ఈ రెండు పార్టీలు సినిమాలతో ఓట్లు సాధించేనా?

321

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది వేసవిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా తలపడనున్నాయి. వీటికితోడు ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ప్రత్యర్థుల పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ముక్కోణపు పోటీ జరగనుంది.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మినహాయించి మిగిలిన పార్టీలు ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి సోషల్ మీడియాలో, తమకు కొమ్ముకాసే పత్రికల్లో, టీవీ చానెళ్లలో, వివిధ వెబ్ సైట్లలో తమ గురించి గొప్పలు ప్రచారం చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రత్యర్థులపై విషం చిమ్ముతున్నాయి. ఈ విషయంలో అధికార తెలుగుదేశం ముందుంది. ఇందుకోసం ఆ పార్టీ కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చుపెడుతోంది.

అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ‘యన్టీఆర్’ అంటూ తన తండ్రి బయోపిక్ తో సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలకృష్ణే నటిస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ఈ చిత్రం వచ్చే ఏడాది ఎన్నికల ముందు విడుదలవుతుందని టాక్. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ‘యాత్ర’ పేరుతో ఒక సినిమాకు పరోక్షంగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఎన్నికల ముందు విడుదలవుతుందని సమాచారం. ‘యన్టీఆర్’, ‘యాత్ర’ ఈ రెండు సినిమాల ఉద్దేశం ఒకటే.. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలకు లబ్ధి చేకూర్చడం. ఈ మేరకు రెండు సినిమాల్లో ప్రజలను ఆకట్టుకునేలా సీన్లను రూపొందిస్తున్నారని వినికిడి. మరి చూద్దాం ఈ రెండు సినిమాలు ఆ రెండు పార్టీలకు ఏ మేరకు ఉపయోగపడతాయో లేదంటే కోట్లాది మంది అభిమానుల హీరో పవన్ కల్యాణ్ తన సత్తా చాటుతాడో..!