తెలంగాణ ఏపీకి నిరాశ.. గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు… వ్యక్తిగత ఆదాయపన్ను యథాతథం.. పది కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా

1236

కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు: (ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో కీలకాంశాలు)

వ్యవసాయ రంగం:

2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి.
ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచింది.
85 శాతం కన్నా ఎక్కువ మంది చిన్న, మధ్య తరగతి రైతులే.
గ్రామీణ వ్యవసాయ మార్కెట్ల ఏర్పాటుకు రూ. 2,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం.
చేపల పెంపకం, ఆక్వా కల్చర్ అభివృద్ధి, పశుసంరక్షణ కోసం రూ. 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం.
గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మంత్రిత్వ శాఖలు కలిసి రూ. 14.34 లక్షల కోట్లు చేశాయి.
పంట వ్యర్థాలను తగులపెట్టకుండా, ఇతర ప్రక్రియలో తొలగించడం కోసం ప్రత్యేక సబ్సిడీ.
ఆదివాసుల కోసం రూ. 56,000 కోట్లు

వైద్యం :

10 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ వైద్య పథకం
ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకం
1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు తెరుస్తాం.
ప్రతి మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు.

విద్యారంగం :

బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్ బోర్డు వైపు
ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచడానికి ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్ కోర్సు
నవోదయ విద్యాలయ తరహాలో ఆదివాసీ ప్రాంతాల్లో ఏకలవ్య విద్యాలయాల ఏర్పాటు

రైల్వే :

రైల్వేకు 1,48,528 కోట్ల కేటాయింపు.
4267 కి.మీ. రైలు మార్గం విద్యుదీకరణ.
4,000 కాపలా లేని క్రాసింగ్‌లకు ముగింపు
అన్ని రైల్వే స్టేషన్లలోనూ, రైళ్లలోనూ ఉచిత వై-ఫై
త్వరలో అన్ని టోల్ గేట్లలో నగదు చెల్లింపుల స్థానంలో డిజిటల్ చెల్లింపులు.
ముంబయి రైలు మార్గ విస్తరణకు రూ. 11,000 కోట్లు.

పరిశ్రమలు :

చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 3,700 కోట్లు

ఉద్యోగ కల్పన – ఉపాధి :

అన్ని రంగాలలో నూతన ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం 12 శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది.
తొలి మూడేళ్లలో మహిళా ఉద్యోగుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 8 శాతానికి తగ్గింపు. ఆ మేరకు ఉద్యోగులకు లబ్ధి
ముద్రా రుణాలకు రూ. 10.38 లక్షల కోట్లు

పర్యాటకం :

10 స్థలాలను థీమ్ పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేస్తాం.
10 ఆదర్శ కట్టడాల అభివృద్ధి.
99 నగరాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి
అక్రమ లావాదేవీలకు ఊతమందిస్తున్న అన్ని రకాల క్రిప్టోకరెన్సీపై నియంత్రణ.
రక్షణ ఉత్పత్తులలో ప్రైవేటీకరణ ద్వారా ఆధునీకరణకు దారులు సుగమం.
ఈ సంవత్సరానికి రూ. 80 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం. ఇందులో ఎయిర్ ఇండియా కూడా భాగం.

వేతనాలలో పెంపు:

రాష్ట్రపతికి రూ. 5 లక్షలు, ఉపరాష్ట్రపతికి రూ. 4 లక్షలు, గవర్నర్లకు రూ. 3.5 లక్షలు.
పార్లమెంటు సభ్యులకు ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించే ప్రతిపాదన.
ద్రవ్యలోటు తగ్గింది. ఈ సంవత్సరం రూ. 5.95 లక్షల కోట్లు.
పరోక్ష పన్నుల్లో 12.6 శాతం, ప్రత్యక్ష పన్నుల్లో 18.7 శాతం పెరుగుదల నమోదైంది.
రూ. 250 కోట్ల టర్నోవర్ గల కంపెనీలకు 25 శాతం కార్పొరేట్ టాక్స్ వర్తింపు.
రైతు కంపెనీలుగా రిజిస్టరు చేసుకున్న వాటికి 100 శాతం పన్ను మినహాయింపు
వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులు యథాతథం
కార్పొరేట్ పన్నులలో కంపెనీలకు రాయితీలు
లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ఇప్పుడు పన్నుల పరిధిలోకి. రూ. లక్ష వరకు కేపిటల్ గెయిన్స్‌పై 10 శాతం పన్ను.

 

తెలంగాణకు, ఏపీకి నిరాశ

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ గురించి గానీ, రాజధాని గురించి గానీ ప్రసంగంలో ఎక్కడా పేర్కొనలేదు.

గిరిజన యూనివర్సిటీకి రూ.10 కోట్లు

తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం రూ. 10 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2018-19లో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించారు. అదే విధంగా హైదరాబాద్ ఐఐటీకి రూ. 75 కోట్లు కేటాయించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది. దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్‌లోని అమరకంఠక్‌లో ఉండగా, ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ రెండోదిగా రికార్డులకెక్కనుంది.