యతకు లోబడి ఉంటాయి.
దరఖాస్తు తేదీలు, ఫీజు
నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 రాత్రి 11:50 గంటల వరకు సాధారణ దరఖాస్తు గడువు. General, Defence, OBC-NCL అభ్యర్థులకు ఫీజు రూ.850; SC, ST అభ్యర్థులకు రూ.700. డిసెంబర్ 3 నుంచి 6 వరకు అదనంగా రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు డిసెంబర్ 6 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల్లో సవరణలకు డిసెంబర్ 7 నుంచి 9 వరకు గడువు ఇచ్చారు.
జనవరి 31న ప్రవేశ పరీక్ష
AISSEE–2027 పరీక్షను 2027 జనవరి 31న OMR షీట్ ఆధారంగా నిర్వహిస్తారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు, తొమ్మిదో తరగతి పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష నగర సమాచారం జనవరి 11న, అడ్మిట్ కార్డులు జనవరి 25న విడుదల చేయనున్నట్లు NTA ప్రకటించింది. ఫలితాల తేదీని తరువాత తెలియజేస్తుంది.
పరీక్ష విధానం.. తెలుగు మాధ్యమంలోనూ అవకాశం
ఆరో తరగతి పరీక్షలో Language, Mathematics, Intelligence, General Knowledge విభాగాల నుంచి 125 ప్రశ్నలు, మొత్తం 300 మార్కులు ఉంటాయి. తొమ్మిదో తరగతికి Mathematics, Intelligence, English, General Science, Social Science నుంచి 150 ప్రశ్నలు, 400 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు లేవు. ఆరో తరగతి పరీక్షకు తెలుగుతో సహా 13 భాషల్లో ప్రశ్నపత్రం అందుబాటులో ఉంటుంది. తొమ్మిదో తరగతి పరీక్ష మాత్రం ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తారు.
ప్రవేశాల ఎంపిక, రిజర్వేషన్లు
ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, పాఠశాలవారీ ఖాళీలు, కేటగిరీ, వైద్య పరీక్షలో అర్హత, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ-కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న సైనిక్ స్కూళ్లలో 67 శాతం సీట్లు ఆ పాఠశాల ఉన్న రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు, 33 శాతం ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయించే నిబంధన ఉంది. కొత్త సైనిక్ స్కూళ్లలో ప్రవేశ విధానం, సీట్ల కేటాయింపు సంబంధిత పాఠశాల నిబంధనల ప్రకారం మారవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
అభ్యర్థులు AISSEE అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఫొటో, సంతకం, వేలిముద్రతో పాటు జనన ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, అవసరమైన కేటగిరీ ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు పూర్తి కావాలంటే ఫీజు చెల్లింపు అనంతరం కన్ఫర్మేషన్ పేజీ రూపొందాలి. పాఠశాలలవారీ తాత్కాలిక సీట్లు, పూర్తి అర్హతలు, పరీక్ష సిలబస్ అధికారిక ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నాయి. NTA నవంబర్ 3 ప్రకటనను కూడా పరిశీలించవచ్చు.





