నిజం… హనీప్రీత్ పారిపోలేదట. భయంతో దాక్కుందట..!

370

హనీప్రీత్ సింగ్.. ప్రస్తుతం పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గుర్మీత్ సింగ్ ముద్దుల కూతురిగా డేరా సంస్థ సభ్యులు చెబుతున్నా.. ప్రచారం మాత్రం మరోలా సాగుతోంది. అయితే.. గుర్మీత్ సింగ్ కు కోర్టు శిక్ష వేసిన రోజు హెలికాప్టర్ లో అతడితోపాటు జైలు వరకు వెళ్లిన హనీప్రీత్ సింగ్ ఆ తర్వాత మాయమైంది. ఇదే గ్యాప్ లో పంచకులలో హింస చెలరేగింది. ఆ తర్వాత హనీప్రీత్ అడ్రస్ లేకుండా పోయింది.

గుర్మీత్ ముద్దుల కూతురుగా ప్రచారంలో ఉన్న మాజీ నటి కోసం లుకౌట్ నోటీసులు, బార్డర్ లో బందోబస్తులు, నేపాల్ లో సెర్చ్ ఆపరేషన్ లు అన్నీ అయ్యాయి. నేపాల్ బార్డర్ లో ఏకంగా వాల్ పోస్టర్ లు వేశారు. విదేశాలకు పారిపోకుండా ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. పదుల సంఖ్యలో టీంలను పెట్టి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కచ్చితంగా నేపాల్ లోనే దాక్కుని ఉంటుందని అధికారులు అనుమానించారు. కానీ నేపాల్ అధికారులు మాత్రం హనీప్రీత్ తమ దేశానికి రాలేదని క్లారిటీ ఇచ్చారు.

దీంతో హనీప్రీత్ ఎక్కడుందో తెలియక అధికారులు తలపట్టుకున్నారు. ఎందుకంటే ఆమెమీద దేశద్రోహంతో పాటు.. చాలా కేసులు ఫైల్ అయ్యాయి. ఆమెను దొరకబుచ్చుకుని కోర్టులో హాజరుపరిచి రిలాక్స్ అవుదామని పోలీసులు అనుకున్నారు. కానీ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.

ఎక్కడి నుంచి వచ్చిందో..? ఎలా వచ్చిందో తెలియదు.. సడెన్ గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యిందట గుర్మీత్ ముద్దుల కూతురు. తండ్రికి తనకు రంకు అంటగట్టారని గుండె చెరువయ్యేలా బాధపడుతూ.. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ వేయాలని ఓ లాయర్ దగ్గరికి వచ్చిందట. నాలుగైదు రోజులుగా లాయర్ తో కాంటాక్ట్ లో ఉందట. నిన్న లాయర్ కార్యాలయానికి వచ్చి బెయిల్ పిటిషన్ మీద సంతకం కూడా పెట్టి వెళ్లిందట. ఇన్ని రోజుల నుంచి హనీప్రీత్ ఎక్కడుందనేదానికి సదరు లాయర్ సమాధానం దాటవేసినా.. రెండు రోజుల నుంచి మాత్రం ఢిల్లీలోనే ఉందని చెబుతున్నాడు.

రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటే.. పోలీసులు బార్డర్ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నట్టు.? హనీప్రీత్ ఢిల్లీ సరౌండిగ్స్ లోనే ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం రాలేదో..! లేకుంటే ఇంకైదైనా జరిగిందో కానీ.. హనీప్రీత్ ఢిల్లీలోనే ఉందని తెలియడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు పోలీసులు.