ఉద్యోగం చేస్తూ రూ.30 కోట్లు సంపాదిస్తున్న ఆ తెలుగు మహిళ ఎవరు?

344

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. హైదరాబాద్ లో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఏడాదికి రూ.30 కోట్లు సంపాదిస్తోంది.. ఒక మహిళ. ఆమె ఏ విదేశీయురాలో, వేరే రాష్ట్రాలకు చెంది ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే..! ఆమె స్వయంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళ. ఈ విషయాన్ని ఎవరో చెబితే నమ్మేవాళ్లం కాదు కానీ చెప్పింది.. ఆదాయపన్ను శాఖ కాబట్టి నమ్మకతప్పడం లేదు.

తాజాగా ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రాంతీయ ప్రిన్సిపల్ కమిషనర్ ఎస్పీ చౌదరి ఈ విషయాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆ మహిళ హైదరాబాద్ లోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోందని తెలిపారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న ఉద్యోగి కూడా ఆమేనని చెప్పారు. అంతేకాకుండా గతేడాది తన ఆదాయంలో 30 శాతం మొత్తాన్ని ఆదాయ పన్నుగా చెల్లించారని, ఇంతమొత్తం ఆదాయ పన్ను చెల్లించిన మహిళ కూడా ఆమేనని వివరించారు.

గోప్యత రీత్యా ఏడాదికి రూ.30 కోట్లు సంపాదిస్తున్న ఆ ఐటీ ఉద్యోగిని ఎవరో చెప్పలేమని పేర్కొన్నారు. కాగా ఉద్యోగులకు ఈ నెల 31తో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసుకోవడానికి గడువు ముగుస్తుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.60,845 కోట్లు ఆదాయ పన్నుగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.