తెలంగాణలో 615 మంది పౌరులకు ఒక పోలీస్ ఉన్నట్లు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ బీపీఆర్ డీ తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. వాస్తవానికి 442 మందికి ఒక పోలీస్ ఉండాలి. అంటే లక్ష మంది పౌరులకు 226మంది పోలీసులు ఉండాలి. కానీ 163 మంది మాత్రమే ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలిస్ శాఖ స్థితిగతులపై బీపీఆర్ డీ తాజా నివేదికను వెల్లడించింది. రాష్ట్ర పోలీసుశాఖలో అన్ని విభాగాల్లో కలిపి 24,247 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణకు 139 ఐపీఎస్ పోస్టులు మంజురు అయితే 122 మంది ఉన్నట్లు వెల్లడైంది.
కాగా దేశవ్యాప్తంగా మొత్తం 77 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 12 ఉంటే..తెలంగాణ, తమిళనాడులో 9 కమిషనరేట్లు ఉన్నాయి. 33 పోలీస్ ట్రైనింగ్ సంస్థలతో తెలంగాణ రాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. 1,12,122.4 చదరపు కిలోమీటర్లతో విస్తరించిన మనరాష్ట్రంలో ప్రతి 1.3కిలోమీటర్ పరిధికి ఒక పోలీసు అవసరం. కాగా 1.81 కిలోమీటర్లకు ఒక పోలీస్ ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల సంఖ్య 844గా ఉన్నాయి. మొత్తం పోలీస్ శాఖకు 19,982 వాహనాలు ఉన్నాయి. వీటిలో స్టేషన్లలో 5966 ఉన్నాయి. ప్రతి వంద మంది పోలీసులకు రవాణా సదుపాయం కల్పిస్తున్న విషయంలో మాత్రం తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.
మహిళా పోలీస్ అధికారుల్లో సివిల్ భాగంలో డీజీపీ స్థాయిలో ఒక్క మహిళ ఆఫీసర్ లేరు. ఆరుగురు అదనపు డీపీజీలు, ఒక్కో ఐజీ, డీఐజీ 29 మంది ఎస్పీలు, 13 మంది అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 27 మంది ఇన్ స్పెక్టర్లు, 372 మంది ఎస్సైలు, 198 మంది ఏఎస్సైలు, 320 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 2907 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61,811 మంది పోలీసులు ఉన్నారు. అన్ని విభాగాల్లో కలిపి 5351 మంది మహిళా పోలీసులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి 3530 మంది ఆడవారికి ఒక మహిళా పోలీస్ ఉన్నారు. 16 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.