ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం
సమాచార సాంకేతిక విజ్ఞానానికి దేశంలో ప్రముఖంగా వినిపించే పేరు తెలంగాణ రాష్ట్రం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం. అందుకే ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, భారీగా నిధులను కేటాయిస్తూ ముందుకు పోతున్నది. ప్రపంచంలోని అగ్రశేణి ఐదు ఐటీ సంస్థలయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్, సేల్స్‌ఫోర్స్ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయడమే ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతికి నిదర్శనం. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని రూపొందించింది. మొత్తం అభివృద్ధి ఒక్కచోటనే కాకుండా వికేంద్రీకరణ, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యాలుగా ఈ పాలసీకి రూపకల్పన చేశారు. గ్రామీణ, పట్టణ యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీ ఉంది.
రెట్టింపైన ఐటీ ఎగుమతులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి ఆరేండ్లలో ఎగుమతులు రెట్టింపయ్యాయి. రాష్ట్రం ఏర్పడినపుడు రూ.66,276 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,28,807 కోట్ల ఐటీ ఎగుమతులు చేశారు. మరో 2.10 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు వచ్చాయి. 2020లో కరోనా ప్రభావం ఐటీ రంగంపై పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09 శాతం ఉంటే.. తెలంగాణ మాత్రం ఎగుమతులు 18శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకుంది. అదే విధంగా జాతీయ ఉపాధికల్పన సగటు 4.93, మిగిలిన దేశ సగటుతో 4.59తో పోల్చితే తెలంగాణ ఉపాధికల్పన సగటు 7.2% నికి పెరిగింది. ఉపాధికల్పనలో తెలంగాణ వృద్ధి రేటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే 50% ఎక్కువగా నమోదైంది.
హైదరాబాద్ లో దిగ్గజ ఐటి కంపెనీల కార్యకలాపాలు
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐ.బీ.ఎం., ఒరాకిల్ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాల్ని నడుపుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్., టెక్ మహేంద్ర వంటి కంపెనీలెన్నో తెలంగాణలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ వారు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో తమ క్యాంపస్ ను నెలకొల్పారు. గూగుల్ సంస్థ అమెరికా బయట, అదీ హైదరాబాద్ లో ఇంత పెద్దఎత్తున తమ కార్యకలాపాల్ని విస్తరించడం విశేషం. అమెజాన్ సంస్థ తమ క్యాంపస్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ హైదరాబాద్‌లో 2016 మే 19న మాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడలోని వేవ్ రాక్‌లో యాపిల్ సంస్థ నూతన కార్యాలయాన్ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యాపిల్ ఉత్పత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, యాపిల్ వాచ్‌ల వంటి ఉత్పత్తులకు మ్యాప్‌ల అభివృద్ధి పనులను ఈ కేంద్రం నుంచి సాగిస్తారు. ఈ కేంద్రంలో 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మ్యాప్స్ డెవలప్‌మెంట్ కోసం హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇదే స్పూర్తితో మరింత నిర్మాణాత్మకంగా ముందుకు పోతున్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచంలోని అగ్రశేణి ఐదు ఐటీ సంస్థలయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్, సేల్స్‌ఫోర్స్ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశాయి.
గ్రామాలకు ఐటీ విస్తరణ
ఐటీ రంగాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ అభివృద్ధి కేంద్రాలు, బీపీవోల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ కృషి కారణంగా సైంట్ లిమిటెడ్ సంస్థ తన సాప్ట్ వేర్ అభివృద్ధి కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయగా, వాంక్‌డోత్ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ జనగామ, హుజూరాబాద్‌లలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఎక్‌లత్ హెల్త్ సొల్యూషన్ సంస్థ కరీంనగర్‌లో 100 సీట్లతో బీపీవోను ప్రారంభించగా, రూరల్స్ షోర్స్ సంస్థ ఖమ్మంలో బీపీవో సెంటర్‌ను ప్రారంభింభిస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో బీపీవోల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నాయి.
ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు
టైర్ -2, టైర్ 3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించే ఐటీ కంపెనీలకు ఐసీటీ పాలసీ, గ్రామీణ సాంకేతిక కేంద్ర పాలసీ కింద ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందులో పంచాయతీ/మున్సిపల్ పన్నులతోపాటు ఎగ్జిబిషన్ స్టాల్ అద్దెల తిరిగి చెల్లింపు, ఈవెంట్ వ్యయం తిరిగి చెల్లింపు, స్టాంపు డ్యూటీ, టాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లింపు, విద్యుత్ కేటగిరీ మార్పు, నాణ్యత ధ్రువీకరణ రుసుం, ఇంటర్నెట్, టెలిఫోన్ ఛార్జీలు తిరిగి చెల్లింపు, టెండర్ డాక్యుమెంట్ వ్యయం ఎస్‌డీ/ ఈఎండీ చెల్లింపు నుంచి మినహాయింపు, తక్షణ సబ్సిడీ, నియామక సాయం, పునరుత్పాదక విద్యుత్ సౌలభ్యం, మొదటి 3 యాంకర్ యూనిట్ల ప్రారంభ సబ్సిడీ, పెట్టుబడి, అద్దెల్లో రాయితీ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
డిజిటల్ తెలంగాణ – టీశాట్
ఐటీ రంగంలో ప్రశంసాత్మకంగా చెప్పదగిన మరో ముందడుగు డిజిటల్ తెలంగాణ కార్యక్రమం. పల్లె పల్లెలో ప్రతి పౌరుడికి డిజిటల్ సౌకర్యాలను అందించాలన్న లక్ష్యంతో 2015 జూలై 1న ప్రారంభించారు. ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్ వర్క్ (సాఫ్ట్ నెట్) పనిచేస్తుంది. టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యం, శిక్షణ వంటి రంగాల్లో అధునిక పద్ధతులను అవలంభించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పాఠశాల విద్యపై దృష్టి కేంద్రీకరించి ఈ-లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య, సాంకేతిక విద్య విభాగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తోంది టి-సాట్. 2017లో విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో నైపుణ్యం పెంపొందించడానికి 3 వేల గంటల ప్రసారాలు చేసింది.
విద్యారంగానికి సేవలు అందించడమే కాకుండా, తెలంగాణ నిరుద్యోగ యువతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పడేందుకు ప్రత్యేక కృషి చేస్తుంది టి-సాట్ టీవీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు వివిధస్థాయిల్లో అవగాహన కార్యక్రమాల ప్రసారాలందిస్తూనే, వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ సాధనలో చేయూత నందించింది. మారుమూల ప్రాంతాలు, వ్యయ భారాన్ని మోయలేని నిరుద్యోగ యువకులకు టీ-సాట్ టీవీ అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.పోటీ పరీక్షలే కాకుండా ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలకు అందిస్తోంది. టీ-సాట్ నెట్ వర్క్ ప్రసారాలు గతంలో ఉన్న ఆర్వోటీ వ్యవస్థను ఉపయోగించుకుంటూనే కేబుల్ ద్వారా ప్రసారాలు చేస్తూ విస్తృత కనెక్టివిటినీ పొందగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, సొషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ తదితర సుమారు 4500 పాఠశాలల విద్యార్థులు టీ-సాట్ ప్రసారాలను అందుకుంటున్నారు. డిజిటల్ బోధన, ప్రసారాలు, శిక్షణ ద్వారా దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఈ తరహా సేవలందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 3,500 ఆర్వోటీలకు పరిమితమైన మనటీవి, తెలంగాణ ఆవిర్భావం తరువాత కేబుల్ రంగంలోకి ప్రవేశించి తెలంగాణలోని 70 లక్షల నుండి 80 లక్షల కుటుంబాలకు టీ-సాట్ ప్రసారాలను అందిస్తుంది. తెలంగాణలోని 40మంది ఎంఎస్ఓలు తమ ప్రసార కేంద్రాల ద్వారా ప్రజలకు టి-సాట్ విద్య, టి-సాట్ నిపుణ ప్రసారాలు అందుతున్నాయి. కేబుల్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా టి-సాట్ నెట్ వర్క్ ఛానళ్ల ప్రసారాలు వెళుతున్నాయి. సంవత్సర కాలంలో యూట్యూబ్ వ్యూస్ 2,61,69,146 ఉండగా, సబ్ స్ర్కైబ్స్ 1,48,006 లభించాయి. టీ-సాట్ ప్రసారాలను ఆన్ లైన్ లో చూసిన వీక్షకుల సంఖ్య 14,99,84,995గా నమోదైందంటే టీ-సాట్ ప్రసారాలకు ఆదరణ అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖలైన మహిళా శిశు సంక్షేమ ప్రసారాలను నేరుగా 2 వేల మంది అంగన్ వాడీ ఆయాలు, సూపర్ వైజర్లు, సీడీపీవోలు చూస్తుండగా పరోక్షంగా లక్షల మంది చిన్నారులు వారి తల్లిదండ్రులు ప్రసారాలు చూస్తూ అవగాహన పెంచుకుంటున్నారు. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఫీల్డ్ అసిస్టెంట్స్, గ్రామజ్యోతి కమిటీ సభ్యులు, సర్పంచ్ వార్డు సభ్యులు 4వేల మంది నేరుగా ఉన్నతాధికారుల ప్రసారాలు చూస్తుండగా పరోక్షంగా 1 లక్షా 50 వేల మందికి పైగా సిబ్బంది, సంబంధీకులు అనుసరిస్తున్నారు. విద్యాశాఖ ద్వారా ప్రసారమవుతున్న విషయాలు పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక కళాశాల్లోని 30 లక్షల విద్యార్థులకు చేరుతున్నాయి.
టీ-హబ్ ఇంక్యుబేటర్ ఏర్పాటు
ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఉన్నతస్థానానికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయస్థాయిలో సిద్ధమైన ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్ ను 2015 నవంబర్ 5న ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సౌకర్యాలతో టీ-హబ్ భవనాన్ని కాటలిస్ట్ పేరుతో నిర్మించారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో నిర్మితమైన ఇంక్యుబేటర్ సెంటర్ ఇదే కావడం విశేషం. మౌలిక సదుపాయాలతోపాటు.. మూలధన నిధుల కింద రూ.10 కోట్లను కూడా టీ సర్కారు కేటాయించింది. 1జీబీ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వైఫై సదుపాయం, అత్యున్నత సదుపాయాలతో జీ+5 విధానంలో టీ హబ్ భవంతిని నిర్మించింది. ఈ భవనానికి కాటలిస్ట్ పేరును ఖరారు చేసి, గ్రీన్ బిల్డింగ్‌గా, ఎనర్జీని ఎఫీషియెంట్‌గా తీర్చిదిద్దింది. కేవలం మౌలిక వసతులతో భవనం నిర్మించి వదిలేయకుండా.. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు అత్యున్నత సంస్థలనూ భాగస్వామ్యం చేసింది. టెక్నాలజీ స్టార్టప్ లను టీ- హబ్ ప్రొత్సహిస్తుంది. మంచి ఆలోచనలతో కంపెనీని ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు ఇది ప్రేరణగా నిలుస్తున్నది. వినూత్న ఆలోచన కలిగిన శక్తివంతమైన పారిశ్రామిక వేత్తలను ఒక్కచోట చేర్చేందుకు టి- హబ్ కృషి చేస్తున్నది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విజేతలై నిలిచేందుకు ఇది తోడ్పాటునిస్తుంది.
టి హబ్ ఇంక్యుబేటర్ మొదటి దశ ప్రగతి
నవంబర్ 2017 నాటికి టీ-హబ్‌లో 337 స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేశారు. ఇవి పెట్టుబడిదారుల నుంచి రూ. 91.65 కోట్ల నిధులు సమకూర్చాయి. 25 కార్పొరేట్ సంస్థల నుంచి టీ-హబ్ భాగస్వామ్య ప్రతిపాదనలు స్వీకరించింది. దాదాపు 10 స్టార్టప్‌లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. టీ-బ్రిడ్జ్ అనే విలక్షణమైన కార్యక్రమాన్ని కూడా టీ-హబ్ ప్రారంభించింది. దీనిద్వారా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేలా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తున్నది. ఇక్కడ నెలకొల్పబడిన పలు స్టార్టప్ లు దేశ, విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీవో, కేపీవో, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, ఇండస్ట్రీస్ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. అయితే, ఇది తొలిదశ మాత్రమే. టీ-హబ్ అసాధారణ విజయం తరువాత, 4వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అదనపు ఇంక్యుబేషన్ స్థలంతో టీ-హబ్ IIవ దశను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.
టి హబ్ ఫేజ్ 2
టీ హబ్ రెండో దశను 2020 జూన్ నాటికి పూర్తిచేయనున్నారు. టీహబ్ రెండోదశ భవనాన్ని 9 అంతస్తులు 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. నాలుగు వేలమంది సాంకేతిక నిపుణులకు ఇది వేదిక కానుంది. బయటి నుంచి చూసేవారికి ప్రధాన కేంద్రం నుంచి 4 పిల్లర్లు, రెండు స్టీలు దూలాలతో వేలాడే భవంతిలా కనిపించనుంది. 9 అంతస్తుల్లో 60 మీటర్ల ఎత్తు, 90 మీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం, మరో రెండు లక్షల అడుగుల పార్కింగ్ సదుపాయంతో సుమారు రూ.330 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టారు. దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిని పోలినరీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం జరుగుతున్నది.
టి-బ్రిడ్జ్
ప్రపంచంలోని మొదటి 10 స్టార్టప్ నగరాల్లో హైదరాబాద్ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేసిన టీ-బ్రిడ్జి, టీ-హబ్ ఔట్ పోస్టుని రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 15న ప్రారంభించింది. ప్రపంచంలోని వివిధ దేశాల స్టార్టప్‌లతో హైదరాబాద్ స్టార్టప్‌లను అనుసంధానించేందుకు ఈ టీ-బ్రిడ్జ్ ఉపయోగ పడనుంది. భారతదేశం – సిలికాన్ వ్యాలీ మధ్య ఆలోచనల మార్పిడికి, స్టార్టప్ ల బదలాయింపులకు టీ బ్రిడ్జి దోహదపడుతుంది. రాష్ర్టానికి చెందిన స్టార్టప్ లకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తున్నది. టీ-బ్రిడ్జ్ వల్ల భారతీయ స్టార్టప్ లు, సిలికాన్ వ్యాలీ స్టార్టప్ ల మధ్య ఆలోచనల మార్పిడి జరుగుతుంది. టీ-బ్రిడ్జ్ ద్వారా 100కుపైగా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో 40కిపైగా జాతీయస్థాయి పరిశోధన ల్యాబ్‌లు.. అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తున్నాయి. స్టార్టప్‌లు చిన్నపాటి బహుళజాతి సంస్థలుగా ఎదుగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 4 వేల స్టార్టప్‌లు ఉన్నాయి. దేశీయ స్టార్టప్‌లలో ఇవి 15-20 శాతం వాటా కలిగి ఉన్నాయి.
వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు
సాంకేతిక ఉద్యోగ ఫలాలను తెలంగాణ బిడ్డలందరికీ చేరవేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ద్వితీయ శ్రేణి నగరాలైన కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలను రూ.31 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా మడికొండలోని ఐటి పార్కులో టెక్ మహీంద్రా, సైయెంట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయి. తాజాగా క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ మడికొండలోని ఐటి పార్కులో భూమి పూజ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.
తెలంగాణ పారిశ్రామిక రంగం
పరిశ్రమలకు స్థాపనకు తెలంగాణ రాష్ట్రం, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం చాలా అనుకూలమైనది. తుఫాన్లు, భూకంపాల ప్రభావం లేని దక్కన్ పీఠభూమిలో హైదరాబాద్ భాగం. సమశీతోష్ణ వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. పరిశ్రమల్లో యంత్రాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఇక్కడి వాతావరణం ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరం మినీ ఇండియాలాగా ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఎంతో సౌకర్యంగా, ప్రశాంతంగా జీవనం గడుపుతారు. అందుకే వివిధ రంగాల్లో నిపుణులు హైదరాబాదులో ఉద్యోగం, వ్యాపారం చేయడానికి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ఇలాంటి సహజ సిద్ధమైన అనుకూలతలతో పాటు ప్రభుత్వ పరంగా కూడా పెట్టుబడి దారులకు అనుకూలమైన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం ఉండేలా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ & సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (TS-IPASS) చట్టం చేసి, సులభతర అనుమతుల విధానం ప్రవేశ పెట్టింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌కు, తెలంగాణకు పరుగులు పెట్టడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడింది. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు పూర్తి పారదర్శక, సరళమైన, అవినీతి రహితమైన విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇక్కడి వనరులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా 14 రంగాలను ప్రాధాన్యంగా ఎంచుకొని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ఒకసారి పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తెలంగాణ విధానాలకు ఆకర్షితులై తదుపరి ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు కూడా రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నాయి. టీఎస్ ఐపాస్, రాష్ట్రంలోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తీసుకున్న చర్యలు వందలాది కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
తరలి వస్తున్న పరిశ్రమలు
రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఆగ్రోబేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్‌టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలకు చెందినవి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 169 ఫార్మా, కెమికల్స్, 87 పవర్, 165 ప్లాస్టిక్, రబ్బర్, 280 ఇంజనీరింగ్, 195 ఆగ్రో బేస్డ్, 46 ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్, 69 పేపర్ ప్రింటింగ్, 63 టెక్స్ టైల్, 117 సిమెంట్, 12 ఏరోస్పేస్, డిఫెన్స్, 820 ఇతర పరిశ్రమలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం అంతర్జాతీయంగా పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నది. చాలా మల్టీ నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడితో ఐకియా సంస్థ ఫర్నిచర్, టెక్స్ టైల్ యూనిట్ ప్రారంభించింది. కోకోకోలా కంపెనీ రూ. 1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. చైనాకు చెందిన డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరెషన్ 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పెట్టనుంది. ప్రాక్టర్ అండ్ గాంబుల్ రూ.900 కోట్లతొ, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూ. 400 కోట్లతో పరిశ్రమలు ప్రారంభిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో తయారుచేసే ‘ఇన్సుమన్ ప్రాజెక్టు’ రూ.500 కోట్లతో ఏర్పాటు కానుంది. ఫ్రెంచ్ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్జానంతో ఇన్సులిన్ ను ఇక్కడ తయారు చేయనున్నారు. ఆటోమొబైల్ రంగంలో పేరెన్నికగల హ్యుందయ్ మొబిస్ కంపెనీ హైదరాబాద్‌లోని కొల్లూరు ఐటీ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
నూతన పారిశ్రామిక పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జనవరి 2020 నాటికి రూ.2,04,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా 12,427 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్ర పారిశ్రామిక రంగం జాతీయ సగటు కంటే గణమైన వృద్ధి రేటు కలిగివుంది.
గ్రామీణ జిల్లాల్లోనూ పరిశ్రమల స్థాపన
టీఎస్‌ఐపాస్ ద్వారా పరిశ్రమలు హైదరాబాద్, దానిచుట్టూనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయి. గ్రామీణ జిల్లాల్లో పరిశ్రమలకు మిషన్ భగీరథ ద్వారా నీరు, టీఎస్‌ఐఐసీ ద్వారా భూముల్లో మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
గ్రామీణ జిల్లాల్లో పరిశ్రమల స్థాపన వల్ల స్థానిక గ్రామాల్లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి లభిస్తున్నది.
పెరిగిన వృద్ధి రేటు
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దేశ, విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ర్టాలకన్నా ముందుంది. ఇతర రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేవు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే.. తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది.
హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు సక్సెస్
దేశంలోనే ఐటీ రంగానికి కీలక స్థానంగా ఉన్న హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సు (ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు)ను 2017లోనే నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విశ్వ ప్రతినిధులకు వేదికగా భారత, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజులపాటు జరిగిన జి.ఇ.ఎస్. సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోడితో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు, ఆయనకు సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ హజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతోపాటు 3000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాల ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలతో పాటు స్టార్టప్ సంస్థలూ సదస్సులో పాలు పంచుకున్నాయి.
పెరిగిన వృద్ధి రేటు
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దేశ, విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ర్టాలకన్నా ముందుంది. ఇతర రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేవు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే.. తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ 5.9 లక్షల కోట్లకు పెరిగాయి. పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాదు, ఆయా ప్రాజెక్టుల అమలు విషయంలోను తెలంగాణ ముందంజలో ఉంది. అసోచామ్ (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్,ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2017 సెప్టెంబర్ 14న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు.
పారిశ్రామికరంగ వృద్ధి రేటు : 2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.4 శాతం వృద్ధిరేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతం వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది.