HomeLATESTతెలంగాణ నయా పరిపాలన

తెలంగాణ నయా పరిపాలన

పరిపాలనా సంస్కరణలు

Advertisement

తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది.

  1. కొత్త జిల్లాల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో 2016 అక్టోబర్ కు ముందు 10 జిల్లాలుండేవి. కొత్తగా మరో 23 జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33 వరకు పెరిగింది.

ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉంది. దీనివల్ల పరిపాలన కూడా కష్టతరమయ్యేది. 2016 అక్టోబర్ వరకు కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు పోవాలంటే 200 నుంచి 250 కి.మీ.ల దూరం వుండేది. దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఒక్కో జిల్లాలో కుటుంబాల సంఖ్య 10 లక్షలుండేది. ఎవరి పరిస్థితి ఏంటో తెలుసుకోవడం అధికారులకు కష్టం అయ్యేది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ ఎంతో కష్టమయ్యేది. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం కూడా అధికారులకు కష్టంగా వుండేది.

Advertisement

 ఈ సమస్యలను అధిగమించటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తొలుత పాత 10 జిల్లాలకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది.  మొత్తం 33 జిల్లాలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి.

కొత్త మున్సిపాలిటీలు – కార్పోరేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నది. పట్టణాలు, నగరాల్లో జనాభా పెరుగుతున్నది. పట్టణ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాలు కూడా పట్టణాల్లో అంతర్భాగమై పోతున్నాయి. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పునర్వ్యవస్థీకరించింది. జనాభా ఎక్కువ ఉన్న, పట్టణ స్వభావం కలిగిన పెద్ద గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చింది. 322 గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఏడు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ చేసింది.

Advertisement
  • 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం కొత్తగా మరో 76 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది.  
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్తగా మరో 7 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.
  • దీంతో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లతో కలిపి మొత్తం 141 అర్బన్ లోకల్ బాడీలు (పట్టణ స్థానిక సంస్థలు) ఉన్నాయి.

కొత్త రెవెన్యూ డివిజన్లు (43+30=73)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తూనే రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా 43 నుంచి 73 వరకు పెంచింది. తొలుత 2016లో పాత 43 రెవెన్యూ డివిజన్లకు కొత్తగా మరో 26 రెవెన్యూ డివిజన్లు 43+26=69 ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో ఏడాదికి కొత్తగా 7 ఫిబ్రవరి, 2019న మరో రెండు (కొల్లాపూర్, కోరుట్ల) రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడంతో (మొత్తం 69+2= 71) రెవెన్యూ డివిజన్లు అయ్యాయి. 3 ఫిబ్రవరి 2020న సంగారెడ్డి జిల్లా జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడలను కూడా రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మొత్తం రెవెన్యూ డివిజన్లు 71+2=73 వరకు పెరిగాయి. 

కొత్త మండలాల ఏర్పాటు (459+131= 590)

Advertisement

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 459 మండలాలు ఉండేవి. కొత్తగా 131 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం మండలాలు (459+131= 590) వరకు పెరిగాయి.

సమీకృత జిల్లా కలెక్టరేట్లు & జిల్లా అధికారుల కార్యాలయాలు

రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు(డీపీవో)లు ప్రభుత్వం నిర్మిస్తున్నది. 26 జిల్లాల్లో ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కూడిన కలెక్టర్ కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ కలెక్టరేట్ల నిర్మాణానికి 2017-18 బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. జిల్లా కేంద్రాల్లో పోలీస్‌, ఫైర్‌ కార్యాలయాలు మినహా మిగతావన్ని ఒకేచోట ఉండేలా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ దిశగా రూ.1,337 కోట్ల మొత్తం వ్యయంతో 26 సమీకృత జిల్లా కలెక్టరేటు కాంప్లెక్సులు, 13 సమీకృత జిల్లా పోలీసు కాంప్లెక్సులు, 2 పోలీసు కమిషనరేట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. జిల్లాల్లో అందుబాటులోని స్థలాన్ని బట్టి, జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయాలను 20 నుంచి 30 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ కార్యాలయాలు, జిల్లా పోలీస్ విభాగం నిర్వహణ అధికారుల చాంబర్లు, ఏఆర్ హెడ్‌క్వార్టర్లు, పరేడ్‌గ్రౌండ్, శిక్షణ తరగతులు, డిజిటల్‌ల్యాబ్‌లు, కాన్ఫరెన్స్‌హాళ్లు, సిబ్బందికి బ్యారెక్స్ నిర్మిస్తారు. పరిపాలక పున:వ్యవస్థీకరణ వల్ల జిల్లాలో కార్యాలయాల సంఖ్య 21,208 నుండి 26,846 కు పెరగడం వల్ల అదనంగా 5,638 నూతన కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి అక్టోబర్ 11, 2017న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపనలు చేశారు. 2016 అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి ఏడాది పూర్తయిన సందర్భంగా 2017 అక్టోబర్ 11న సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు, పోలీస్ కమిషనరేట్ భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మిగతా చోట్ల మంత్రులు శంకుస్థాపన చేశారు. 2017 అక్టోబర్ 12న సూర్యాపేటలో సిఎం కేసీఆర్ కొత్త జిల్లా కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 18 సమీకృత కలెక్టరేట్లను రూ.1,032 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. 2018-19 బడ్జెట్లో కొత్త కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు.

Advertisement

కొత్తగా పోలీస్ కమిషనరేట్లు & డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్లు

రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుకమిషనరేట్లు మాత్రమే వుండేవి. జనాభా పెరుగుదల, నేరాల విస్తృతి పెరుగుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 పోలీసు కమిషనరేట్లను(పాతవి 2+కొత్తవి 7= మొత్తం 9) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను రెండుగా విభజిస్తూ ప్రభుత్వం 2016 జూన్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ గా కమిషనరేట్ ను విభజించింది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కు రాచకొండ పేరును ఖరారు చేస్తూ 2016 ఆగస్టు 23న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

        అలాగే తెలంగాణలో రెండో అతి పెద్దనగరం వరంగల్. ఈ నగరాన్ని పోలీస్ కమిషనరేట్ గా ఏర్పాటు చేస్తూ 2015 జనవరి 26న తెలంగాణ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అయిదు పోలీసు కమిషనరేట్లు చేయాలని భావించినా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆ సంఖ్యను తొమ్మిదికి చేర్చింది. పాలనలో సౌలభ్యం, అర్బన్ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్ కోసం తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఈ పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. కొత్తగా నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, సిద్ధిపేట, ఖమ్మం లో పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు 25 కొత్త పోలీస్ సబ్ డివిజన్లను (పాతవి139 + కొత్తవి 25=మొత్తం 164), 31 సర్కిళ్లను (పాతవి 688+కొత్తవి 31=మొత్తం719), కొత్త పోలీస్ స్టేషన్లు 103 (పాతవి 712+కొత్తవి 103 =815) ఏర్పాటు చేశారు.

Advertisement

కొత్త పరిపాలన విభాగాలు

యూనిట్పాతవికొత్తవిమొత్తం
జిల్లాలు102333
డివిజన్లు433073
మండలాలు459131590
పోలీస్ కమిషనరేట్లు279
సబ్ డివిజన్లు13925164
సర్కిల్స్68831719
పోలీస్ స్టేషన్లు712103815
మున్సిపాలిటీలు5276128
మున్సిపల్ కార్పొరేషన్లు6713
గ్రామ పంచాయతీలు8,6904,06112,751
కొత్త కలెక్టరేట్ భవనాలు   

హైకోర్టు విభజన

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరిగింది. 2018 డిసెంబర్ 31 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగిన హైకోర్టు విభజన పూర్తయింది. 2019 జనవరి 1వ తేదీ నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభం అవుతుందంటూ రాష్ట్రపతి రాజపత్రం విడుదల చేశారు.  

Advertisement

హైకోర్టులో జడ్జీల కేటాయింపు

ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో ఉండాల్సిన జడ్జీలు 61 మంది. కానీ, వాస్తవంగా విధులు నిర్వహిస్తోంది 26 మంది మాత్రమే. దీంతో ఇప్పుడు ఉన్న జడ్జీలనే ఆంధ్రకు 58 – తెలంగాణకు 42 నిష్పత్తిలో 16 మందిని ఆంధ్రకు, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. అయితే, ఇప్పటివరకు ఇరు రాష్ర్టాలకు కేటాయించని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. దీంతో తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య 12కు చేరింది.

ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి లేరు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తొట్టత్తిల్ రాధాకృష్ణన్ తెలంగాణకు కొనసాగుతారు. ఆంధ్రకు కేటాయించిన వారిలో అత్యంత సీనియర్ అయిన చాగరి ప్రవీణ్ కుమార్ ఆంధ్రా తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తారు.

కొత్త గ్రామపంచాయతీలు

Advertisement

తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలో నూతనంగా  4,383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పాతవి 8,690  గ్రామపంచాతయతీలు ఉండగా కొత్తగా ఏర్పాటైన వాటితో కలిసి మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 12,751 కి చేరింది.

కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు ఇతర గ్రామాలు, మండల కేంద్రాలతో రోడ్ కనెక్టివిటీ ని ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో చేపట్టింది. అలానే గ్రామీణ స్థానిక సంస్థల పరిపుష్టానికి రూ.1,500 కోట్లు, పట్టణ స్థానిక సంస్థల పటిష్టత కోసం రూ.1,000 కోట్లను 2018-19 బడ్జెట్లో కేటాయించారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అన్నిటికీ కలిపి సంవత్సరానికి 8 వేల కోట్ల చొప్పున 5 ఏండ్లలో 40 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!