కేసీఆర్‌ ఫ్రంట్ లో ఎవరెవరు..?

868

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఇంతకీ జాతీయ స్థాయిలో కేసీఆర్‌ వెంట కదిలెదెవరు..? ఎవరెవరు కలిసొస్తారు..? నిజంగానే కేసీఆర్‌ ఆశించినట్లుగా.. ఆకాంక్షిస్తున్నట్లుగా అసలు సిసలైన కేంద్ర రాష్ట్రాల సహకార సమాఖ్యను కోరుకుంటున్న ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్‌ వెంట నడిచొస్తాయా..? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల ప్రభావమెలా ఉండబోతోంది…? ఇవన్నీ ఇప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చర్చనీయాంశాలే. వామపక్ష పార్టీలు, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు నుంచి డీఎంకే నేత స్టాలిన్, యూపీలో ములాయం–అఖిలేష్, మాయావతి, బీహార్‌లో లాలూ… అలా అందరితో కలిసి వెళ్లే ప్రయత్నాలను కేసీఆర్‌ ఇప్పటికే మొదలుపెట్టి ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అవసరమని.. కేసీఆర్‌ ప్రకటించిన మరునాడే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్‌ చేసి..‘ తమ్ముడూ కరెక్ట్‌ నిర్ణయం తీసుకున్నావు. నువ్‌ ఏం చెపితే అదే ఫాలో చేద్దాం. ముందుకుపోదాం. త్వరలోనే కలిసి మాట్లాడుదాం..’ అని ఫోన్‌ చేసినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. మమతాబెనర్జీ (దీదీ) కేసీఆర్‌తో సమాన వయస్కురాలైనప్పటికీ జాతీయ రాజకీయాల్లో సీనియర్‌. సొంత రాష్ట్రంలో ఆమె పవర్‌ఫుల్‌ లీడర్‌. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్న నాయకుల్లో మమతా కీలకం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యమే ముఖ్యమని ఆమె భావిస్తున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలు కూటమిగా జట్టు కడితే… మమతా మద్దతివ్వడం ఖాయం.

కేసీఆర్‌కు మద్దతు ప్రకటించిన వారిలో మరొకరు. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌. జార్ఖండ్‌ ముక్తి మోర్చాకు (జేఎంఎం) నాయకత్వం వహిస్తున్న సోరెన్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌ కుమారుడు. జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి నుంచి జేఎంఎంకు స్థానికంగా బలం బలగముంది. 2014లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి రావటంతో అప్పట్నుంచీ అక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. స్థానికంగా బీజేపీతో ఉన్న రాజకీయ వైరంతో సహజంగానే ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతుగా నిలువనుంది.

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళులకు ప్రాంతీయాభిమానం ఎక్కువ. కానీ కేసీఆర్‌ ప్రకటించిన కూటమికి.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనకు కర్ణాటక డీఎంకే నేత స్టాలిన్‌ మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధి మూడో కుమారుడు స్టాలిన్‌. కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం డీఎంకే రాజకీయాలు స్టాలిన్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు బిల్లును తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి… కేంద్రానికి పంపించిన సందర్భంలోనూ స్టాలిన్‌ సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు. కానీ తమిళనాట జయలలిత ఎపిసోడ్‌ తర్వాత బీజేపీ హైకమాండ్‌ స్టాలిన్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం స్టాలిన్‌ను దగ్గర చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో స్టాలిన్‌ కేసీఆర్‌ ఫ్రంట్‌తో కలిసొస్తారో లేదో అప్పుడే చెప్పలేం.

ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌.. కేసీఆర్‌తో కలిసొచ్చే అవకాశాలున్నాయి. ములాయంసింగ్‌ యాదవ్‌ కుమారుడు అఖిలేష్‌. గత ఏడాది యూపీ ఎన్నికల సమయంలో తండ్రీ కొడుకుల విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశంలో పెద్ద రాష్ట్రం కావటంతో పాటు స్థానికంగా సమాజ్‌వాదీ పార్టీకి అక్కడ బలమైన పట్టుంది. అదే సమయంలో అక్కడ మరో బలమైన పార్టీ బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయవతి సైతం కేసీఆర్‌కు మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ ధాటికి కుదేలైన ఈ రెండు పార్టీలు సైతం బీజేపీని ఓడించేందుకు అవసరమైన ప్రతి వేదికను ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. బద్ధ శత్రువులైనప్పటికీ బీజేపీని ఓడించేందుకు అక్కడ జరిగే రెండు ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటిచేస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల కూటమికి ఎస్‌పీ, బీఎస్‌పీలు కలిసొచ్చే అవకాశాలున్నాయి.

బీహార్‌లో ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఫెడరల్‌ కూటమికి మద్దతు పలికే అవకాశాలున్నాయి. కేసీఆర్‌ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లోనూ కీలకంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వెన్నంటి ఉన్న ఎంఐఎం పార్టీ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది.

ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్ణయాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్వాగతించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేసీఆర్‌ తీసుకున్న ఫ్రంట్‌ నిర్ణయాన్ని సమర్థించి, వెంట ఉంటామని ప్రకటించారు. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీని వదులుకొని కేసీఆర్‌ ఫ్రంట్‌ను అనుసరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.