ఈ మాఫియా డాన్ పై వెబ్ సిరీస్ వస్తుందే..!

233

దావూద్ ఇబ్రహీం.. పరిచయం అక్కర్లేని పేరు. ఒక కానిస్టేబుల్ కొడుకైన దావూద్ చిన్నచిన్న నేరాలతో ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ గా మారాడు. ముఖ్యంగా 1980, 1990 దశకాల్లో ముంబై మహానగరాన్ని తన చర్యలతో అల్లకల్లోలం చేశాడు. పాకిస్థాన్ టెర్రరిస్టులతో కలసి ముంబైలో బాంబుపేలుళ్లు జరిపి వందలాదిమంది మరణానికి కారకుడయ్యాడు. ‘డి’ కంపెనీని స్థాపించి ఎంతోమందిని తన అదుపాజ్ఞల్లో పనిచేసేలా చూసుకున్నాడు. తాను దుబాయ్ లో ఉంటూ బాలీవుడ్లో పెట్టుబడులు పెట్టడం, తనకు అడిగినంత నగదు ఇవ్వని వారిని బెదిరించడం, తనకు నచ్చినవారిని హీరోయిన్లుగా తీసుకోవాలని రికమెండ్ చేయడం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఎన్నో దుర్మార్గపు చర్యలతో పోలీసులను సైతం భయపెట్టాడు.

ఇప్పుడు ఈ మాఫియా డాన్ పై ఒక వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చీకటి జీవితంపై ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నాడు. మొత్తం ఐదు సీజన్లలో పది ఎపిసోడ్ లుగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియాలో తెలిపాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంంతెనతో కలసి ఈ వెబ్ సిరీస్ ను వర్మ రూపొందించనున్నాడు.

కాగా, చివరిసారిగా వర్మ ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా ‘ఆఫీసర్’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఒక్కరోజుకే బిచాణా ఎత్తేసింది. అపారమైన ప్రతిభ ఉన్నా దాన్ని సరైన దారిలో పెట్టకుండా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై వివాదాస్పద కామెంట్లు చేయడంతో వర్మ పతనం ప్రారంభమైంది. తనను ఎంతోమంది వాడుకున్నారని చెప్పుకుంటున్న శ్రీరెడ్డితో పవన్ కల్యాణ్ మాతృమూర్తిని తానే తిట్టించానని చెప్పుకోవడం ద్వారా వర్మ ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నాడు. ఈసారైనా తన అపార ప్రతిభతో దావూద్ పై తీస్తున్న వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తే వర్మ అభిమానులు సంతోషిస్తారు.