HomeLATESTతెలంగాణ పట్టణ ప్రగతి

తెలంగాణ పట్టణ ప్రగతి

పట్టణాల దిశ మార్చుతున్న ‘పట్టణ ప్రగతి’

Advertisement

రెండు విడతలుగా 40 రోజుల పాటు సాగిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం స్పూర్తితో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ మినహా అన్ని నగరాలు, పట్టణాల్లో 2020 ఫిబ్రవరి 24 నుంచి ‘పట్టణ ప్రగతి’ ప్రారంభమయింది. తెలంగాణ పట్టణాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచడం, పట్టణాల ప్రగతి ప్రణాళిక రూపొందించడం లక్ష్యంగా ‘పట్టణ ప్రగతి’ ద్వారా మంచి ఒరవడి ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించారు. వార్డుల వారీగా పచ్చదనం-పరిశుభ్రదత పెంచే కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వార్డుల వారీగా అవసరాలను గుర్తించి, మొత్తంగా ఆయా పట్టణాల అవసరాల ప్రాతిపదికన వార్షిక/పంచవర్ష ప్రణాళికలు తయారు చేశారు.

పట్టణ ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు

  • పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో జరిగింది.
  • అన్ని పట్టణాల్లో దళిత వాడల నుంచి కార్యక్రమం ప్రారంభమయింది.
  • ప్రతీ వార్డుల నాలుగు ప్రజా సంఘాలను నియమించారు. ఈ కమిటీల్లో యువత, మహిళలు, సీనియర్ సిటిజన్స్, ప్రముఖులకు ఒక సంవత్సరం ప్రాతిపదికగా స్థానం కల్పించారు. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులుంటారు. ఇలా ప్రతీ వార్డుకు 60 మంది చొప్పున ప్రజాసంఘాల సభ్యులున్నారు.
  •  కార్యక్రమం మొదటి రోజున కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో వార్డు కమిటీల్లో సభ్యులైన యువత, మహిళలు, సీనియర్ సిటిజన్స్, ప్రముఖులకు వారి విధులకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వార్డుల్లో తిరిగి ఆయా వార్డుల అవసరాల మేరకు పట్టణ ప్రగతిలో పేర్కొన్న నియమావళి ఆధారంగా ప్రణాళిక రూపొందించుకున్నారు.
  • అన్ని పట్టణాల్లో వార్డుల వారీగా అవసరాలను గుర్తించారు. దాన్ని పట్టణ వార్షిక/పంచవర్ష ప్రణాళికలో పొందుపరిచారు.
  • ఆర్థిక ప్రణాళిక తయారీకి సంబంధించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అధికారులు అవగాహన కల్పించారు.
  • పట్టణంలో పచ్చదనం పెంచడానికి హరిత ప్రణాళిక రూపొందించారు. ఏ వార్డులో ఎక్కడ ఎన్ని మొక్కలు నాటాలో నిర్ధారించుకున్నారు.
  • ఖాళీ స్థలాలు, పార్కులు, నీటి వసతులున్న ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న మున్సిపాలిటీల్లో నర్సరీల ఏర్పాటు సాధ్యంకాని పక్షంలో జిల్లా కలెక్టర్ల సారథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సంబంధిత మున్సిపాలిటీల సరిహద్దుల్లో ఉన్న పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు.
  • ఇల్లు, వీధులు, బ్లాకులు, కమ్యూనిటీలు, కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకం, మొక్కల పెంపకానికి అవసరమైన స్థలాల గుర్తింపు, మొక్కల జాతులను గుర్తించారు.
  • వార్డుల్లో ఉండే పొదలను, శిథిలాలు, చెత్తా చెదారం తొలగించారు. మురుగును శుభ్రం చేశారు. ఓపెన్ ప్లాట్లలో ఉన్న చెత్తా చెదారం, శిథిలాలను తొలగించి చదును చేశారు.
  • ప్రజోపయోగ స్థలాలు, ప్రజోపయోగ సంస్థలు మరియు సామాజిక(కమ్యూనిటి) స్థలాలను శుభ్రం చేశారు.
  • నిరుపయోగమైన బావులు, బోర్ వెల్స్ ను పూడ్చివేశారు.
  • పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలను గుర్తించారు
  • పారిశుద్ధ్య పనులకు చేపట్టడానికి అవసరమైన వాహనాలను అంచనా వేశారు. వాహనాలను కొనుగోలు చేసి సంబంధిత శాఖలకు పంపించారు. చెత్త సేకరణ, రవాణా వంటి అవసరాలకు వీలుగా వీటిని వర్గీకరించారు.
  • మురికి గుంటలను గుర్తించారు. పూడ్చడానికి ప్రతికూలంగా ఉన్న నీటి గుంతల్లో ప్రతీవారం యాంటి లార్వల్ బాల్స్ (దోమల లార్వాను నశింపచేసే గుళికలు)ను చల్లుతున్నారు.
  • వీధులు, కూడళ్ళలో ముళ్లపొదలు తొలగించి వాటి స్థానంలో మొక్కల పెంపకం ప్రారంభించారు.
  • వంగిన, తుప్పు పట్టిన స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. కెరంటు మీటర్లకు అమర్చిన లూజ్ వైర్లను రిపేరు చేసి, మోటార్లకు కొత్త కెపాసిటర్లను బిగించారు.
  • ఫుట్ పాత్ లపై ఉన్న కరెంటు స్తంభాలను గుర్తించి వాటిని సరిచేశారు. ట్రాన్స్ ఫార్మర్ల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు.
  • పార్కులు, మరుగుదొడ్లు, కూడళ్ళలో వీధి దీపాల ఏర్పాటు పై ఓ అంచనాకు వచ్చారు.
  • అదనంగా ఎక్కడెక్కడ కరెంటు స్తంభాలను అమర్చాలో గుర్తించారు.
  • విద్యుత్ డిపార్టుమెంటు సహకారంతో మూడో కరెంటు వైరును ఏర్పాటు చేశారు. రోడ్ల పై ఉన్న కరెంటు స్తంభాలను గుర్తించారు. ఇళ్ల పై నుంచి పోతున్న కరెంటు వైర్లను గుర్తించి విద్యుత్ శాఖకు నివేదిక సమర్పించారు.
  • శ్మశానవాటికల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించారు
  • సమీకృత మార్కెట్ల స్థాపనకు అవసరమైన స్థలాలను గుర్తించారు.
  • పార్కులు, క్రీడాస్థలాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారు
  • దహనవాటికల స్థితిగతులు, వైకుంఠధామాల ఏర్పాటు పై స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.
  • గ్రీన్ లంగ్ స్పేస్ ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు
  • డంపింగ్ యార్డులు/మురుగునీటి శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి, భూ సేకరణ చేశారు.
  • ఏ పట్టణానికి ఎన్ని వైకుంఠ ధామాలు అవసరమో నిర్ణయించి, వాటి నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేశారు.
  • ఆటో, రిక్షా స్టాండ్లు, వీధి మార్కెట్ ల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
  • ఏ పట్టణానికి ఎన్ని వెజ్/నాన్ వెజ్ మార్కెట్లుండాలో నిర్ణయించారు. వాటి నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేశారు.
  • ప్రభుత్వం తెచ్చిన కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు.                

‘పల్లె ప్రగతి’ పురోగతి

Advertisement

దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కావడానికి పల్లె ప్రగతి కార్యక్రమం దోహపడింది. పల్లెప్రగతి మొదటి దశ కార్యక్రమం 2019 సెప్టెంబర్ 6 నుంచి 30 రోజుల పాటు సాగింది. రెండో విడత కార్యక్రమం 2020 జనవరి 2 నుంచి 12 వరకు సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత పెంచే  విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

  • పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 12,455 గ్రామాల్లో డంపు యార్డులు గుర్తించారు. 11,657 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.
  • 11,366 గ్రామాల్లో వైకుంఠ ధామాలు,  స్థలాలు గుర్తించారు, 9,017 గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయి.
  • చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త సేకరణకు ఉపయోగపడేలా 9,331 గ్రామాలకు ట్రాక్టర్లు సమకూరాయి. మిగిలిన గ్రామాలకు త్వరలోనే ట్రాక్టర్లు రానున్నాయి.

పల్లెలు, పట్టణాలకు ఆర్థిక సంఘం నిధులు

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రూపొందిచుకున్న ప్రగతి ప్రణాళిక సరిగ్గా అమలు కావడం కోసం ప్రభుత్వం కూడా తన చొరవను ప్రదర్శించింది. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ.339 కోట్ల చొప్పున, పట్టణాల అభివృద్ధికి నెలకు రూ.148 కోట్ల చొప్పున ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నది. ఇప్పటికే పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఖాళీలన్నీ భర్తీ చేసింది. ప్రతీ గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని, ప్రతీ మండలానికి ఒక ఎంపిఓను, ప్రతీ డివిజన్ కు ఒక డిఎల్పివోను, ప్రతీ జిల్లాకు ఒక డిపిఓను ప్రభుత్వం నియమించింది. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచింది. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు సమకూర్చుకునే వెసులుబాటు కల్పించింది. అన్ని మున్సిపాలిటీలలో అవసరమైన అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని నియమిస్తున్నది.

Advertisement

కర్తవ్యబోధ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

పది రోజులపాటు నిర్వహించే ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 18న జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్లు, కమిషనర్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్న ఈ సదస్సులో ‘పట్టణ ప్రగతి’ నిర్వహణపై కూలంకశంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, అర్థం చెప్పి కార్యోన్ముఖులను చేశారు.

 ‘‘మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నటువంటివి. బ్రిటిష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి. అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాము. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమైపోయాము. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగు స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సిఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేసాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. అవగాహతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. మీరంతా ధీరులు కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Advertisement

‘‘మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా .. ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి, అడ్డదిడ్డంగా ఎటుపడితే అటు కాదు. అది మీ చేతుల్ ఉంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్ లో చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టనాలు మంచి దారి పడతాయి. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ప్రగతికాముకంగా ముందుకు సాగాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టనాలను మనమే మార్చుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

చివరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనుగు లక్ష్మణకవి రాసిన పద్యాన్ని చదివారు. మేయర్ల, చైర్ పర్సన్లు, అధికారులు అనుకున్న లక్ష్యం సాధించి, ఉత్తములుగా నిలవాలని ఆకాంక్షించారు.

Advertisement

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై

Advertisement

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్

(ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!