ఇప్పుడు డీఎస్‌ ఏం చేయబోతున్నారు?

608

డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) తెలంగాణ రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009లో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారం చేపట్టినప్పుడు డీఎస్సే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారం చేపడుతున్నప్పుడు ఎవరైతే ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉంటారో వారికే సీఎం పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీన్ని తోసిరాజని వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.. కాంగ్రెస్‌ అధిష్టానం.

నేరుగా, కాంగ్రెస్‌ అధిష్టానం అంటే సోనియాగాంధీతోనే సన్నిహిత సంబంధాలు ఉన్న డీఎస్‌కు 2009లో కాలం కలసిరాలేదు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నకాలమిది. నాడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మీద డీఎస్‌ ఓడిపోయారు. దీంతో అటు ఎమ్మెల్సీ, ఇటు ఎమ్మెల్యే, ఎంపీకాకుండా పదవులకు దూరంగా ఉండిపోయారు. డీఎస్‌ గెలిచి ఉంటే నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ మరణానంతరం సీఎం అయ్యేవారని ఇప్పటికీ ఆయన అనుచరులు, అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ఆ తర్వాత 2014లోనూ డీఎస్‌కు నిరాశే ఎదురైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌ చేతిలో ఓడిపోవడంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. తనను సంప్రదించకుండా కాంగ్రెస్‌ అధిష్టానం నిజామాబాద్‌ జిల్లాకే చెందిన ఆకుల లలితను ఎమ్మెల్సీని చేయడం డీఎస్‌లో తీవ్ర అసహనాన్ని రేపింది. దీంతో ‘బంగారు తెలంగాణ’ కోసమంటూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోయారు. పార్టీని బలోపేతం చేసుకునే ఉద్దేశంలో భాగంగా సీఎం కేసీఆర్‌ కూడా డీఎస్‌కు రెడ్‌కార్పెట్‌ పరిచారు. డీఎస్‌ను రాజ్యసభ సభ్యుడిగా చేయడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా కేబినెట్‌ మంత్రి హోదాలో నియమించడంతో మళ్లీ నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకమయ్యారు.

కాగా, డీఎస్‌కు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు సంజయ్‌ తెలంగాణలోనే మంచిపేరున్న శాంకరి విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నిజామాబాద్‌ మేయర్‌గా కూడా పనిచేశారు. ఇక రెండో కొడుకు అరవింద్‌ వ్యాపారాల్లో ఉన్నారు. నరేంద్రమోదీ నాయకత్వాన్ని ఇష్టపడే అరవింద్‌ వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన కుమారుడి కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సాక్షాత్తూ నిజామాబాద్‌ ఎంపీ, కేసీఆర్‌ గారాలపట్టి కవిత ఆరోపించడం కలకలం రేపింది. అంతేకాకుండా జిల్లాకు సంబంధించిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులందరినీ కూడగట్టి నేరుగా తన తండ్రి కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు. పార్టీ నుంచి ఆయన్ను తొలగించాలని విన్నవించారు. ఈ ఆరోపణలను డీఎస్‌ ఖండించారు. తాను పార్టీ మారేది లేదని కూడా చెప్పారు. అయితే కేసీఆర్‌ దీన్ని చెవికెక్కించుకున్న పాపానపోలేదు. కేసీఆర్‌ కలవడానికి సీఎం క్యాంపు ఆఫీస్‌కు వచ్చిన డీఎస్‌కు అపాయింట్‌మెంట్‌ దక్కలేదు. అయితే డీఎస్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆయన మీద చర్యలకు కేసీఆర్‌ వెనకడుగు వేశారు. డీఎస్‌ తెలంగాణలోనే బలమైన మున్నూరు సామాజికవర్గానికి చెందిన నేత కావడం, తెలంగాణలో బీసీల జనాభా రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉండటం, డీఎస్‌పైన వేటు వేస్తే ఒక బీసీ నేత మీద వేటు వేశార నే అపఖ్యాతి తనకు చుట్టుకుంటాయని కేసీఆర్‌ భావించారు.

దీంతో డీఎస్‌ విషయంలో పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. కేసీఆర్‌. శాంకరీ నర్సింగ్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులపై డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ లైంగిక దాడి చేశాడని, వేధించాడని విద్యార్థినుల చేత ఆరోపణలు చేయించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా హైదరాబాద్‌కు పంపి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు ఇప్పించారు. ఈ క్రమంలో సంజయ్‌ను విచారణకు పిలిచిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఇలా చేయడం ద్వారానే డీఎస్‌ను తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్లిపోయేలా రెచ్చగొట్టారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తన గారాలపట్టి కవితపై పోటీ చేయనున్న డీఎస్‌ కుమారుడు అరవింద్‌ ప్రతిష్టను దెబ్బకొట్టి ఎన్నికల ముందే నిజామాబాద్‌ జిల్లాలో తన గారాలపట్టికి రూట్‌ క్లియర్‌ చేశారు.. కేసీఆర్‌. అయితే తన అపార రాజకీయ జీవితంతో ఇలాంటివి ఎన్నో చూసిన డీఎస్‌ ఎలాంటి వివాదస్పద కామెంట్లు చేయకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. తన విషయంలో కేసీఆర్‌ కూతురు కవిత, టీఆర్‌ఎస్‌ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై లోలోన రగిలిపోతున్న డీఎస్‌ అదును కోసం వేచిచూస్తున్నారు.