HomeLATESTతెలంగాణ రోడ్లు భవనాలు

తెలంగాణ రోడ్లు భవనాలు

రహదారులు & భవనాలు

Advertisement

మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. రవాణా సౌకర్యం బాగున్న సమాజాలు త్వరితగతిన పురోగమిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ అన్నిరంగాల్లో  మాదిరిగానే రహదారుల విషయంలో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం, వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండేది. జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. ఆర్ అండ్ బి రోడ్లలో 70 శాతం సింగిల్ లేన్ రోడ్లే. పంచాయతీరాజ్ పరిధిలో ఎక్కువ శాతం మట్టిరోడ్లే. అన్నిరోడ్లు కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోకుండా గుంతలు పడి, రాకపోకలకు ఇబ్బందికరంగా మారేవి. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన రహదారులు నరకాలకు నకళ్లుగా ఉండేవి. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం మొదటి రోజుల్లోనే గ్రహించింది. రహదారుల పరిస్థితిని మెరుగు పర్చడం ద్వారా తెలంగాణలో ప్రగతిబాటలు నిర్మించాలని నిర్ణయించింది. రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత  ప్రాధాన్యతాంశంగా గుర్తించింది. రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి జాతీయ రహదారులు విస్తరణ, పంచాయతీరాజ్ – ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రచించి, అమలు చేస్తున్నది. దాంట్లో భాగంగానే ఆర్‌ అండ్‌ బి శాఖ పరిధిలోని 7,554 కిలోమీటర్ల స్టేట్‌ రోడ్‌ల అభివృద్ధికి రూ. 11,257 కోట్లను విడుదల చేశారు. ఇందులో 2020 మార్చి నాటికి 5,453 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పూర్తయింది. వీటికోసం రూ.7,463 కోట్లను ఖర్చు చేశారు. రోడ్లను బాగు చేసేందుకు 1868 కోట్లను ఖర్చు చేశారు. మంజీర ,గోదావరి, మానేరు,ప్రాణహిత, మున్నేరు,అకేరు, మూసి,తుంగభద్ర తదితర నదులపై వంతెనలను నిర్మిస్తున్నారు. ఇందులో రూ. 9,084 కోట్ల వ్యయంతో 26 భారీ వంతెనల నిర్మాణాలను చేపట్టారు. 16 నిర్మాణాలను పూర్తి చేశారు. బడ్జెట్లో కూడా ఈ శాఖకు నిదులు భారీగానే కేటాయిస్తున్నారు. 2018-19లో బడ్జెట్లో రూ. 5,575 కోట్లు, 2019-20 లో రూ.2,219 కోట్లు, 2020-21 లో రూ.3493.67 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లోనే కొత్త పంచాయతీల్లో రహదారులకు రూ.5 వేల కోట్లు, సీసీ రోడ్లకు మరో రూ.600 కోట్లు కేటాయించారు.

  1. అన్ని మండల కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్డు

రాష్ట్ర రాజధాని నుంచి ప్రతీ జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా ఫోర్ లేన్ రోడ్డు, జిల్లాకేంద్రం నుంచి మండలకేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు, ప్రతీ మండలకేంద్రం నుంచి ప్రతీ గ్రామానికి పక్కారోడ్డు సౌకర్యం ఉండాలనే విధానం పెట్టుకుని, దానిప్రకారం రహదారులను మంజూరు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి 143 మండల కేంద్రాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్ లేన్ బిటి రోడ్డు లేదు. రూ.2,518 కోట్ల వ్యయం చేసి, మండల కేంద్రాలకున్న 1,875 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను ప్రభుత్వం డబుల్ లేన్ రోడ్లుగా మార్చింది. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాల నుంచి డబుల్ లేన్ రోడ్డు సౌకర్యం సమకూరింది. మండల కేంద్రం నుంచి ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా బస్సు పోయే విధంగా రహదారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేసింది. మట్టి రోడ్లను కూడా బీటీ రోడ్ల స్థాయిలో నిర్మించింది.

  • రవాణా శాఖ సేవలన్నీ ఆన్ లైన్ లోనే…

రవాణా శాఖ తీసుకొచ్చిన కొన్ని ఆన్ లైన్ సేవలు దళారుల వ్యవస్థను చాలావరకు నిరోధించగలిగాయి. ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ జిల్లాలోని ఆర్టీఎ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసే ప్రక్రియ విజయవంతమైంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్, కొత్త పర్మిట్లు, పాత పర్మిట్ల పునరుద్ధరణ ట్రేడ్ సర్టిఫికెట్లు, ఫ్యాన్సీ నెంబర్లు వంటి మొత్తం 33 సేవలను ఆన్ లైన్ లో అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దళారులు, అవినీతి నిర్మూలన లక్ష్యంగా పారదర్శక పాలన అందించే దిశగా ప్రభుత్వం కార్యచరణను రూపొందిస్తున్నది. 

Advertisement
  • రికార్డుస్థాయిలో వంతెనల నిర్మాణం

ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లున్నప్పటికీ వాగులు, నదుల మీద అవసరమైనన్ని వంతెనల లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి రహదారులు, పంచాయతీ రాజ్ రహదారులపై వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఆర్.అండ్.బి పరిధిలో 511, పంచాయతీరాజ్ పరిధిలో 631 వంతెనల నిర్మాణం చేపట్టింది. కొత్తగా ఆర్.ఓ.బీలను నిర్మించింది.

  • గోదావరి, ప్రాణహిత నదుల వెంట ప్రత్యేక రహదారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వరకు విస్తరించిన అటవీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా గోదావరి, ప్రాణహిత నదుల వెంట మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకుంది. ఈ రహదారి నిర్మాణం అవసరాన్ని నొక్కి చెప్పి, కేంద్రం నుంచి కూడా ఈ రహదారి నిర్మాణానికి తనవంతు ఆర్థిక మద్దతు అందించేలా ఒప్పించింది. రూ.546.96 కోట్ల వ్యయంతో భద్రాచలం సమీపంలోని సారపాక నుంచి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల వరకు దాదాపు 350 కి.మీ. మేర కొత్త రహదారి నిర్మిస్తున్నది. గోదావరి, ప్రాణహిత వెంట నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలోని అటవీ ప్రాంతాల ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.

  • గణనీయంగా జాతీయ రహదారుల విస్తరణ

సమైక్య పాలనలో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి తెలంగాణలో కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. 2014 జూన్ 2 నాటికి జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుంటే, తెలంగాణ రాష్ట్రం సగటు కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవను చూపింది. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ అవసరాన్ని కేంద్రానికి చెప్పింది. కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి,

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసింది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగున్నరేండ్లలో అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్ వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా, దేశ సగటును మించింది. ఇవేకాకుండా రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల వ్యయం కాగల మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

  • ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్ అండ్ బి పరిధిలో 24, 495 కిలోమీటర్ల రహదారులున్నాయి. 2,552 కిలోమీటర్ల స్టేట్ హైవేలు, 11,967 కిలోమీటర్ల జిల్లా రహదారులు, 10,335 కిలోమీటర్ల ఇతర రహదారులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం రహదారుల్లో 16,864 కిలోమీటర్ల రహదారులు, అంటే 70 శాతం రోడ్లు సింగిల్ లేన్ రోడ్లుగానే ఉన్నాయి. ఇవి పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చలేకపోయాయి.

ఈ  పరిస్థితిని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో ఆర్ఓబీలతోపాటు పెద్దఎత్తున వంతెనల నిర్మానాలు కూడా చేపట్టింది. రూ.7,029 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఆర్ అండ్ బి పరిధిలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టింది. 16,864 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చుతున్నారు. 9,731 కిలోమీటర్ల రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో 511 వంతెనల నిర్మాణం చేపట్టగా,259 వంతెనల నిర్మాణం పూర్తయింది.

Advertisement
  • పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం

రాష్ట్రంలో 67,714 కిలోమీటర్ల పంచాయతీ రాజ్ రహదారులున్నాయి. ఇందులో 31,144 కిలోమీటర్ల రహదారులు మట్టి, మొరం రోడ్లు. 13,103 కిలో మీటర్లు కంకర రోడ్లు. మిగతా 23,467 కిలోమీటర్లు బీటీ రోడ్లయినా అవన్నీ అధ్వాన్న స్థితిలో ఉండేవి. మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడంతోపాటు, అద్వాన్నంగా ఉన్న బీటీ రోడ్లను మొరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2014 నుంచి జనవరి 2019 నాటికి పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 9,807 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 10 వేల కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా జనవరి 2019 నాటికి  8,042 కిలోమీటర్ల పని పూర్తయింది. 15,958 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమత్తులు చేపట్టగా, 14,583 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. 511 వంతెన నిర్మాణం చేపట్టగా జనవరి 2019 నాటికి 312 వంతెనలు పూర్తయ్యాయి. 199 వంతెనల నిర్మాణ పనులు వివిధ దశల్లో వున్నాయి. ఈ వంతెనల వద్ద నీటి నిల్వలకు వీలుగా 312 చెక్ డ్యాములు నిర్మించారు. మరో 1235 చెక్ డ్యాములు నిర్మించాల్సి ఉంది. 346 బ్రిడ్జిల పని పూర్తయింది. మిగిలిన రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నది. రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2020-21 బడ్జెట్లో గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం రూ.600 కోట్లు కేటాయించారు.

నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు

ఎక్కడి నియోజక వర్గ ప్రజా ప్రతినిధి అక్కడే ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ప్రజల సందర్శన సమయంలో విశాలమైన నివాసాలను నిర్మించాలనే ప్రభుత్వ యోచన ప్రజలనుంచి మన్ననలను అందుకున్నది. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వం భవనాలు నిర్మిస్తున్నది. దీనివల్ల ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా, ప్రజలతో తరచూ మమేకమవడానికి అవకాశం కలుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే మకాం పెడుతుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజలు వ్యయ, ప్రయాసలకోర్చి రాజధానికి రావాల్సి వస్తోంది. దీన్ని నివారించి, ఎమ్మెల్యేలకు కూడా వసతిగా ఉండేలా ఈ భవనాల ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం. ఒక్కోటి కోటి రూపాయల వ్యయంతో 500 గజాల విస్తీర్ణంలో 104 క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణం మొదటి అంతస్తులో మీటింగు హాల్, ఎమ్మెల్యే కార్యాలయం, వీఐపీలాంజ్, అతిథులు వేచి ఉండే గదులు, పీఏ, పీఎస్‌లకు ప్రత్యేక గదులు, రిసెప్షన్, భద్రతా అధికారులకు గదులు వుంటాయి. రెండవ అంతస్తులో మాస్టర్ బెడ్‌రూం, పిల్లల బెడ్‌రూం, డైనింగ్ కం లివింగ్ స్టోర్స్, టాయ్‌లెట్లు, సిట్‌అవుట్, పూజగది వుంటాయి. మొత్తం రెండు అంతస్తుల్లో ఈ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

Advertisement

మౌలిక సదుపాయాలు

మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది.

ప్రతీ ఇంటికి ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందించడానికి ‘మిషన్ భగీరథ’

స్వతంత్ర్యం సిద్దించి ఏడు దశాబ్దాలు దాటినా చాలా ప్రాంతాల్లో ప్రజలు మంచీనీటికి అలమటించారు. పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. మారుమూల పల్లెలు, ఆదివాసీ గూడేలు, లంబాడి తండాలు, ఎరుకుల వాడలు తదితర ఆవాస ప్రాంతాలకు మంచినీటి భాగ్యమే కలగలేదు. ఎండాకాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ప్రధాన ఆవాసాలకు కూడా ప్రతీ రోజు మంచినీటి సరఫరా జరిపే పరిస్థితి లేదు. దీంతో ప్రజలు మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి, వ్యవసాయ బావుల వద్ద, చెరువుల వద్ద, నదుల చెలిమల ద్వారా మంచినీరు తెచ్చుకునే వారు. ఈ అవస్థలు గమనించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సురక్షిత మంచినీరు ఇవ్వడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం అని  ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రతీ ఇంటిలో నల్లా ద్వారా మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం చేపట్టింది. తెలంగాణకు ఇరువైపులా ఉన్నా గోదావరి, కృష్ణా నదుల ద్వారా నీటిని తోడి, వాటిని శుద్ధి చేసి, ప్రతీ రోజు ప్రతి ఇంటికి నల్లా ద్వారా అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Advertisement

మిషన్ భగీరథ స్వరూపం : రూ.43,791 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించారు. 67 ఇన్ టేక్ వెల్స్, 153 నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు, 1 లక్ష 40 వేల కి.మీ. పైప్ లైన్లతో, 35,514 ఓ.హెచ్.ఆర్. ల ద్వారా పల్లెకు, పట్టణానికి, ప్రతీ ఇంటికీ భగీరథ నీరు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, మిషన్ భగీరథ  పథకం ద్వారా జనవరి 2019 నాటికి రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు బల్క్ గా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ ఆవాసాల్లో మొత్తం సుమారు 55.62 లక్షల ఇండ్లు ఉన్నాయి. తెలంగాణ చూపిన దారిలో ఈ పథకం అమలు చేయడానికి 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడం మంచిదని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఇది మిషన్ భగీరథకు దక్కిన గొప్ప ప్రశంస.

మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోడీ

మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని నరేంద్రమోడీ మిషన్ భగీరథ పథకాన్ని 2016 ఆగస్టు 7న ప్రారంభించారు. మిషన్‌ భగీరథ పైపుల ద్వారా ప్రతీ ఇంటికి మంచినీళ్లు ఇవ్వడంతోపాటు, ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 2 కోట్ల 72 లక్షల (రూరల్- 2.17 కోట్లు/అర్బన్ -54.51 లక్షలు) మందికి మంచి నీరందనుంది. రూరల్ ప్రాంతాల్లోని 24,248 ఆవాస ప్రాంతాలకు 52.47 లక్షల నివాసాలకు, 65 అర్బన్ ఏరియాల్లోని  12.83 లక్షల నివాసాలకు నీరందనుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 7  అర్బన్ లోకల్ బాడీలు, రూరల్ ప్రాంతాల్లోని 183 ఆవాస గ్రామాలకు ఈ పథకం ద్వారా నీళ్లందించనున్నారు.

Advertisement

మారుమూల జనావాసాలకు కూడా పైపు లైన్లు : గిరిజన తండాలు, ఎస్సీ వాడలు, గోండు గూడేలు, అటవీ ప్రాంతాల్లోని మారుమూల జనావాసాలకు కూడా  పైప్ లైన్ల ద్వారా మంచినీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 65 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రాజెక్టు పూర్తి చేసిన కాంట్రాక్టర్లే పదేండ్లు నిర్వహణ చేపట్టేలా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. 

మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీరు:  మిషన్ భగీరథ ద్వారానే పరిశ్రమలకు కూడా శుద్ధిచేసిన మంచినీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీరు అవసరం ఉన్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని అదేశించారు. మిషన్ భగీరథకు కేటాయించిన 80 టి.ఎం.సిల నీటిలో పది శాతం (8 టిఎంసీలు) పరిశ్రమలకు అందించనున్నారు.హైదరాబాద్ నగర మంచినీటి అసవరాల కోసం పది టిఎంసీల డెడికేటెడ్ రిజర్వాయర్ కడుతున్నారు. అక్కడినుంచి పరిశ్రమలకు నీరు అందించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్ భగీరథ ద్వారానే మొత్తం నీటిని సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు.

పేదలు ఆత్మగౌరవంతో జీవించడానికి ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు’

Advertisement

కూడు, గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. నాగరికత అభివృద్ధి చెందిన నేటి కాలంలో అవి ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనాలు. ఏదో ఒకటి అనే స్థాయినుంచి తాము కోరుకున్నదే ఎంచుకునే స్థాయికి సమాజం చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో పేదలకు నివాసం అంటే చాలీ చాలని ఇరుకు గది కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. మొదటి దశలో 2,72,763 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అవి నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇండ్ల స్వరూపం – మౌళిక సదుపాయాలు: తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నివాసయోగ్యంగా, వారి ఆత్మ గౌరవం కాపాడేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు (560 చదరపు అడుగులు) నిర్మించి ఇస్తున్నది. ఈ డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు, హాలు, వంటగది, 2 టాయిలెట్లు ఉంటాయి. ప్రత్యేక కాలనీల్లో కొత్తఇండ్లను నిర్మిస్తున్నారు. మోడల్‌ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లు, ప్రతీ ఇంటిముందూ మొక్కలు నాటుతున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతీఇంటికి వేర్వురుగా మెట్లు, వాటర్‌ట్యాంక్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. 

ఒక్కో యింటికి అయ్యే ఖర్చు : ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూరల్ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు ఖర్చు చేస్తున్నది. వీటిలో రూ. 5.04 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.1.24 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, జిహెచ్ఎంసి పరిథిలో రూ.7 లక్షలు (జి+3), రూ. 7.9 లక్షలు (సి+ఎస్+9) ఖర్చు చేస్తున్నది. మోడల్ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకి ఇరువైపులా చెట్లు, ప్రతి ఇంటిముందు మొక్కలు నాటుతున్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!