ఈసారి టీడీపీ తరపున విజయవాడ నుంచి లోక్ సభకు పోటీ చేసేది ఎవరంటే..

681

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, అతిపెద్ద వాణిజ్య నగరంగా విజయవాడకు పేరుంది. విజయవాడ రాజకీయాలు మొదటి నుంచీ హాట్ టాపిక్కే. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త అభ్యర్థి పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని పని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత సానుకూలంగా లేరని సమాచారం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేదా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

వాస్తవానికి.. విజయవాడ ఎంపీగా పోటీ చేసేంత సామర్థ్యం, విషయ పరిజ్ఞానం కేశినేని నానికి లేవు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో తెలుగుదేశం పార్టీ తరఫున కోవర్టుగా చేరి చివరి క్షణంలో పీఆర్పీపైన కుల ముద్ర వేసి బయటకు వచ్చారు.. నాని. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. పీఆర్పీని దెబ్బతీయడంలో నాడు తనకు సహకరించిన కేశినేని నానికి గత ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయించారు.. చంద్రబాబు. ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో దిట్ట అని చంద్రబాబుని ఎరిగినవారు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో కేశినేని నానికి ఈసారి మొండిచేయి చూపనున్నారని తెలుస్తోంది.

కేశినేని నానికి సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో దేవినేని ఉమా, గద్దె రామ్మోహనరావు వంటివారిని ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. చివరి క్షణంలో ఎవరైనా ఎన్ఆర్ఐ కూడా పోటీపడొచ్చని చెబుతున్నారు. మరోవైపు విజయవాడ నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ కు సీటు ఇవ్వడానికి చంద్రబాబు సముఖంగా ఉన్నారని అంటున్నారు. అయితే లగడపాటికి ఆసక్తి లేదని చెబుతున్నారు. అంతుచిక్కని వ్యూహాలతో ముందుకు వెళ్లే చంద్రబాబు విజయవాడ ఎంపీ సీటును చివరకు ఎవరికి కేటాయిస్తారో వేచిచూడాల్సిందే..