ప్ర‌పంచంలోనే హై స్పీడ్ బుల్లెట్ రైలు ఇదే !

1115

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వేగంతో ప్ర‌యాణించే బుల్లెట్ రైలు చైనాలో తాజాగా ప‌ట్టాలెక్కింది. వాస్త‌వానికి బుల్లెట్ రైలును చైనా 2008లోనే ప్రారంభించింది. వీటి వేగం గంట‌కు 350 కిలోమీట‌ర్లు. అయితే అదే ఏడాది రెండు బుల్లెట్ రైళ్లు ఢీకొని 40 మంది చ‌నిపోయారు. వంద‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. అతివేగంగా కార‌ణంగానే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని అధికారులు గుర్తించారు. త‌ర్వాత వీటి వేగాన్ని గ‌ణ‌నీయంగా తగ్గించారు.

మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత ఇప్పుడు అత్య‌ధిక వేగంతో న‌డిచే బుల్లెట్ రైలును ప్ర‌వేశ‌పెట్టారు. దీనికి గంట‌కు 400 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించే సామ‌ర్థ్య‌మున్న‌ప్ప‌టికీ ప్ర‌మాదాల దృష్ట్యా గంట‌కు గ‌రిష్ట వేగాన్ని 350 కిలోమీట‌ర్ల‌కు ప‌రిమితం చేశారు. ప్యుక్సింగ్ గా పిలిచే ఈ రైలు చైనా రాజ‌ధాని న‌గ‌రం బీజింగ్ నుంచి ఆ దేశ ఆర్థిక రాజ‌ధాని, అతిపెద్ద న‌గ‌ర‌మైన షాంగైకు ప‌రుగులు తీస్తుంది. ఈ బుల్లెట్ రైలు ప్ర‌వేశంతో బీజింగ్ – షాంగై న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణ దూరం 4 గంట‌ల 28 నిమిషాలు తగ్గుతుంద‌ని అధికారులు అంటున్నారు.

బీజింగ్ – షాంగై న‌గ‌రాల మ‌ధ్య రోజూ ఐదు ల‌క్ష‌ల ఐదు వేల మంది ప్ర‌యాణిస్తుంటార‌ని అంచ‌నా. గంట‌కు 350 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తే 10 శాతం విద్యుత్ కూడా ఆదా అవుతుంద‌ట‌. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ రైలులో ప్ర‌మాదాల‌కు ఆస్కారం లేకుండా భద్రతకు పెద్దపీట వేశార‌ని స‌మాచారం. ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా ప్ర‌మాదం త‌లెత్తితే రైలు దానంత‌ట అదే వేగాన్ని తగ్గించుకునేలా రూపొందించారంట‌. చైనాలో ప్రస్తుతం 20 వేల కిలోమీటర్ల మేర బుల్లెట్‌ రైలు వ్యవస్థ ఉండగా.. 2020 నాటికి మరో 10వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని ఆ దేశ‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.