వైఎస్ జగన్ వ్యాఖ్యల వెనుక కారణమదేనా?

332

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ పరిశీలకులు. వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పటికీ కోస్తా జిల్లాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. కాపు సామాజికవర్గం అత్యధిక సంఖ్యలో ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో పేరున్న ఒక్క కాపు నేత ఆయన పార్టీలో చేరలేదు. చివరకు కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా కలవలేదు. దీంతో వైఎస్ జగన్ లో తీవ్ర మానసిక అలజడి చెలరేగిందని, ఇలా అయితే ఈ రెండు జిల్లాల్లో గెలుపొందడం కష్టమేనని ఆయన భయపడుతున్నట్టు తెలుస్తోంది.

‘తూర్పు’లో ఏ పార్టీ గాలి వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని నానుడి. తూర్పుగోదావరిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 19 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమగోదావరిలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం 34. వీటిలో వైఎస్సార్సీపీకి పది సీట్ల కంటే మించి రావని ప్రశాంత్ కిశోర్ టీమ్ సూచించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో 20కి పైగా సీట్లు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరతాయని ప్రశాంత్ కిశోర్ జగన్ కు చెప్పినట్టు సమాచారం. వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో రాయలసీమకు, ఒంగోలుకు చెందిన నేతలు వచ్చి పార్టీలో చేరారు కానీ ఒక్క కాపు నేతా చేరలేదు. ముద్రగడ పద్మనాభం దగ్గరకు తన దూతల్ని పంపి వచ్చి కలవమని కోరినా ఆయన పట్టించుకోలేదు. ముద్రగడ వచ్చి తనను కలిస్తే కాపుల్లో తనకు కొంత సానుకూలత ఉంటుందని జగన్ భావించారు.

ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ను పెద్దగా విమర్శించడానికి ఇష్టపడని వైఎస్ జగన్ ఒక్కసారిగా ఉక్రోషం తట్టుకోలేక పవన్ కల్యాణ్ పై నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. కార్లను మార్చినట్టు పెళ్లాల్ని మారుస్తాడని చౌకబారు వ్యాఖ్యలు చేసి పరువు పొగొట్టుకున్నారు. ఎవరో ద్వితీయ శ్రేణి నాయకులు చేయాల్సిన విమర్శలను స్వయంగా జగనే చేయడం వెనుక కారణం.. వైఎస్సార్సీపీకి ఉభయగోదావరి జిల్లాల్లో అవకాశమే లేకపోవడమేనని తెలియడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కల్యాణ్ రోజురోజుకీ బలపడుతుండటం, 28 శాతం ఉన్న కాపు సామాజికవర్గం మొత్తం ఆయనతోనే ఉండటం, కులాలు, మతాలకతీతంగా కోట్లాదిమంది యువత, మహిళలు పవన్ ను సీఎంగా చూడాలని కోరుకోవడం వంటి కారణాలతో వైఎస్ జగన్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడని అంటున్నారు.