HomeLATESTతెలంగాణ హరితహారం

తెలంగాణ హరితహారం


ప్రత్యేక రాష్ట్రం సిద్దించాక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో హరితహారం ఒకటి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు… తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. తెలంగాణను అందమైన, ఆరోగ్యకరమైన, అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చాలనే ప్రయత్నమే తెలంగాణకు హరితహారం. ప్రస్తుతం పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించటం, రానున్న తరాలకు ఆస్థి, ఐశ్వర్యాల కంటే మంచి ఆరోగ్యకరమైన వాతావారణాన్ని అందించటమే లక్ష్యంగా హరితహారం కొనసాగుతోంది. ఇప్పటికే ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం, వరుసగా ఆరవ ఏడాదిలోకి అడుగుపెట్టింది. గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు, ప్రభుత్వ సంకల్పం, సమాజంలో అన్ని వర్గాల సహకారంతో ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతోంది. అన్ని రోడ్ల వెంట రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్) ఏపుగా పెరుగుతూ ఆకర్షిస్తున్నాయి. వీధులు, గ్రామాలు పచ్చదనం యుద్దంలో తమవంతు పాత్ర పోషించటంతో ఆ ప్రాంతాలు పచ్చగా మారుతున్నాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలోనూ పచ్చదనం గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అని స్పష్టం చేసింది. కంపా నిధుల సద్వినియోగంతో ప్రత్యామ్యాయ అటవీకరణ పద్దతులు, సహజ అటవీ పునరుద్దరణ పథకాల్లోనూ తెలంగాణ అగ్రగామిలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీటి లభ్యత పెరగటం హరితహారానికి అందివచ్చే వరమే. మరింత సమర్థవంతంగా మెట్ట భూముల్లోనూ మొక్కలు పెంచేందుకు, వాటి రక్షణకు కాలేశ్వరం అదరపు వనరు కానుంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్థేశించుకున్నప్పటికీ, క్షేత్ర స్థాయి నివేదికలు, సిబ్బంది ద్వారా మంచిచెడులు తెలుసుకున్న ప్రభుత్వం అంచనాలు సవరించింది. మొక్కలు నాటే లక్ష్యాన్ని గ్రామ స్థాయి యంత్రాంగమే నిర్దేశించుకునేలా ఆదేశించింది. గ్రామాల్లో సామాజిక స్థలాలను గుర్తించటం, అవసరమైన మొక్కల సంఖ్యలతో పాటు, ఏరకమైన మొక్కలు కావాలో ఇక ఆయా గ్రామాల్లోనే నిర్ణయం జరగనుంది. అదే విధంగా మండల, జిల్లా స్థాయి లక్ష్యాలు ఖరారు అవుతాయి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా అటవీ అధికారి నోడల్ అధికారిగా, గ్రామీణాభివృద్ది శాఖ అధికారితో పాటు సంబంధిత శాఖల అధికారులతో కూడిన కమిటీ ఈ లక్ష్యాలను మదింపు చేసి, ఆమోదిస్తాయి. ప్రతీ జిల్లాలో అందుబాటులో ఉన్న నర్సరీలు, వాటిల్లో లభిస్తున్న మొక్కల సంఖ్య, రకాలు, ఆయా నర్సరీల సమాచారంతో కూడిన నర్సరీ డైరక్టరీలను సిద్దం చేసి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
ఇప్పటికే ఐదు దశల్లో పూర్తయిన తెలంగాణకు హరితహారం వివరాలు  
2015-16 – నాటిన మొక్కలు 15.86 కోట్లు                                                   
2016-17 –  నాటిన మొక్కలు 31.67 కోట్లు 2017-18 –  మొక్కలు 34.07 కోట్లు 2018-19 – నాటిన మొక్కలు 32 కోట్లు      
2019-20 నాటిన మొక్కలు- 38.18 కోట్లు
గత ఐదేళ్లలో నాటిన మొత్తం మొక్కలు – 151.77 కోట్లు
అటవీ పునరుద్దరణ కోసం అడవుల్లో నాటినవి- 30.97 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా నాటిన మొత్తం మొక్కలు – 182.74 కోట్లు

గత ఐదు విడతల హరితహారం – వివరాలు ;
హరితహారం కార్యక్రమం 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభమైంది. 
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటి,పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2015-16 లో 40 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా… వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 15.86 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. 
కార్యక్రమం ప్రారంభమైన మరుసటి ఏడాది అంటే.. 2016-17 లో వర్షాలు మెరుగ్గా కురవడంతో 31.67 కోట్ల మొక్కలు నాటారు.  విజయవాడ హైవే పై 163 కిలో మీటర్ల పొడుగునా మానవహారంగా హరితహారం జరిగింది, సీ.ఎం కేసీయార్ చిట్యాల సమీపంలో జులై 8 న రెండో విడత హరితహారం ప్రారంభించి, పాల్గొన్నారు.  నేషనల్ హై వే వెంట నాటిన ఈ మొక్కలన్నీ గత మూడేళ్లలో పెరిగి పెద్దవై అహ్లాదాన్ని పంచుతున్నాయి. విజయవాడ జాతీయ రహదారి వెంట ప్రయాణం చేస్తున్న ప్రతీ ఒక్కరూ మొక్కల పెంపకంలో అటవీ శాఖ కృషిని ప్రశంసిస్తున్నారు. 
 
హరితహారం 3 వ దఫా మొక్కలు నాటే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై 12, 2017 న కరీంనగర్ లో ప్రారంభించారు.  పట్టణంలో లక్ష మొక్కలు నాటడం, పెంచటం దీని ద్వారా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కోట్ల మొక్కలు నాటడం పూర్తయింది.
హరితహారం నాలుగో విడత మఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఒకే రోజు లక్షకు పైగా మొక్కలు నాటడం ద్వారా ఆగస్టు ఒకటిన – 2018 అధికారికంగా మొదలైంది. 
హరితహారం ఐదవ విడత 2019 వర్షాకాలం సీజన్ తో ప్రారంభమైంది. లక్ష్యాలను సవరిస్తూ గ్రామ అవసరాలకు తగిన రీతిలో మొక్కలునాటేలా అదేశం. పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారం. గ్రామీణాభివృద్ది శాఖను దీనిలో క్రియాశీలం చేసిన ప్రభుత్వం. అన్ని నియోజకవర్గాల్లో అటవీ పునరుద్దరణ చేపట్టాలని నిర్ణయించిన సీ.ఎం కేసీయార్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే దీనిని ప్రారంభించారు. మంచి ఫలితాలు రాబట్టి స్వయంగా తానే అన్ని జిల్లాల కలెక్టర్లను తీసుకువెళ్లి పునరుద్దరించిన అడవులను చూపించారు.
హరితహారం ఆరవ విడతను జూన్ 20 నుంచి ప్రారంభించాలని, తగిన సన్నాహకాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం.
ఆరవ విడత తెలంగాణకు హరితహారం – ప్రత్యేకతలు ;

  1. జంగల్ బచావో – జంగల్ బడావో (అడవిని కాపాడుదాం – అడవిని విస్తరిద్దాం) నినాదం. 
  2. ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యత, రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపు. 
  3. వర్షాలకు అనుగుణంగా జిల్లాల్లో ఆరవ విడత హరితహారం కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశాలు.   
  4. ఈ విడతలో గంధం, టేకు, వెదురు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత. 
  5. ప్రతీ జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచటం.
  6. గ్రామం, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలకు అటవీ శాఖ సాంకేతిక సహకారం. నర్సీలు, మొక్కల సందర్శనకు వెళ్లినప్పుడు తప్పని సరిగా స్థానిక ప్రజా ప్రతినిధిని కలవనున్న ఫారెస్ట్ సిబ్బంది.
  7. స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్ లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో హరితహారం. 
  8. ప్రతీ నియోజకవర్గంలో ఉన్న అడవుల పునరుద్దరణ లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు పనిచేయటం.
  9. ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వటం, బాధ్యతగా పెంచేలా పంచాయితీల పర్యవేక్షణ. 
  10. కోతుల బెడద నివారణ కోసం ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళికలు. (monkey food courts- Wild Fruit bearing)
  11. వానలు వాపస్ రావాలి – కోతులు అడవులకు వాపస్ పోవాలనే లక్ష్యం. 
  12. గత ఐదు విడతల్లో నాటిన ప్రాంతాల్లో చనిపోయిన, సరిగా ఎదగని మొక్కలను గుర్తించి మార్పు చేయటం. (గ్యాప్ ఫిల్లింగ్)
  13. కేంద్ర ప్రభుత్వ బ్యాంబూ మిషన్ ( వెదురు ప్రోత్సాహక సంస్థ) సహకారంతో చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరుగా వెదురు పెంపకం హరితహారం కింద ప్రోత్సాహం. 
  14. హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్రత్యేకంగా హరితహారం,  పట్టణ ప్రాంత వాసులకు స్వచ్చమైన గాలిని అందించే ప్రాంతాలుగా 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ది. (35 పూర్తి అయ్యాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి)

ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చేవి, పండ్లు- పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా గత ఐదేళ్లుగా నాటారు.  అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు,  పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు నాటారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా అందరూ  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-ముంబాయి, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-నాగపూర్ వంటి జాతీయ రహదారుల కిరువైపులా పెద్ద పూల చెట్లు నాటారు. ఈ సారి కూడా ఈ రహదారుల వెంట మిగిలిన ప్రాంతాల్లో హరితహారం చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు, ప్రతీ గ్రామానికి దారి తీసే రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, అన్ని పంచాయితీ రోడ్లు వెంట నీడను ఇచ్చే మొక్కలతో పాటు, పూలతో ప్రయాణం అహ్లాదంగా ఉండాలనే స్ఫూర్తితో ఈ ప్రణాళిక అమలు కానుంది. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 7, 409 కిలో మీటర్ల మేర రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తయింది. 
కొత్త పంచాయితీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వ పచ్చదనం పెంపు, మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేస్తూ, ప్రతీ గ్రామ పంచాయితీకి  ఒక నర్సరీ ఏర్పాటును కూడా ప్రతిపాదించింది.  గత ఏడాది నుంచి గ్రామానికి ఒక సర్సరీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం 12, 571 గ్రామ పంచాయితీలకు గాను, 11, 941 నర్సరీల ఏర్పాటయ్యాయి. అటవీ పునరుజ్జీవన చర్యల్లో భాగంగా క్షీణించిన అడవులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  తెలంగాణ నేలలు, అడవులకే ప్రత్యేకమైన స్థానిక జాతుల మొక్కలను నాటడం ద్వారా అటవీ పునరుజ్జీవన ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
అలాగే హరితహారంలో సుమారు 34 శాఖల దాకా పాల్గొంటున్నాయి. వర్షాల సీజన్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనే హడావిడి చేయటం మాత్రమే కాకుండా, ఏడాది పొడగునా మొక్కల సంరక్షణకు ఆయా శాఖలు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రక్షణ చర్యలు చేపట్టడం, నీటి సౌకర్యం కల్పించటం, మొక్కలు నాటిన ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేయటం, అటవీ శాఖ నివహిస్తున్న వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయటం చేయాలని, తద్వారా నిరంతరం పర్యవేక్షణ సాధ్యం అవుతుందని శాఖాధిపతులకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతీ నెలా ఆ మొక్కల ఎదుగుదలను, బతికిన మొక్కల శాతాన్ని నమోదు చేయాలని సూచించారు.  ప్రతీ డిపార్ట్ మెంట్ ప్రాంతాల వారీగా కొందరు ఉద్యోగులతో బృందాలను ఏర్పాటు చేసి, వారంలో ఒక రోజు మొక్కల (ప్రతీ శుక్రవారం – గ్రీన్ ఫ్రైడే) పర్యవేక్షణకు కేటాయించాలని తెలిపారు. అలాగే గత ఐదేళ్లుగా మొక్కలు నాటిన ప్రాంతాల్లో, చనిపోయిన మొక్కలను గుర్తించి కొత్త వాటిని నాటాలని (గ్యాప్ ఫిల్లింగ్) తెలిపారు. 
మొక్కలను నాటడమే కాకుండా…. వాటి సంరక్షణ బాధ్యతను సైతం తెలుసుకునేలా ప్రతీ ప్రాంతంలో ఒక బాధ్యతతో కూడిన టీమ్ లను నియమించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టింది గ్రీన్ బ్రిగేడ్. నాటిన మొక్కల సంరక్షణ స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రత్యేకంగా కోరుతోంది.  అన్ని ప్రాంతాల్లో గ్రీన్ బ్రిగేడ్ లను ఏర్పాటు చేసి సంరక్షణ బాధ్యతలు అప్పగించారు.
 అదే విధంగా పెద్దఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు వివిధ విభాగాల కోటాల నుంచి ప్రత్యేక నిధులను కేటాయించి ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చెట్లు ఉంటేనే వానలు పడతాయని, మొక్కలు నాటడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్న అవగాహన ప్రజలలో పెంచేందకు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మొక్కలు నాటే పౌరులకు, యువజన, ప్రజా సంఘాలను, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తోంది.  హరిత మిత్ర అవార్డుల ద్వారా మొక్కలు నాటేవారికి ప్రోత్సహించడమే కాకుండా… లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందిస్తోంది.  

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!